మన జీవితములో కొన్ని మలుపులు దేవునిచేత త్రిప్పబడతాయి. ఎవ్వరైతే దేవున్ని ప్రేమిస్తారో అన్ని (ప్రతికూల) పరిస్థితులు కూడా మేలుగా మారతాయి.(రోమా 8:28)
యోసేపు పొలాల్లో తిరుగుతోంటే ఒక మనిషి చూశాడు.
ఆ మనిషి-“ఏమిటి వెదుకుతున్నావు” అన్నాడు.
యోసేపు-“నేను నా అన్నల కోసం వెదుకుతున్నాను. వాళ్లు గొర్రెల్ని మేపుకొంటూ ఎక్కడ ఉన్నారో నీవు చెప్పగలవా?”
ఆ మనిషి-“అప్పుడే వాళ్లు వెళ్లిపోయారు గదా. వాళ్లు దోతాను వెళ్తాం అని చెప్పుకోవటం నేను విన్నాను”
కనుక యోసేపు తన అన్నలను వెతుకుంటూ దోతానుకు వెళ్లి వారిని అక్కడ చూశాడు.తర్వాత అన్నలు యోసేపును ఐగుప్తుకు బానిసగా అమ్మివేయటం, ఎన్నో కష్టాలగుండా యోసేపు వెళ్లి, దేవుని చిత్త ప్రకారం ఐగుప్తుకు గొప్ప పరిపాలకుడు అవ్వటం మనకు తెలిసిందే .
అతని జీవితంలో పైన చెప్పిన ఆ మనిషిని దేవుడే వాడుకున్నాడు. యోసేపు వెను వెంటనే ఇతని గూర్చి ఆలోచిస్తే, ఆ మనిషిని కలుసుకోక పోతే ఇన్ని కష్టాలు వచ్చేవి కాదని అనుకునే వాడేమో! కాని, సుదీర్ఘ జీవిత ప్రయాణంలో ఈ మలుపు దేవునిచేత మంచి కొరకే తిప్పబడిందని గ్రహించాడు.
అలాగే మన జీవితంలో మనం కలుసుకొనే కొన్ని చేదు అనుభవాల వెనుక దేవుని హస్తం ఉన్నదని, అది మంచికే దేవుడు పంపాడని, నేడు అది అర్ధం కాకపోయినా తర్వాత రోజుల్లో తెలుస్తుంది.
కొన్నిసార్లు ఇలా అనిపిస్తుంది..దేవునికి ఇలా జరుగుతుందని ముందే తెల్సు కదా! ఎందుకు తప్పించలేదు? అని. దాని జవాబు, దానిలో మంచి దాగివుంది. నీవు నేర్చుకోవలసిన పాఠాలు(గుణపాఠాలు), దేవుని చిత్త ప్రణాళికల కోసం సిద్దం చేస్తున్నాయని దానర్ధం. నీకు ఏం జరుగుతుందో అర్ధంకాని పరిస్థితుల్లో, నీకు అర్థమైన దేవుడు మంచి వాడని, ఈ లోక తండ్రి కంటే ప్రేమగలవాడని నమ్మి, ఓపికతో నిరీక్షణ కలిగి ఉండు.(రోమా 5:3,4)
దేవుని హస్తన్ని నువ్వు చుస్తే, దేవుని ఆలోచనలను చూస్తావు. అప్పుడు దేవునివాడవై, ఉన్నతమైన ఆత్మీయుడవౌతావు.
Comments
Post a Comment