★ఆ దినమందు అనేకులు నన్ను చూచి-"ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా?" అని చెప్పుదురు.
అప్పుడు -"నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని" వారితో చెప్పుదును.
"ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును". (మత్తయి 7:22,23,21)★
■ పైన చెప్పబడిన గుంపు అబద్ధమాడట్లేదు గాని, నిజంగానే దేవుని పేరిట ఆ కార్యాలు అన్ని చేశారు. వారి మాటను బట్టి చూస్తే వాళ్ళను వెంబడించేవారు అనేకులుండి ఉంటారు. వారు దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా ఉండటానికి గల కారణాన్ని దేవుడు స్పష్టంగా చెప్పాడు. దేవుని వాక్యానుసారంగా జీవించకుండా, దేవుని సేవ పేరిట తీరిక లేకుండా గడిపిన వ్యక్తులు. దేవుడు మనల్ని ఎలా జీవించమన్నాడో ఆ ప్రాముఖ్యమైన సత్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, దేవుని కోసమే జీవిస్తున్న భ్రమలో బ్రతకడం.. అది నిజంగా సాతాను కుయుక్తి బలైపోవడమే.
■ ఏది ప్రాముఖ్యమైనది? ఒకప్పుడు క్రీస్తు లేని మనమంతా దేవుని దృష్టిలో చెడ్డ ఫలాలను ఫలించే చెట్టు వంటివారము. మనం క్రీస్తును రక్షకునిగా స్వీకరించిన వెంటనే దేవుడు మనల్ని మంచి చెట్టుయైన క్రీస్తుతో అంటుకట్టుతాడు. క్రీస్తు యేసులోని ఆ సారమంతా చెడ్డచెట్టుగా ఉన్న మనలోకి ప్రవేశించి మనం మంచి ఫలాలను ఫలించేలా చేస్తుంది. అనగా, క్రీస్తు యేసుని సహవాసంలో మనం ఆయన వాక్యానుసారంగా నడుస్తున్నప్పుడు, ఆయన కృప వల్ల కలిగిన శక్తి ద్వారా వల్ల ఆయన్ను పోలి జీవిస్తాము.
"క్రీస్తులో నిలిచివుండి, ఆయనలోని జీవర్ధమైన సారం మనలోకి ప్రవహించడం" అనేది అంతం వరకు దేవుని ద్వారా కొనసాగే క్రియ.ఆ విధంగాక్రీస్తు స్వభావంలోకి పాలినవారమౌతాము. కనుక ఇప్పటికే నేను ఇది సాధించాను అని ఎవ్వరూ చెప్పకూడదు. అలా అనుకున్నట్లైతే మన పతనం ఆరంభమైనట్లే! పైగా క్రీస్తులో ఎదుగుతున్న కొద్దీ ఆయన సారూప్యతకు మనం ఎంత దూరంగా ఉన్నామో గ్రహిస్తాము. ఆయన అవసరం నాకు మరియెక్కువ ఉందని గ్రహించి దీనులమై ఆయన కృపపై మరియెక్కువ ఆధారపడతాము. అది ఆధ్యాత్మిక పురోగతికి గుర్తు. ఆయనతో అంటుకట్టపడిన (సహవాసం కలిగిన) ప్రతి వ్యక్తిని ఆయన గుర్తుపడతాడు.
■ కానీ, పైన చెప్పిన క్రైస్తవ జీవితానికి వేరుగా ఉండే మరొక అబద్ద క్రైస్తవత్వం ఉంది. ఆయన వారమని చెప్పుకుంటూ, "మేము ఇప్పటికే పరిణతి పొందాము. క్రీస్తు మా జీవితానికి అవసరం లేదు, ఎదుట వారికి చాలా అవసరం. వారికి సేవచేయ్యాలి" అన్నట్టుగా భావించే గుంపు. అట్టి వారు లోలోపల క్రీస్తులో యెండిపోయి, వ్యర్ధమైన వాగ్వావివాదాలతో కాలం వెళ్లబుచ్చుతూ, ఇహలోక పాపాలను రహస్యంగా ప్రేమిస్తూ తమ చర్యలను సమర్ధించుకుంటారు. అట్టివారు కొంత కాలానికి పూర్తిగా వేరు క్రీస్తు నుండి చెయ్యబడతారు. ఒకడు తన స్వేచ్ఛలో క్రీస్తు కృప నుండి బొత్తిగా వైరైపోయే అవకాశము ఉంది అని బైబిల్ చెప్తుంది(హెబ్రీ 6: 4-6,యూదా 1:5,6,12). అప్పుడు పూర్తిగా పాతకాలపు ఫలాలనే (అంతకంటే చెడ్డఫలాలను) ఆ వ్యక్తి ఫలిస్తాడు. తద్వారా క్రీస్తులో నిలిచివుండని, మారుమనస్సుకు తగిన ఫలాలను ఫలించని ఆ చెట్టు నరికివేయబడుతుంది.
■ కనుకనే మన స్థితిని కనిపెట్టుకుంటూ ఉంటూ, క్రీస్తులో నిలిచివుండాలని అపోస్తలులు హెచ్చరించారు. సాతాను బహు కుయుక్తిపరుడు. మనలోకి లోకాన్ని చాలా యుక్తిగా ప్రవేశపెట్టాలని చూస్తాడు. మనం కొంత ఏమరుపాటుగా ఉన్నట్లయితే మెల్లమెల్లగా, మనకు తెలియకుండానే లోకాన్ని మనలో ప్రవేశపెట్టగలడు. అది తుదకు విశ్వాస భ్రష్టత్వానికి నడిపిస్తుంది. కనుకనే ఎల్లప్పుడు పరిశుద్ధాత్మ హెచ్చరికలకు, దేవుని వాక్య గద్దింపులకు లోబడివుండి భయంతో వణకుతో మన రక్షణను కొనసాగించాలి. లేదంటే అనేకులు ప్రకటించిన తర్వాత మనం భ్రష్టులమైపోయే ప్రమాదం ఉందని పౌలు హెచ్చరించాడు(1 కొరింథీ 9:27). మన సేవా జీవితం ఎప్పుడూ కూడా మన ఆధ్యాత్మిక జీవితానికి కొలమానం కాదు. ఆధ్యాత్మికత ఆయనతో మనకున్న వ్యక్తిగత సహవాసమే.
యేసు-"నాయందు నిలిచియుండుడి, మీయందు నేనును నిలిచియుందును....ఎవడైనను నాయందు నిలిచియుండని యెడల వాడు తీగెవలె బయట పారవేయ బడి యెండిపోవును; మనుష్యులు అట్టివాటిని పోగుచేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును." (యోహాను15:4,6)
Comments
Post a Comment