💠"పేతురు రెండు సంకెళ్ళతో బంధింపబడి ఇద్దరు సైనికుల మధ్య నిద్రించుచుండెను, మరియు కావలివారు తలుపు యెదుట చెరసాల కాచుకొనుచుండిరి" (అ.కా 12:6)💠
🔶 అప్పటికి కొద్ది రోజుల క్రితమే హేరోదు, క్రీస్తు శిష్యుడైన యాకోబును ఖడ్గంతో చంపించి, యూదుల మెప్పు కోసం కూడా పేతురును చెరసాలలో వేయించాడు. పేతురు మరణానికి అతి సమీపంలో ఉన్నప్పటికీని.. పేతురు నిశ్చింతగా నిద్రపోతున్నట్లు మనం లేఖనాలల్లో చూస్తాము. కానీ ఇదే పేతురు ఒకప్పుడు ప్రాణ భయంతో ఉన్న వ్యక్తిగా మనకు తెల్సు(మత్తయి 8:25, 14:30, మార్కు 14:71)
అప్పటికి కూడా పేతురు విశ్వసే అయినప్పటికీ ప్రాణ భయంతో భయపడే వానిగా ఉన్నాడు. దానికి గల కారణాన్ని ప్రభువు చెప్పాడు. అదే "అల్ప విశ్వాసం" (మత్తయి 8:26, 14:31).
🔶 సమస్త పరిస్థితులు దేవుని అధీనంలో ఉన్నాయని సంపూర్ణంగా నమ్మి, ఆయనను ఆనుకోవడం విశ్వాసం. ఆయన అనుమతి లేకుండా విశ్వాసి జీవితంలో ఏమి జరగదని, ఆయన అనుమతితోనే ప్రతికూల పరిస్తితుల్లోకి మనం అడుగు పెట్టామని సంపూర్ణంగా నమ్మడం.
ఆ విశ్వాసమే క్రీస్తును పిలాతు ముందు దైర్యంగా నిలబడునట్లు చేసింది (యోహాను 19:11)
పరిపూర్ణమైన విశ్వాసంలోకి మనమందరం (ప్రతి విశ్వాసి)అడుగు పెట్టాలనేదే పరమ తండ్రి కోరిక. ఇది విశ్వాసిలో దేవుడు తన ఆత్మ ద్వారా ఆరంభించే కార్యం. క్రీస్తు పరిశుద్ధాత్మపూర్ణుడై దేవుని సంపూర్ణ అధీనంలో జీవించాడు. అపొస్తలలు పరిశుద్ధాత్మ చేత సంపూర్ణంగా నింపబడినప్పుడే వారి ప్రవర్తనలో గొప్ప మార్పును చూస్తాము. పరిశుద్ధాత్మ పరమ దేవుణ్ణి స్పష్టంగా మనకు చూపు సహాయకారియై ఉన్నాడు. మనపై దేవుని ఆధిపత్యాన్ని (ఆత్మ నింపుదలకు) మనం ఒప్పుకున్నప్పుడు మనలో కలిగే ఫలం-'విశ్వాసం'..విశ్వాస సంపూర్ణతలోకి దినదినం నడిపింపబడటం జరుగుతుంది.
🔶 కనుక రేపటిని గూర్చిన చింత, పరిస్థితుల గురించిన ఆందోళన, మరణ భయాలు ఇకను మనలను యెలవు.
అవన్నీ ఆయన అధీనంలో ఉంచబడివున్నాయి. దేని గురించి ఆందోళన చెందుతున్నావు? దేవుడు వాటన్నింటినీ పైన ఉన్నాడని గుర్తిస్తున్నావా?
Comments
Post a Comment