★యేసు జాలరియైన సీమోను పడవ ఎక్కి ఒడ్డు నుండి కొంచెం దూరం తోయమని అతన్ని అడిగాడు. అప్పుడాయన దానిలో కూర్చుని ప్రజలకు బోధించాడు. ఆయన బోధించడం అయిపోయిన తరువాత సీమోనుతో౼"పడవను లోతుకు నడిపి చేపలు పట్టడానికి వలలు వెయ్యి" అన్నాడు.
సీమోను"౼ప్రభూ! రాత్రంతా మేము కష్టపడ్డాం..కానీ ఏమీ దొరకలేదు. అయినా నీ మాటను బట్టి వల వేస్తాను” అని ఆయనతో అన్నాడు. వారలా చేసినప్పుడు విస్తారంగా చేపలు పడి వారి వలలు పిగిలి పోసాగాయి...
సీమోను పేతురు అది చూసి, యేసు ముందు మోకరించి౼"ప్రభూ! నేను పాపాత్ముణ్ణి, నన్ను విడిచి వెళ్ళు" అన్నాడు. అందుకు యేసు సీమోనుతో౼ "భయపడకు! ఇప్పటి నుంచి నీవు మనుషుల్ని పట్టే జాలరివౌతావు” అన్నాడు(లూకా 5:1-10) ★
■ సీమోను పేతురు అతని తోటి జాలరులు రాత్రంతా కష్టపడ్డారు కానీ ఫలితం శూన్యం. నిరాశతో వెనుదిరిగి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నప్పుడు యేసు వారి యొద్దకు వచ్చాడు. బైబిల్ అంతటిలో నిరాశ, కొదువ, ఒంటరితనం, అనారోగ్యం, దుఃఖం, నిరీక్షణలేని జీవితం, పాపపు బంధకాలు లాంటి వివిధ రకరకాలైన సమస్యలతో మనుష్యులు ఉన్నప్పుడు, యేసు అక్కడికి వచ్చిన వెంటనే ఆ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అది ఎటువంటి సమస్య ఐనప్పటికీ ఆయనే ప్రతి సమస్యకు సమాధానంగా ఉన్నాడు. ఇక్కడ సీమోను పేతురు సమస్య ఏమిటంటే ఆ దినపు జీవనోపాధి. ఆయన మాట చొప్పున వలలు వేసి విస్తారమైన చేపలు పట్టారు. ఇక్కడ పేతురు ప్రవర్తనను గమనించారా! "ప్రతి రోజు వచ్చి మాకు చేపలు పట్టడంలో సహాయం చెయ్యి, మా కుటుంబాలకు ఎంతో మేలుచేసిన వాడవౌతావు" అని యేసును కోరలేదు. లాభాలను గూర్చి లెక్కలు వేసుకొని ఆనందించలేదు, కాని తను పాపాత్మునని యేసు ముందు మొకరిళ్ళాడు. ఆ అద్బుతకార్యం యేసు ఎవరో గుర్తుపట్టడానికి, తన పాపపు స్థితిని గుర్తించడానికి సహాయపడింది. అద్భుతాలు, సూచక క్రియలు దేవుణ్ణి తెల్సుకోవడానికి/ కలుసుకోవడానికి మార్గాలు మాత్రమే! వాటి దగ్గరే ఆగిపోయి దేవుని దగ్గర మనకు ఇంకా ఏమైనా దొరుకుతుందేమో అని, దేవుడ్ని నిర్లక్ష్యం చేసి, దేవుని చేతి వైపు మాత్రమే చూడకూడదు.
■ అనేకులు తమ కొదువల్లో దేవుని దగ్గరకు వస్తారు అవి దేవుడు నుండి పొందాక దేవుడ్ని వదిలేస్తారు. ఏమైనా అవసరం వస్తే మళ్ళీ పరుగెత్తుకుంటూ వస్తారు. అటువంటి వారు దేవుని దగ్గర నుండి మేలులను పొందొచ్చేమో గాని దేవుని రక్షణ(దేవుని రాజ్యం)ను పొందుకోలేరు. వారు మారుమనస్సు పొందటానికి ఇష్టపడట్లేదు, తమ పాపముల నిమిత్తం సిలువలో మరణించిన రక్షకుణ్ణి, తిరిగి జన్మించడాన్ని ఎన్నడూ కోరుకోలేదు. వారికి దేవుని వద్ద నుండి ఈవులు మాత్రమే కావాలి. పేతురు తనకు దొరికిన చేపల రాశుల వైపు కాక దేవుని వైపు చూశాడు. ఒకవేళ వాటి మీదే దృష్టి పెట్టినట్లైతే, దేవుని అపోస్తలునిగా పేతురును చూసేవారము కాము.
■ దేవుని కన్ను యదార్ధవంతుల కోసం భూమి అంతటా వెతకుతుంది. యదార్ధవంతుడు తన పాపపు స్థితిని అంగీకరించువానిగా ఉంటూ, తన నిస్సహాయ స్థితిలో దేవునిపై ఆధారపడతాడు. కనుక దేవుడతణ్ణి తన ఆత్మతో నింపి, ఆయన సాక్షిగా నిలబెడతాడు. ఐతే "నాలో పాపం లేదు. చాలా మంది కంటే నేను నీతిమంతుడ్ని" అని చెప్పుకునే వానికి ఇక దేవుని అవసరం ఏముంటుంది?(వాస్తవానికి నీతిమంతుడు ఎవరూ లేరు). అటువంటి వారు తాను ఇతరుల కంటే బాగున్నాననే ఆ వంచనతోనే నశించిపోతారు.పాపాన్ని కప్పుకోక ఒప్పుకునే వారినే దేవుడు రక్షిస్తాడు. తన జ్ఞానాన్ని (అది బైబిల్ జ్ఞానమైనా) చూసి మిడిసి పడే వారిని సిగ్గు పరచడానికి లోకంలో అజ్ఞానులను దేవుడు ఎన్నుకుంటాడు. జ్ఞాని తన జ్ఞానాన్ని దేవుని ముందు పెట్టి దీనుడైతేనే వానిలో(వాని ద్వారా) దేవుని పని జరుగుతుంది. పేతురు అనేకులను దేవుని వైపు తిప్పే గొప్ప దేవుని సాధనంలా దేవుని చేతిలో వాడబడ్డాడు. కారణం.. అతను లోక ఆశీర్వదాలవైపు కాక దేవుని వైపు చూస్తూ, ఆయన పరిశుద్ధ వెలుగులో తన పాపాన్ని ఒప్పుకుని, పశ్చాత్తాపడి ఆయన్ను వెంబడించాడు. నీవు అలా చేసినట్లయితే పేతురు వాగ్ధానం నీదే అవుతుంది.
"భయపడకు! నీవు నాకు సాక్షిగా అనేకుల యెదుట నిలుస్తావు"
Comments
Post a Comment