💠 దేవుడు యోనాతో- "నీనెవె పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయెను గనుక నీవు లేచి నీనెవె మహా పట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము"......
యోనా ఆ పట్టణంలో ఒక రోజు ప్రయాణమంత దూరం వెళ్లి, యింకా 40 రోజుల్లో నీనెవె పట్టణం నాశనమవుతుందని ప్రకటన చేశాడు. నీనెవె పట్టణం వాళ్ళు దేవునిలో విశ్వాసం ఉంచి ఉపవాసం ప్రకటించారు. గొప్పవాళ్ళూ, సామాన్యులూ అందరూ గోనె పట్ట కట్టుకున్నారు...
నీనెవె వాళ్ళు తమ చెడు ప్రవర్తన వదిలిపెట్టడం దేవుడు చూసి తన మనస్సు మార్చుకుని వాళ్లకు వేస్తానన్న శిక్ష వెయ్యలేదు. (యోనా 1:2; 3:4,5,10)💠
◾ నీనెవె అహంకారంతోనూ, హింసాత్మకంగా, పూర్తిగా చెడిపోయిన క్రూరమైన పట్టణం. అటువంటి పట్టణానికి దేవుడు శిక్ష విధించాలనుకున్నాడు. కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన తీర్పులను భూమి పైకి పంపుతాడు. దేవుని మౌనాన్ని కొన్నిసార్లు ఆయనేమి పట్టించుకొనట్లుగా మనకు అనిపిస్తుంది కానీ ఆయన మౌనంలో కూడా ఆయన పనిచేస్తుంటాడు. ఆయన చెయ్యాలకున్న పనిని ఒక ఘడియ ఆలస్యం చెయ్యడు, ఒక ఘడియ ముందు చెయ్యడు గాని ఆయన సమయంలోనే చేస్తాడు. అయినప్పటికీ దేవుడు కనికరం గలవాడే కానీ శిక్షించాలని ఎదురు చూచువాడు కాదు. అందుకు పైన తెలిపిన లేఖన భాగం ఒక చక్కటి ఉదాహరణ.
◾ నీనెవె పట్టణం మారుమనస్సు పొందడానికి దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. మారుమనస్సు అనగా ఒకడు దేవునిచే ఒప్పింపబడి తన చెడు స్థితిని గ్రహించి ఉన్నపాటున దేవుని వైపు తిరగడం. యోనా దేవుని హెచ్చరికను నీనెవెకు ప్రకటించాడు. ఆ ప్రజలు దేవుని వాక్కుకు విధేయత చూపారు. ప్రకటించింది యోనా ఐనప్పటికీ ఆ మాటలు దేవునివని గుర్తించారు. పశ్చాత్తాపడి దేవునికి ప్రార్ధించారు (గొనె పట్ట అప్పటికి రోజుల్లో తమ దుఃఖాన్ని తెలియజేసే ఒక విధానం).
◾ దేవుడు నీతిమంతుడు, న్యాయమంతుడు మాత్రమే కాదు ఆయన గొప్ప తండ్రీ. సర్వోన్నతుడైన దేవుడు తన బిడ్డల పట్ల వాత్సల్యం చూపే తండ్రి వంటి వాడు. పాపం నుండి వెనుతీసి, దేవుని వైపు తిరిగిన (మారుమనస్సు పొందిన) మరుక్షణం, ఆ వ్యక్తి అప్పటి వరకు ఎంత పాపంలో ఉన్నప్పటికిని వాటి గూర్చి లెక్కలు అడగడు గాని వెంటనే తన అక్కున చేర్చుకుంటాడు. మనం ఎప్పుడు ఆయన వైపు తిరుగుతామో ఎదురు చూస్తుంటాడు. ఇది మన గమనానికి లేకపోయినా, ఇది నిజం!
◾ నీనెవె పట్టణం విషయంలోనూ దేవుడు అలాగే చేశాడు. నీనెవెతో మాత్రమే కాదు, ఆయన వద్దకు వచ్చే ప్రతి వ్యక్తితో దేవుడు అలాగే ప్రవర్తిస్తాడు. నేడు ఆయన మన వద్ద నుండి కోరేది ఒక్కటే.
౼ ఇప్పుడు ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ ఉన్నపాటున దేవుని వైపు తిరగడం.
౼ తప్పుడు జీవితం విషయంలో పశ్చాత్తాపడి దేవుణ్ణి క్షమాపణ కొరకు వేడుకోవడం.
౼ దేవుని మార్గంలో నిలవడం
ఐతే న్యాయవంతుడైన దేవుడు మనం చేసిన పాపానికి ఖచ్చితంగా శిక్ష విధించాల్సిందే! అదే సరైన న్యాయం. కనుకనే ఆ పాపం క్రీస్తుపై మోపి, ఆయన శరీరంలో మన పాపానికి శిక్ష విధించాడు. పరిశుద్ధుడైన క్రీస్తు రక్తం ప్రతి పాపాన్ని కడుగుతుంది. ఎందుకంటే క్రీస్తే మన పాపాలకు ప్రాయశ్చిత్త బలిగా అర్పించబడ్డాడు. ఆయన వద్ద క్షమించబడిన ప్రతి పాపానికి ఇకను శిక్ష ఉండదు.
క్రీస్తులో(దాగి) ఉన్న వారికి ఏ శిక్ష ఉండదు. ఆయనే రక్షకునిగా వారిని కాపాడుకుంటాడు.
Comments
Post a Comment