💠 ఆయన (యేసు) ఆ కొండమీదనుండి దిగి వచ్చినప్పుడు బహు జనసమూహములు ఆయనను వెంబడించెను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి-"ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవు" అనెను.
అందుకాయన చెయ్యి చాపి వాని ముట్టి-"నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని" చెప్పగా తక్షణమే వాని కుష్టరోగము శుద్ధియాయెను.
(మత్తయి 8:1-3)💠
◾ ఆ రోజుల్లో కుష్టరోగము వైద్యం లేని భయంకరమైన వ్యాధి. గొప్ప పాపాత్ములకు దేవుడు విధించే శిక్షగా ప్రజలు భావించేవారు. సొంత కుటుంబీకులకు, సమాజానికి దూరంగా వెలివేయబడి, శారీరక-మానసిక క్షోభకులోనవుతూ బ్రతికే దుర్భరమైన జీవితం. ఈ కుష్ఠు రోగి కూడా అటువంటి పరిస్థితిల్లో యేసుని గూర్చి విని, ఆయన తనను బాగుచేయగలడని నమ్మి, ఆయన్ను వెతుక్కుంటూ వచ్చాడు. ఆ రోజుల్లో జనసమూహంలోకి కుష్ఠు రోగులకు ప్రవేశం లేదు కానీ, ఆ కుష్ఠు రోగి ఏదో ఒక విధంగా ఆయన్ను సమీపించాడు.
◾ విశ్వాసం- అననుకూల పరిస్థితులను అధిగమిస్తుంది. ఎక్కడ విశ్వాసం ఉంటుందో దేవుని దృష్టి అటుగా మరలుతుంది. అతను యేసు దగ్గరకు రాకముందే, అతనిలో విశ్వాసం క్రియను ఆరంభించిన దేవుడు, ముందుగానే అతణ్ణి యెరిగి ఉన్నాడు. అతనితో పాటు ఇంకొంత మంది కూడా యేసుని గూర్చి వినివుండొచ్చు(లేదా ఇతనే తన తోడి కుష్ఠురోగులను తనతో కూడా పిలిచి ఉండొచ్చును). కాని యేసు తమను తమ వ్యాధి నుండి విడిపిస్తాడన్న విశ్వాసం వారు కలిగి లేకుండా ఉండొచ్చును. విశ్వాసం లేకుండా దేవుని కొరకు ప్రతికూల పరిస్థితులను అధిగమించి దేవుని వైపు తిరుగలేరు. దేవుడు మనుష్యులను, వారి అంతరంగాన్ని పరీక్షించే వానిగా ఉన్నాడు.
ఆ కుష్ఠు రోగి విశ్వాసాన్ని దేవుడు చూచాడు. క్రీస్తుకు ఇష్టమైతే స్వస్థపరచవల్సిందిగా కోరగా ఆయన చెప్పాడు-తనకు ఇష్టమేనని.
◾ క్రీస్తు- అదృశ్య దేవుని సంపూర్ణ రూపంగా మన మధ్యలో సశరీరునిగా జీవించాడు. విశ్వాసంతో దేవుణ్ణి సమీపించే ప్రతి వారిని దేవుడు ఇష్టపడతాడు(హెబ్రీ 11:6). దేవుడే మన ప్రతి ప్రశ్నకు సమాధానమై ఉన్నాడు. దేవుని వద్దకు వచ్చేవారు ఆయన నిజంగా ఉన్నాడని, ఆయన్ను సమీపించే వారిని ఆయన తప్పకుండా ఆదరిస్తాడని నమ్మాలి. ఆయన ప్రియ కుమారుడైన యేసును శిలువలో మన పాపాలకు ప్రాయశ్చిత్త బలిగా అర్పించడం ద్వారా ఆయన తన ప్రేమను మన పట్ల రుజువు చేశాడు. కుష్ఠురోగం జీవితాంతం శరీరాన్ని వేధిస్తే..'పాపం'-మానవుని ఆత్మను నిత్యత్వంలో సర్వకాలం దేవుని ఉగ్రత క్రింద (నరకంలో) ఉంచుతుంది.
🔹 ప్రియమైన చదువరి.. క్రీస్తు నీ పాపపు శిక్షను ఆయన తన శరీరంలో, ఆత్మలో భరించాడు. నీ పూర్తి క్షమాపణ క్రీస్తు వద్ద, క్రీస్తులో ఉంది. ఈ సత్యాన్ని నువ్వు గ్రహిస్తే, విశ్వాసంతో దేవుణ్ణి క్షమించమని కోరు. ఆయన తన రక్తంలో నీ ప్రతి పాపాన్ని కడిగి, ఒక కొత్త జీవితాన్ని ఇస్తాడు. అలా జరగనట్లైతే మన దోషాలకు మనమే జవాబుదారులంగా ఉంటాము. దాని అంతం దేవుని ఉగ్రత. ఒకసారి మానవుడు చనిపోయినట్లైతే తర్వాత ఈ అవకాశం ఇకను ఉండదు. నీకు ఇంకను దేవుని కృప అనుగ్రహించబడి ఉన్నది. ఆ కుష్ఠు రోగి క్రీస్తును సమీపించి శుద్ధుడైనట్లుగా, నీ పాపపు జీవితం నుండి విడుదల పొంది, పరలోక దేవుని కుమారుడిగా క్రొత్త జీవితం పొందు..పాపం నుండి దేవుని వైపు తిరుగు ప్రతి ఒక్కరి నిమిత్తం దేవుడు ఎదురుచూస్తున్నాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు.
Comments
Post a Comment