✴ దేవుని దృష్టిలో లోకం చెడిపోయింది. అది హింసతో నిండిపోయింది. దేవుడు లోకాన్ని చూడగా అది చెడిపోయి ఉంది. భూమిమీద మనుషులందరూ తమ మార్గాల్లో చెడిపోయారు.
అయితే నోవహు యెహోవా దృష్టిలో అనుగ్రహం పొందాడు. నోవహు నీతిపరుడు. అతని తరం వాళ్ళల్లో నింద లేనివాడు. నోవహు దేవునితో కలసి నడిచాడు. (ఆది 6: 11,12, 8 )✴
■ నోవహు దినాల్లో ప్రజల అక్రమము ప్రబలిపోయింది. హింసతోను, దురాక్రమణతో నింపబడి..దేవుడు-'నేను నరుణ్ణి ఎందుకు చేశానని' నొచ్చుకునేంతగా చెడుతనం విస్తరించింది. ఎవరి మూలంగా మనిషి ఉనికిలోకి వచ్చి ఈ లోకంలో బ్రతుకుతున్నాడో, ఆయన్ను విడచి, మరచి తమ సొంత మార్గాల్లో ఇష్టానుసారంగా జీవిస్తూ తమ నడత లను చేరిపి వేసుకున్నారు. ప్రతి మనిషి విషయంలో దేవుడు నిర్దిష్టమైన, శ్రేష్టమైన ప్రణాళికలను ముందుగానే కలిగి ఉంటాడు. అది దేవుడు వారి మేలు కోసమే ఏర్పాటు చేసిన మంచి మార్గం. దానికి అవతలనున్న దేవుడు లేని ప్రతి మార్గం శరీర సంబంధమైనదై లోకపు దురాశలతో పాపంతో నిండి ఉంటుంది. ఐతే మంచిని చెడును తమ స్వేచ్ఛలో నుండి కోరుకునే దేవుని లాంటి లక్షణాలతో నరుడు పుట్టించబడ్డాడు. అలాంటి స్వేచ్ఛ నరునికి దేవునిచే ఇవ్వబడింది. దేవుడు లేని జీవితం మనం అంతిమ గురిని ఊహించలేని భ్రమలోకి తీసుకెళ్తుంది. కనిపిస్తున్న ఇదే శాశ్వతం అనే భ్రమలోకి తీసుకెళ్తుంది. ప్రతి దానికీ (వ్యక్తికి) దేవుడు ఒక అంతాన్ని నియమించాడు. నేడు కనిపిస్తున్నదేది శాశ్వితం కాదు!!
■ కానీ నోవహు వారి మధ్యలో 'దేవునితో కూడా నడిచినవాడని' దేవునిచే సాక్ష్యం పొందాడు. అంటే ఎవరు దేవుణ్ణి అనుసరించినా, అనుసరించకపోయినా తాను, తన ఇంటివారితో దేవుణ్ణి సేవించాలనే కోరికగలిగిన వ్యక్తి. లోకమంతా పోతున్న మార్గం కంటే దేవుని మార్గాన్నే (మాటనే) అనుసరించిన వ్యక్తి. జలప్రళయం రాకమునుపే దేవుడు నోవహును ఒక పెద్ద ఓడను నిర్మించమని చెప్పాడు. అతను అలాగే చేశాడు. నోవహు విధేయత అప్పట్నుంచి వచ్చింది కాదు, అంతకు మునుపే అతను దేవునితో నడచిన వాడనే సాక్ష్యం పొందాడు. అనగా నోవహు దేవుని ప్రతి చిన్న మాటకు విధేయత చూపుతూ, ఆయన మార్గాలను గౌరవించి అనుసరించిన వాడు. ఒకవేళ దేవుడు ప్రజలందరితో- 'జలప్రళయం రాబోతుంది కనుక మనుష్యులంతా తమ కొరకు ఓడలను నిర్మించుకోండని' దేవుడు చెప్తే ఎంతమంది ఆ మాటకు విధేయత చూపుతారు? నోవహు తప్ప ఏ ఒక్కరు కూడా విధేయత చూపరు. కనీసం నోవహు నిర్మించిన ఓడలోకే వారు ప్రవేశించలేదు. దేవుడు ఆయన మాటను వినే వారికే చెప్తాడు.
■ అలాంటి వారే ఆయనతో నడవగలరు. దేవుని మాట(మార్గం) పట్ల ఆసక్తి లేని వారికి (అవిధేయులకు) ఆయన స్వరం వినబడదు. ఆ ప్రజలైతే దేవుని మాటలను అవహేళన చేసి అకస్మాత్తుగా నశించిపోయారు. ఇక్కడ తమ మార్గాలను చెరుపుకున్న వారు మరియు దేవుని మార్గాలలో నిలిచి ఉన్నవారు మనకు కనిపిస్తారు. మనం ఈ రెండింటిలో ఎదో ఒక దానిలో ఉంటాము. కానీ సమయం వుండగానే మెలకువగా ఉండి మన మార్గాలను దేవునికి అప్పగించి నోవహు వలె ప్రతి చిన్న విషయంలో దేవుని స్వరానికి విధేయత చూపుటను నేర్చుకుందాం! అట్టి వారు ఆయన పరిశుద్ధ మార్గాల్లో నిలిచి, ఒకడు వెలుగులో నడిచినట్లు ధైర్యంగా ముందుకు నడవగల్గుతారు.
Comments
Post a Comment