★ యేసు సుంకరియైన మత్తయి ఇంట్లో భోజనానికి కూర్చున్నప్పుడు చాలా మంది అన్యాయస్థులైన పన్నులు వసూలు చేసే వారూ, పాపులూ వచ్చి ఆయనతోనూ, ఆయన శిష్యులతో పాటు కూర్చున్నారు.
మతనిష్ఠ గల పరిసయ్యులు అది గమనించి౼“మీ బోధకుడు పన్ను వసూలు చేసే వారితో, పాపులతో కలిసి తింటున్నాడేంటి?” అని ఆయన శిష్యుల్ని అడిగారు.
యేసు అది విని౼“ఆరోగ్యంగా ఉన్నవారికి వైద్యుడు అవసరం లేదు. రోగులకే అవసరం. నేను పాపులను పశ్చాత్తాపానికి పిలవడానికే వచ్చాను, నీతిపరులను కాదు.” అని చెప్పాడు. (మత్తయి 9:10-13) ★
■ పరిసయ్యులు దేవునికి కానుకలు ఇచ్చే విషయంలో, విశ్రాంతి దినం-పవిత్ర పండుగలను ఆచరించడంలోనూ ఎంతో మతనిష్ఠను పాటిస్తారు మరియు నిత్యం ఉపవాసాలతో, ప్రార్ధనల్లో తాము ఉంటారు గనుక తామే పవిత్రలమని అనుకుంటారు. మత నిష్ఠలేని, తప్పుడు పనులు చేసే వారంతా పాపాత్ములనేది వారి భావన. కనుక వారితో కలిసి భోజనం (సహవాసం) చెయ్యడానికి కూడా ఇష్టపడరు. అలా చేయడం ద్వారా దేవుడు తమ పట్ల ఎంతో సంతోషిస్తాడని భావిస్తారు.
■ కానీ దేవుని స్వభావం అందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. యేసు పాపుల స్నేహితునిగా పిలవబడ్డాడు. ఎందుకంటే ఆయన ఎల్లప్పుడూ వారి మధ్యలో జీవించాడు. భూమిపై నివసించిన అత్యంత పరిశుద్ధుడైన యేసు ఎన్నడూ వారిని చిన్న చూపు చూడలేదు. వారిని ప్రేమించాడు, వెతుక్కుంటూ వెళ్ళాడు (లూకా 19:20). శాస్త్రులు పరిసయ్యుల ప్రవర్తనకు యేసుకు ఎంతో వ్యత్యాసం ఉండేది. కనుకనే పాపం చేసిన అనేకమంది యేసు దగ్గరకు రావడానికి ఇష్టపడ్డారు. ఆయన సహవాసంలో వారు మారుమనస్సు పొంది, క్రొత్త జీవితాన్ని ఆరంభించారు.
దేవుని వల్ల కలిగిన పవిత్రత వెలుగు వంటిది, చీకటిలో ఉన్న వారికి వాని స్థితిని గుర్తించి వెలుగులోకి వచ్చేట్లు ప్రేమిస్తుంది.
■ దేవుని పని ఒకనిలో ఆరంభం కావాలంటే ఖచ్చితంగా తన స్థితిని తాను యదార్ధంగా ఒప్పుకునేవానిగా ఉండాలి. బాహ్యంగా కనిపించే మత భక్తి ఎవ్వరిని పవిత్రునిగా చేయలేదు. మానవునికి అంతరంగ శుద్ధి అవసరం. అది దేవుని మూలంగానే జరగాల్సి ఉంటుంది. కొన్ని ఇతరులు చేస్తున్న పాపాలు మనం చేయట్లేదు కాబట్టి మనం నీతిపరులం అని అనుకోకూడదు. అది ఎలాంటి పాపమైనా దేవుని దృష్టిలో పాపమే. మనమంతా దేవుని పరిశుద్ధ మహిమను కోల్పోయిన వారముగా ఉన్నాము! కనుక ఎవ్వరూ ఎవర్ని చూసి అతిశయింప తగదు. మనం అతిశయిస్తున్నట్లైతే అది దేవుని ద్వారా కలిగిన పవిత్రత కాదు. అది మన స్వనీతి! దేవుని నుండి కలిగిన పవిత్రత ఆయన పాపులతో ప్రవర్తించిన విధంగానే ప్రవర్తింపజేస్తుంది (ఎందుకంటే ఒకప్పుడు మన అసహ్య జీవితాలను చూసి దేవుడు త్రోసివేయక ప్రేమించాడు, ఇప్పుడు ఆ స్థితిలో ఉన్నవారిని పట్ల కూడా కనికరాన్నే చూపుతుంది).
౼ కాబట్టి ఎవరు తమను తాము రోగి(పాపి) గా గుర్తిస్తారో పరమ వైద్యుడైన క్రీస్తు కృపను, క్షమాపణను పొందుతారు. దేవుని స్నేహం అట్టి వారితో ఉంటుంది.
ఎవరైతే తాము చేస్తున్న మంచి పనులను బట్టి, మత నిష్ఠ కలిగిన కార్యాలను బట్టి తాము 'నీతిమంతులం' ఉప్పొంగుతారో వారు దేవుని మహిమలోకి ఎన్నడూ ప్రవేశించలేరు. పరలోకంలో (స్వ)నీతిమంతులు ఉండరు గాని..యదార్థవంతులైన క్షమించబడిన పాపులే అక్కడ ఉంటారు.
Comments
Post a Comment