❇ యేసు నాయీను అనే ఒక ఊరికి వెళ్తున్నాడు. ఆయన శిష్యులు, ఇంకా పెద్ద జనసమూహం ఆయనతో వెళ్తున్నారు. ఆయన ఆ ఊరి పొలిమేరకు వచ్చినప్పుడు కొందరు చనిపోయిన వాణ్ణి మోసుకుపోతూ ఎదురయ్యారు. చనిపోయిన వాడు అతని తల్లికి ఒక్కగానొక్క కొడుకు. ఆమె వితంతువు. గ్రామస్తులు చాలామంది ఆమెతో ఉన్నారు.
ప్రభువు ఆమెను చూసి ఆమెపై జాలిపడి౼“ఏడవ వద్దు” అని ఆమెకు చెప్పి, దగ్గరికి వచ్చి ఆ పాడెను ముట్టుకున్నాడు. దాంతో దాన్ని మోసేవారు నిలబడి పోయారు.
యేసు౼“చిన్నవాడా, నేను చెబుతున్నాను, లే!” అన్నాడు. ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుని మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆయన అతణ్ణి ఆ తల్లికి అప్పచెప్పాడు.
అందరూ భయంతో నిండిపోయి౼”మనలో గొప్ప ప్రవక్త లేచాడు. దేవుడు తన ప్రజలను సందర్శించాడు” అంటూ దేవుణ్ణి కీర్తించారు. ❇
■ విధవరాలి కుమారునికి ఆ మరణాన్ని అనుగ్రహించినది ఏవరు? దేవుడే కదా! మరి ఆయనే ఆమె దగ్గరకు వచ్చి 'ఏడవవద్దు' అని పలకడం నాటకీయంగా లేదా!మానవ జ్ఞానంతో దేవుని మనస్సును ఎన్నడూ అర్ధం చేసుకోలేము. క్రీస్తు ఆ చిన్నవాడ్ని చావు నుండి లేపాడు. కాని కొన్ని సంవత్సరాలుకు అతను మళ్ళీ చనిపోయాడు. అంటే ఇక్కడ చావునుండి లేపటం కంటే విలువైనది ఎదో ఉందని గ్రహించాలి. క్రీస్తు ఈ లోకానికి రావడం వెనుక ఉదేశ్యం అద్భుతాలు, అనారోగ్యాలు బాగుచేయడం కోసమా? కాదు గాని, మన పాపాల నుండి మనల్ని విమోచించి, చెడిపోయిన దైవ-మానవ సంభంధాన్ని తిరిగి బాగుచేసి, ఆయనకు ప్రియ బిడ్డలుగా చేయడానికే రక్షకునిగా వచ్చాడు. దేవుడు పంపే ప్రతి భాధ కన్నీరు వెనుక ఒక ఉద్దేశ్యం ఉంటుంది. అవన్నీ నిన్ను దేవుడు కలుసుకోవడానికి ఏర్పాటు చేసిన మార్గాలు. దాని బట్టి ఒంటరిగా, నిస్సహాయునిగా నీవు కుమిలిపోతుంటే అవి అనుమతించిన దేవుడు కూడా కుమిలిపోతాడు (క్రీస్తులో దేవుని స్వాభావాన్ని స్పష్టంగా చూడొచ్చు). ఐతే దానిలో నీకు నిత్యమేలు దాగివుంటుంది. ఆ తాత్కాలిక భాధ కంటే, తర్వాత పొందే ఆత్మీయ దీవెనే నీకు ఎక్కువ మేలు చేస్తుంది కనుక అనుమతిస్తాడు.
■ ఇక్కడ క్రీస్తు జరిగించిన అసాధారణ అద్భుతం ద్వారా, ఆయన ఎవరో పరమ తండ్రి సాక్ష్యం పలుకుతున్నాడు. ఆయన్ను విశ్వసించి, ఆయన మాట వినాలని దేవుడు ఉద్దేశిస్తున్నాడు. ఆ రక్షకుడైన క్రీస్తును ఆశ్రయించి ఆయన ప్రకటించే దేవుని రాజ్యానికి వారసులవ్వాలని దేవుని వాంఛ. ఆమె ఇంటివారే కాదు, ఆ ఊరి వారు, ఆ మాటలు విన్నవారు, ఆ సంఘటన గూర్చి విన్న ప్రతి తరం వారు క్రీస్తులో తమ రక్షకుణ్ని చూడాలని దేవుడు ఆశించాడు. మనం పొందే తాత్కాలిక భాధ కంటే ఈ దీవెన ఎంత గొప్పది. ప్రతి సూచక క్రియ౼మనకు క్రీస్తు దైవత్వాన్ని, దేవుని లక్షణాలను, దేవునికి మనపై ఉన్న ప్రేమను తెలియజేస్తుంటాయి. అవన్నీ మనం క్రీస్తును పాప విమోచకునిగా కలుసుకోవడానికి దారులని సిద్ధం చేస్తాయి. కొందరు అద్భుతాలు, స్వస్థతల వద్దే ఆగిపోతారు. అందుకోసమే వెంబడిస్తారు. తమ సొంత ఆత్మలను, రక్షణను నిర్లక్ష్యం చేసి నశించిపోతారు. భూసంభందమైన క్రైస్తవత్వం. అది నకిలీ క్రైస్తవత్వం. అది బోధించే వారు నేడు అనేకులు. క్రీస్తును పాప విమోచకునిగా, తమ సొంత రక్షకునిగా అంగికరించి, పాత జీవితాన్ని విడిచి క్రీస్తును హత్తుకున్నప్పుడే నీవు నిజ క్రైస్తవుడవు. ఆత్మ రూపాంతరం చెందకుండా (మారుమనస్సు లేకుండా) ఎవ్వడూ క్రైస్తవుడు కాలేడు. అందుకోసమే ప్రభువు ఈ లోకానికి వచ్చి, మరణించి-తిరిగి లేచాడు.
౼ఒకవేళ ఇప్పటికే ఆయన ద్వారా నీ జీవితంలో అద్భుతాలు, స్వస్థతలు జరిగించి ఉండి ఉండొచ్చు, కానీ ఇప్పటివరకు క్రీస్తును నీ వ్యక్తిగత జీవితంపై అధికారం కలిగి, పరిపాలించే ప్రభువుగా నిలుపుకోకపోతే ఇప్పుడే ఆ తీర్మానం చేసుకో! నీ పాపాల విషయమై పశ్చాత్తాపడి, ప్రభువును హృదయపూర్వకంగా నీకు రక్షకునిగా నిలుపుకుని, క్రీస్తులో క్రొత్తగా పుట్టు. అప్పుడు పాతజీవితం గతిస్తుంది! అంతా క్రొత్తవిగా మారతాయి.
Comments
Post a Comment