వారు ఆయనతో౼“బోధకా! ఈ స్త్రీ వ్యభిచారం చేస్తూ పట్టుబడింది. ఇలాంటి వారిని రాళ్ళతో కొట్టి చంపాలని ధర్మశాస్త్రంలో మోషే ఆదేశించాడు కదా! నువ్వేమంటావ్?” అని అడిగారు.ఆయన మీద ఎలాగైనా నేరం మోపాలని ఆయనను పరీక్షిస్తూ ఇలా అడిగారు. అయితే యేసు విననట్టు తన వేలితో నేల మీద ఏదో రాస్తూ ఉన్నాడు. వారు పట్టు విడవకుండా ఆయనను అడుగుతూనే ఉన్నారు.
ఆయన తల ఎత్తి చూసి౼“మీలో పాపం లేనివాడు ఆమె మీద మొదటి రాయి వేయవచ్చు” అని వారితో చెప్పి మళ్ళీ వంగి వేలితో నేల మీద రాస్తూ ఉన్నాడు. ఆయన పలికిన మాట విని పెద్దా చిన్నా అంతా ఒకరి తరువాత ఒకరు బయటకు వెళ్ళారు. చివరికి యేసు ఒక్కడే మిగిలిపోయాడు. ఆ స్త్రీ అలానే మధ్యలో నిలబడి ఉంది... ❇
■ ఈ సన్నివేశాన్ని ఇలా ఊహించవచ్చు! ఒకవైపు ధర్మశాస్త్రం! మరోవైపు క్రీస్తు! మధ్యలో పాపం చేసిన నరుడు! ఎదురుగా అపవాదియైన సాతాను! సాతాను యొక్క నేరారోపణ నిజమైనదే! ఆ స్త్రీ నిజంగానే పాపం చేసి,నిస్సహాయక రాలిగా నిలిచివుంది.దేవుని నీతిని బట్టి చూస్తే ఖశ్చితంగా ఆమె శిక్షకే అర్హురాలు. సాతాను నేరారోపణకు బలం దేవుని ఆజ్ఞ! దానిని ఆధారం చేసుకొనే అపవాది వ్యక్తులపై నేరం మోపి, శిక్ష విధించాలని డిమాండ్ చేస్తాడు. ఇప్పుడు క్రీస్తు ధర్మశాస్త్రాన్ని బట్టి పాపిని శిక్షించాలా(అప్పుడు ఆయన రక్షకుడు అవ్వడు)? లేదా ధర్మశాస్త్రాన్ని వ్యతిరేకించాలా(అప్పుడు ఆయన పాపే అవుతాడు)? ఈ సంఘటనలో అపవాది మొదట గురి యేసే! ఆయన్ను చేజిక్కిచుకోవాలనే అపవాది మనుష్యులను ప్రేరేపించాడు.క్రీస్తును పాపంలో పడవేస్తే, లోకానికి రక్షణే ఉండదు(కనుక మనందరి కంటే క్రీస్తు ఎంత బలమైన శోధనల గుండా వెళ్ళివుంటాడో ఊహించవచ్చు!)
■ అప్పటికే ధర్మశాస్త్రం ప్రకారం ఎంతో మంది వ్యభిచారులు తీర్పు తీర్చబడి రాళ్లతో కొట్టి చంపబడ్డారు. "పాపం లేనివాడే మొదటి రాయి వెయ్యాలి" అనే మాట ధర్మశాస్త్రంలో కూడా ఉన్నట్లయితే మోషే కాలము నుండి క్రీస్తు వరకు కూడా ఏ వ్యభిచారి కూడా శిక్ష పొంది ఉండేవారు కారు(నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు). ధర్మశాస్త్రం మనకొక రక్షకుడు అవసరం అని తెలియ జేస్తుంది. ఖశ్చితమైన కొలబద్ధ ఉపయోగిస్తే పాపిని శిక్షించే హక్కు- పాపం లేని క్రీస్తుకు తప్ప ఈ లోకంలో మరెవరికి లేదు. కానీ భూమిపై అత్యంత నీతిమంతుడైన క్రీస్తు ఆమెను మన్నించాడు. ఇకపై పాపం చెయ్యొదని చెప్పాడు. ఈ విమోచన ఉరకనే రాలేదు గాని ఆ స్త్రీకు రావాల్సిన శిక్షను క్రీస్తు తానే సిలువలో భరించాడు. ఆ స్త్రీ పాపం కోసం మాత్రమే కాదు గాని నా/నీ పాపం యొక్క పూర్తి శిక్షను కూడా ఆయన భరించాడు. లోక పాపము యొక్క ప్రాయశ్చిత్తము కొరకు క్రీస్తు బలి పశువులా వధించబడ్డాడు. మన పాపం వల్ల-ధర్మశాస్త్రాన్ని బట్టి వచ్చిన ఉగ్రత అనే ఖడ్గం నిర్దోషమైన గొఱ్ఱె పిల్లయైన క్రీస్తుపై పడింది. పాపం లేని క్రీస్తు తన శరీరంలో ఆ శిక్షను భరించడం బట్టి పాపం యొక్క క్రయధనాన్ని సంపూర్తిగా చెల్లించాడు. ధర్మశాస్త్రం ఏమాత్రము పాపిని రక్షించలేదు (పాపం నుండి విడిపించదు) కానీ న్యాయంగా తీర్పు తీర్చుతుంది. క్రీస్తు దాని నీతిని సంపూర్ణంగా నెరవేర్చి, ధర్మశాస్త్రపు కాడి నుండి మనల్ని విడిపించి, కృప చూపి పాపిని రక్షించడానికే ఈ లోకానికి వచ్చాడు.
★ నిన్ను క్షమించగల రక్షకుడు క్రీస్తు ఒక్కడే అని హృదయపూర్వకంగా విశ్వాసం ఉంచి, పాపములు విషయమై పశ్చాత్తాపం పడితే దేవుడు ఒక నూతన జీవితాన్ని అనుగ్రహిస్తాడు. ఆ నిత్యజీవితం ప్రేమామయుడైన దేవునితో, నిరంతర పరిశుద్ధ సహవాసమే! ఈ సత్యంలో నిలిచి, మారుమనస్సు పొంది రక్షణ పొందుతావా?
Comments
Post a Comment