❇ పౌలు౼"ఆయన మనలో ఎవరికీ దూరంగా ఉండేవాడు కాదు. మనం ఆయనలో బతుకుతున్నాం, ఆయనలోనే మన కదలికలూ ఉనికీ ఉన్నాయి"
(అపో 17:27,28) ❇
■ నీ కంటూ భూమిపై ఏ ఉనికి లేనప్పుడు, నీవేవరో నీకు జ్ఞప్తిలేని సమయానికి, ఏ బంధుత్వాలు నిన్ను అలుముకోనప్పుడు,ఈ లోకానికి౼చివరికి నీ కన్న తల్లిదండ్రులు సైతం నీవేవరో తెలియనప్పుడు,నీవు పుట్టక మునుపే నిన్ను స్పష్టంగా తెలుసుకొని ఉన్న వాడు దేవుడే. ఆయనే నీ ఉనికికి కారణం, ఆయన ఆలోచనలే నీకు రూపాన్ని ఇచ్చాయి. నీ పుట్టుక ఆయన ఎంపిక! ఆయన నిర్ణయించిన స్థలంలో నీవు ఇప్పుడు ఉన్నావు. నీ పట్ల దేవుని ఆలోచనలు (ప్రణాళికలు) ఈ భూమికి పునాదులు వేయకముందే నిర్ణయింపడ్డాయి. నిన్ను కలుసుకోవడానికి ఆయన ఒక దినం నీ కోసం నియమించాడు. నీ మనస్సు నీ సృష్టికర్తను వెతకక ముందే, ఆయనే మొదట నిన్ను వెతికి, నీకు ప్రత్యక్షమైనాడు. నీ తల్లిదండ్రులు, భార్యాపిల్లలు, స్నేహితులు, బంధుమిత్రులు ఒక్కరొకరిగా నిన్ను విడిచి వెళ్ళిపోతారు గానీ శాశ్వతంగా నిలిచిపోయే భంధం దేవునిదే! నీవు దేవుని సొత్తు!
■ సర్వశక్తిగల దేవుడు నీ మేలు గూర్చి ఆలోచించడం ఎంత గొప్ప సంగతీ! నీ ప్రతి బలహీనతలు, బలాలు, భావోద్వేగాలు, యిష్టాలు, అయిష్టాలు, నీ అంతరంగ ఆలోచనలు సమస్తం దేవుడు యెరిగివున్నాడు. నిన్ను అర్ధం చేసుకుని, నీకు సహాయకునిగా నిలవగలిగే మంచి స్నేహితుడు దేవుడే! మేలు కోరి గాయాలు చేస్తాడు, మళ్ళీ ఆ గాయాలను తానే కట్టి మాన్పుతాడు. ఆ సమయంలో గొప్ప ఆధ్యాత్మిక సత్యాలను నేర్పుతాడు. ఆయనే గొప్ప నీకు గురువు, బోధకుడు! కొన్నిసార్లు పరిస్థితులను నీవు ఉహించనట్లుగా త్రిప్పుతాడు, ఏం జరుగుతుందో అర్ధం కాని సమయంలో దేవుని విశ్వాస్యతను నమ్మి హత్తుకుని, నడుస్తున్నప్పుడు.. కొన్ని రోజులకు ఆయన అందంగా మలచిన పరిస్థితుల అమరికను తలచుకొని కృతజ్ఞతతో తలవంచి, ఆరాధిస్తావు. నీ జీవిత ప్రయాణంలో నీతో పాటే నడిచే నమ్మకమైన బాటసారి ఆయన. నిర్దోషివైన నిన్ను నీ సహోదరులు నిన్ను వంచించినప్పుడు నీ పక్షాన కలుగజేసుకునే న్యాయాధిపతి! నిరీక్షణ ఏ మాత్రం లేక ఎడారిగా ఉన్న నీకు,జీవజల ఒయాసిస్సు, నీ శ్రమలో నీవు నమ్ముకోదగిన సహాయం-ఓదార్పు దేవుడే!
★ తను ప్రేమించిన, తన కుమారుడైన యేసును నీ కోసం ఇచ్చిన పరమ తండ్రి, క్రీస్తుకు ద్వారా సమస్తానికి నిన్ను వారసునిగా చెయ్యాలని, యేసులో నిన్ను దాచి, (ఐఖ్యపరచి) తన ప్రేమంతా కుమ్మరించేసాడు. ఆయన ఇక ఏది దాచుకోలేదు!మనం అందుకు అర్హులమని కాదు! ఆయన ప్రేమైయున్నాడు గనుక! ఆరాధన భావంతో నీ పరమతండ్రిని చేరుకో! ఆయన నీ హృదయమనే తలుపు వాకిట ఉన్నాడు..తన స్నేహానికి పిలుస్తున్నాడు.. ఆయన లేకుండా మిగిలి ఉన్నదంతా నోరు తెరిచివున్న నాశనకరమైన పాపపు గుంట.దాని అంతం నిత్యదండన!దానిలో ఇప్పటికే ప్రవేశించిన వారు అనేకులు! క్రీస్తు ప్రేమను చులకనగా చూసి, వెడలిపోకు! పరమతండ్రి హృదయానికి గాయం చెయ్యకు!
Comments
Post a Comment