❇ యేసు ఒక కథ చెప్పాడు–"తన పొలంలో మంచి విత్తనాలు చల్లించిన రైతులా పరలోకరాజ్యం ఉంది. ఆ రైతు పనివాళ్ళు నిద్రపోతూ ఉంటే, అతని శత్రువు వచ్చి గోధుమల మధ్య కలుపు మొక్కల విత్తనాలు చల్లి పోయాడు. మొక్కలు పెరిగి కంకులు వేసినప్పుడు ఆ కలుపు మొక్కలు కూడా కనిపించాయి.
అప్పుడు పనివాళ్ళు ఆ రైతు దగ్గరికి వచ్చి౼"అయ్యా, నీవు నీ పొలంలో మంచి విత్తనం చల్లించావు గదా! అందులో కలుపు మొక్కలు ఎలా వచ్చాయి?" అని అడిగారు.
"ఇది పగవాడు చేసిన పని!" అని అతడు వారితో అన్నాడు. పనివాళ్ళు౼"మేము వెళ్లి ఆ కలుపు మొక్కల్ని పీకేయ మంటారా?" అని అతన్ని అడిగారు.
అందుకా రైతు౼"వద్దు! కలుపు మొక్కల్ని పీకివేసేటప్పుడు, వాటితోపాటు గోధుమ మొక్కల్నీ పెళ్లగిస్తారేమో..కోతకాలం వరకు రెండింటిని కలిసి పెరగనివ్వండి. కోతకాలంలో 'ముందుగా కలుపు మొక్కలు పోగుచేసి కాల్చి వేయడానికి కట్టలు కట్టండి. అప్పుడు గోధుమలు నా గిడ్డంగిలో చేర్చండి' అని కోత కోసే వారికి చెబుతాను" అన్నాడు ❇
✔ ప్రతి రైతు తన పొలం నుండి శ్రేష్ఠమైన పంటనే ఆశిస్తాడు. దేవుడు ఈ లోకమనే పొలంను శ్రేష్ఠమైన వాటితో నింపాడు. ఆయన మాటలనే మంచి విత్తనాలను భూమిపై చల్లాడు. ఆయన్ను గూర్చిన సత్యాన్ని ఏమి దాచక బహిరంగపర్చాడు (రోమా 1:19, అ.కా 17:27). దేవుడు మంచి వాడు. మనుష్యులందరి మేలును ఆశించే మహోపకారి. ఐతే మన కీడును కోరుకునే వాడు మరొకడు ఉన్నాడు. వాడు మొదట్నించి అబద్దాలడే మోసగాడు. దేవునికి విరోధి..దేవుని తీర్పు కోసం సిద్ధంగా ఉన్న దుష్ట ఆత్మ(సాతాను). వాడు మనుష్యుల హృదయాల్లో దేవుని స్థానాన్ని ఆక్రమించి, దేవుని మహిమను దొంగిలించాలని, వారిని మార్గం తప్పించి మోసం చేయ్యాలని, దేవుని సంతానంగా ఉన్న మనవులందరిని తనతో పాటు ఆ నిత్య శిక్షకు(దేవుని ఉగ్రతకు) తీసుకొని వెళ్లాలని, తద్వారా దేవుని దుఃఖం కలిగించాలనేదే వాడి కుయుక్తి. అందుకు గాను కలుపు మొక్కల విత్తనాలనే అసత్యాలను లోకంలో ఉంచాడు.అవి సత్యంలా కనిపించే అసత్యాలు (నకిలీ కరెన్సీ వలె). అచ్చు సత్యం వలె ఉంటాయి. సత్యానికి చాలా దగ్గరగా పోలికల్లోనే ఉంటాయి. కానీ నిజంగా ఉన్న దైవత్వన్ని సూచించదు.
✔ గోధుమల మధ్యలో ఉన్న కలుపు మొక్కలు కంకులు వేసే దాకా ఆ పనివాళ్ళు కూడా గుర్తు పట్టలేకపోయారు. వాటి ఫలాలను బట్టి, వాటి నిజ స్వరూపాన్ని గుర్తు పట్టినట్లు..నిజ దైవత్వాన్ని గుర్తుపట్టగలము.
సత్యం యొక్క ఫలం: దేవునితో సంభంధం, దేవుని స్వభావం. సత్యంలో బ్రతకడం. అంటే దేవుడు మమ్మల్ని ఎందుకు ఇక్కడ ఉంచాడో ఆయన నిజమైన ఉద్దేశ్యాలను గుర్తించగలగటం.మానవుని ఉనికి-జీవితం-మరణాంతర జీవితం గూర్చిన నిజమైన అవగాహనతో బ్రతకడం. ఇది ఎవరు చెప్పగలరు?సృష్టికర్త మాత్రమే కదా! మనం సత్యంలో నిలిచి ఉంటే..ఆ సత్యమే మనల్ని అబద్ధం నుండి విడుదల చేస్తుంది.
అసత్యం యొక్క ఫలం: అపవిత్ర జీవితం/క్షణికమైన వాటి కోసం వెతుకులాట, హృదయంలో శూన్యత. అపవాది మోసంతో జీవితాలు ముగించబడి దేవుని నిత్య ఎడబాటుకు-ఉగ్రతకు శాశ్వతంగా అప్పచెప్పబడటం. సాతాను చేత విత్తబడిన (అసత్యాలు) విత్తనాలను, ఎవరైతే హత్తుకుంటారో వాటి ఫలితం ఈ జీవితం. ఖచ్చితంగా వీటిలో సంతోషం ఉంటుంది కానీ అది తేనె పూసిన కత్తి. ఒక రోజు తప్పక మనల్ని నాశనం చేస్తుంది.
✔ ఐతే దేవుడు ప్రేమామయుడు కనుక ఎవ్వరూ కూడా నశించిపోకుండా ఉండాలని తన కుమారుడైన యేసును రక్షకునిగా నియమించి, ఆయన ద్వారా సమస్త మానవాళిని పిలుస్తున్నాడు (1తిమో 2:4, 2పేతు 3:9). ఆయన దీర్ఘశాంతవంతుడు కనుక ఒక మనిషి జీవిత కాలం అంతా వాని కోసం ప్రేమతో చేతులు చాచి ఎదురుచూస్తాడు. మన చివరిరోజు౼చివరి శ్వాస తీసుకునే రోజు వరకు కృపను అనుగ్రహిస్తాడు.నరకపు అంచుల వరకు ఆయన హస్తాలు చాపబడి ఉంటాయి. 'స్వేచ్ఛ' మనిషికి ఇవ్వబడిన దేవుని లక్షణం. కనుక మనిషి బలవంతంగా కాకుండా ఇష్టపూర్వకంగా, స్వేచ్ఛగా తీర్మానం చేసుకొని సత్యాన్ని హత్తుకోవాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఈ లోకాంతంలో దేవుడు ఆయన సంబంధులను, సాతాను సంబంధులను వేరు చేస్తాడు. సాతానుని, వాడిని అనుసరించిన వారికిని నిత్య దండన విధించబడుతుంది. సత్యంలో నిలిచిన వారిని దేవుడు,ఆయన రక్షణ క్రింద భద్రపరుస్తాడు. వారు భూమిపై తీసుకున్న స్వేచ్ఛ నిర్ణయమే, వారి నిత్యత్వాలను నిర్ధేశిస్తాయి. నేడు నీవు కలుస్తున్న, చూస్తున్న వారిలో ఈ రెండు రకాల ప్రజలు ఉన్నారు. స్నేహితుడా! ఇప్పుడు ప్రశ్న..నీవు ఎటువైపు ఉండాలనుకుంటున్నావు?
Comments
Post a Comment