✴️ ఆ రోజుల్లో దాను వంశం వాడు ఒకడు జోర్యా పట్టణంలో ఉండేవాడు. అతడి పేరు మనోహ. అతడి భార్య గొడ్రాలు. ఆమెకు పిల్లలు లేరు.
యెహోవా దూత ఆమెకు ప్రత్యక్షమై ఇలా అన్నాడు-"చూడు, నువ్వు గొడ్రాలివి. బిడ్డను కనలేకపోయావు. అయితే నువ్వు గర్భం ధరిస్తావు. నీకు కొడుకు పుడతాడు. ఇప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ద్రాక్షా రసాన్ని గానీ మద్యాన్ని గానీ తాగకు. అపవిత్రమైనదేదీ తినకు. నువ్వు గర్భవతివి అవుతావు. ఒక కొడుకుని కంటావు. ఆ పిల్లవాడు పుట్టినప్పట్నించి నాజీర్ గా ఉంటాడు. అతని తలపై జుట్టును క్షౌరం చేయడానికై మంగలి కత్తి అతని తలను తాక కూడదు. అతడు ఇశ్రాయేలీ ప్రజలను ఫిలిష్తీయుల చేతి నుండి రక్షిస్తాడు"
(న్యాయ 13:1-5) ✴️
■ మనోహ దంపతులు భక్తిపరులు. దేవుడు తన ప్రణాళికల నెరవేర్పును ఈ కుటుంబం నిలబెట్టుతుందని, తాను పంపబోయే రక్షకుణ్ణి ఈ దంపతులు చక్కగా పెంచగలుగుతారని నమ్మాడు. ఇశ్రాయేలీయులు బానిసత్వం నుండి విడిపించే రక్షకుడు, న్యాయధిపతికి వారు తల్లిదండ్రులగా ఉండబోతారని ఉహించి కూడా ఉండరు. దైవ ప్రణాళికల్లో భాగంగానే వారు కొంతకాలంగా పిల్లలు లేని దంపతులుగా ఉన్నారు. సహజంగానే దుఃఖం, ఆవేదన, అవమానాల గుండా వెళ్ళి వారు ఉంటారు. ఎందుకంటే గొడ్రాలితనం దేవుని శాపంగా భావించే రోజుల్లో వారు ఉన్నారు. వారు సంతానం కోసం దేవునికి అనేక మార్లు మొఱ్ఱపెట్టి ఉంటారు. కానీ వారి ప్రార్ధనలకు వారు ఎదురుచూసిన జవాబు వారికి రాలేదు.
■ పైన చెప్పబడిన వాక్య సందర్భం తర్వాత,(v13:8) మనోహ మరోమారు దైవజనుడ్ని (దూతను) పంపమని దేవునికి మొరపెట్టినప్పుడు, దేవుడు మనోహ ప్రార్ధన విని మరళా దూతను మనోహ దంపతుల దగ్గరకు పంపాడు. దేవుని ఆలోచనల్లో ఈ కుటుంబం ఉన్నప్పటికీనీ, వీరి ప్రార్ధనలను దేవుడు ఆలకిస్తున్నప్పటికినీ.. వారు ఎదురుచూసిన జవాబు వారికి రాలేదు. వారి గమనానికి లేకపోవచ్చు గాని, వారి ప్రార్ధనల జవాబు దేవుని నెరవేర్పు కాలం కోసం వేగిరపడుతూ అత్యంత శ్రేష్ఠమైనదిగా ఉండబోతుంది. మనోహ దంపతులు సంతానం కోసం దేవుని దగ్గర ప్రార్ధించి ఉండొచ్చు కానీ దేవుడు ఇశ్రాయేలీయుల రక్షకుణ్ణి వారి గర్భావాసాన ఇవ్వడానికి ప్రణాళికలను సిద్ధపరచాడు. మన దేవుడు..మనం అడిగిన దానికంటే, ఊహించిన దాని కంటే శ్రేష్ఠమైన ఆలోచనలను మన పట్ల కలిగి ఉన్నాడు. ఇది మనం నమ్మాలి.
★ కొన్నిసార్లు విశ్వాసి మొరపెట్టినప్పటికినీ దేవుని నుండి జవాబు ఆలస్యమౌతుంటే, అది ఒకవేళ దేవుని సమయం కాదని గుర్తించాలి. (లేదా దేవుడు వద్ద నుండి "కాదు" అనే స్పష్టమైన జవాబు ఉంటే, అదే కొదువలో నుండే ఆయన తన ప్రణాళికలను నెరవేర్పును కోరతున్నాడని అర్ధం చేసుకోవాలి). ఒకని కొదువ/సమృద్ధి అది వారి భక్తిని కానీ, వారికి దేవునితో ఉన్న సంబంధాన్ని కానీ సూచించదు. ఆయన సమయం కోసం ఎదురుచూస్తూ, దేవుని మదిలోని చిత్తాన్ని గౌరవిస్తూ దైవ ప్రణాళికల్లో ఒకడు నిలిచి ఉండటమే నిజమైన భక్తి.
Comments
Post a Comment