Skip to main content

13Jun2018

✴️ రాత్రి నాలుగవ జామున ఆయన సముద్రం మీద నడుస్తూ వారి దగ్గరికి వచ్చాడు. ఆయన సముద్రం మీద నడవడం చూసి శిష్యులు భయపడిపోయి, దయ్యం అనుకుని గాబరాగా కేకలు వేశారు.
వెంటనే యేసు-“ధైర్యం తెచ్చుకోండి. నేనే, భయపడవద్దు” అన్నాడు.
పేతురు-“ప్రభూ! నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ దగ్గరికి రావడానికి నాకు అనుమతినివ్వు” అని ఆయనతో అన్నాడు. యేసు-“రా” అన్నాడు. పేతురు పడవ దిగి యేసు దగ్గరికి వెళ్ళడానికి నీళ్ళ మీద నడిచాడు గాని, గాలిని చూసి భయపడి మునిగిపోతూ-“ప్రభూ, నన్ను రక్షించు” అని కేకలు వేశాడు.వెంటనే యేసు చెయ్యి చాపి అతని పట్టుకుని-“అల్పవిశ్వాసీ, ఎందుకు సందేహపడ్డావు?” అన్నాడు. యేసు, పేతురు పడవలో ప్రవేశించగానే ఆ గాలి ఆగిపోయింది...✴️


■ ఇక్కడ 'నీళ్ళ మీద నడవడం' అనే సంగతి కంటే లోతైన ఆత్మీయ పాఠాన్ని దేవుడు తన శిష్యులకు నేర్పిస్తున్నాడని మనకు అర్ధమౌతుంది (తర్వాత రోజుల్లో ఎవరూ నీటి మీద నడిచినట్లుగాని, దాని గూర్చి మాట్లాడినట్లు గాని మనం చూడము). పేతురు కూడా మన వంటి పాపపు స్వభావం కలిగిన వ్యక్తిగా ఉండినప్పటికీ(లుకా 5:8), యేసు వలె నీటిపై నడవడం నిజంగా మనకు మరింత గొప్ప ప్రోత్సాహన్ని కలిగిస్తుంది. మన జీవితంలో దేవుడు పంపిన కష్టాలు, శ్రమలనే ఒడిదుడుకులు కలకలం రేపుతున్నప్పుడు..విశ్వాసి చూపాల్సిన వైఖరిని ఈ సంఘటనలో పేతురు నుండి ఎంతో నేర్చుకోవచ్చు.

■ ఆరోగ్యవతుడైన క్రైస్తవుడు నిరంతరం దేవుని పాదాల దగ్గర విశ్వాస పాఠాలను నేర్చుకుంటూ ఉంటాడు. ఈ ఆకలి లేనివారు ఆత్మీయంగా ఎదుగలేరు. పేతురు యేసు వలె నడవడానికి తీర్మానించుకున్నాడు. ఆయన నేలపై ఉన్నప్పుడు కాదు గాని, నీటిపై ఉన్నప్పుడు..!అది ఎంతో సాహసోపేత తీర్మానం. సహజ ప్రకృతి నియమాన్ని క్రీస్తు వలె అధిగమించాలని ఆశించాడు (కొన్నిసార్లు దేవుని వాక్యము వింటున్నప్పుడు మనం కూడా ఆవిధంగా జీవించాలని ప్రోత్సహించబడినట్లుగా). యేసు మాటను బట్టి దోనెలో నుండి బయటకు విశ్వాసపు అడుగులు వేశాడు. పేతురు గమనం కొద్దీ దూరం బాగానే నడిచింది గాని పరీక్ష తీవ్రత ముమ్మరం కాగానే విశ్వాసపు పునాదులు కదిలాయి. మన జీవితాల్లోని ఒడిదుడుకులు దేవునికి తెలియనివి కావు. ఇంకా చెప్పాలంటే ఆయనే వాటిని పంపుతాడు. అవి తన పిల్లలు మరెక్కువగా తనపై ఆనుకొని (ఆధారపడుతూ), గలిబిలి చెందని సంతోషకరమైన జీవితాన్ని పొందాలని కోరి, దేవుడే వాటిని పంపుతాడు. అటువంటి సంఘటనల గుండా మనం ప్రయాణిస్తున్నప్పుడు, "నాకే ఎందుకు ఇలా జరుగుతుంది!" అని, కృంగిపోకూడదు గాని, "నేను ఈ పాఠాలను నేర్చుకోవడానికి ఆయన నన్ను పాత్రునిగా ఎంచినందుకు కృతజ్ఞతలని" సంతోషించాలి. అలాంటప్పుడే మరెక్కువగా ఆయన్ను ఆశ్రయించాలి. దేవుని పని మనలో జరుగుతూ ఉంది.

■ అప్పుడు సముద్రంపై గాలి హోరుల తీవ్రత పెరిగింది( అంటే విశ్వాసంలో మరో అడుగు దేవుడు ముందుకు తీసుకువెళ్తున్నాడని దానర్థం). పేతురు దృష్టి దేవుని వైపు కాక- సమస్యల వైపు, పరిస్థితుల వైపుకు మళ్లింది. దాని ఫలితం అప్పటి వరకు దేన్ని అధిగమించాడో దానిలో మునిగిపోయాడు. విశ్వాసి దేవునిపై దృష్టి నిలుపక, శ్రమలో కృంగినట్లైతే లోకంలో లోకస్థుల వలె మునిగిపోతారు.
అంటే అదివరకు ఉన్న జీవితం కంటే అద్వాన్నమైన జీవితంలో వెళ్లిపోవడం జరుగుతుంది. "విశ్వాసం" కదిలినప్పుడు, భక్తి జీవితం సన్నగిల్లిపోతుంది. మనం మునిగిపోతున్నామని మనలో మనకే అర్ధమౌతుంది. పేతురు వెంటనే క్రీస్తును రక్షించమని కేకలు వేశాడు. ఎవరు మనపై శ్రద్ధ కలిగి, ఈ పాఠాలను నేర్పాలనుకుంటున్నారో ఆ గొప్ప దేవుడు మన ప్రక్కనే మనల్ని కాపాడటానికి సిద్ధంగా ఉంటాడు. ఇప్పటికీ పరిస్థితి ఎంత అద్వాన్నంగా ఉన్నప్పటికీ ఒక్క కేక వేసి తిరిగి నిలబెట్టమని వేడుకున్నట్లైతే,(తిరిగి పేతురు నీటిపై నిలబెట్టబడినట్లుగా) ఎక్కడ పాఠం ఆగిపోయిందో, మళ్ళీ ఆత్మీయ స్థితి అక్కడి నుండే మొదలౌతుంది. యేసు, పేతురు దోనె ఎక్కగానే అలజడి ఆగిపోయింది. ఆయన ఆధీనంలో అన్ని ఉన్నాయని ఇది సూచించట్లేదా?

★ "అల్పవిశ్వాసి! దేవుడు వీటిని పరిష్కరించలేడని ఎందుకు సందేహ పడుతున్నావ్!" అల్పవిశ్వాసం౼ విశ్వాసిని లోకంలోకి తిరిగి ఏడ్చుకెళ్తుంది. దేవునిపై విశ్వాసం౼ లోకాన్ని మన కాళ్ళ క్రింద ఉంచుతుంది.

Comments

Popular posts from this blog

2 May 2017

ఏలీయాబు(దావీదు అన్న) దావీదుతో-"నీ గర్వం, నీ హృదయంలోని చెడుతనం నాకు తెలుసు"(1సమూ 17: 28). దేవుడు-"దావీదు నా హృదయానుసారుడు, అతడు నా ఉద్దేశములన్ని నెరవేరుస్తాడు."(అపో 13: 22) అజర్యా, యోహానాను(గర్విష్టులైన వారు) యిర్మీయాతో-"నీవు అబద్ధమాడుతున్నావు.మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు"(యిర్మియా 1:5). దేవుడు యిర్మీయాతో-"నీవు పుట్టేముందే నిన్ను ప్రత్యేకించుకొన్నాను, జనాలకు ప్రవక్తగా నియమించాను. నా వాక్కులు నీ నోట ఉంచాను."(యిర్మియా 43:2) యోసేపు అన్నలు-“ఇదుగో, కలలు కనేవాడు వచ్చేస్తున్నాడు!వాణ్ణి చంపేసి ఇక్కడ ఏదో గుంటలో పడేద్దాం..వాడి కలలు ఏమవుతాయో చూద్దాం"(ఆది 37:19). దేవుడు యోసేపుకు కలల ద్వారా వాగ్దానం చేసినవన్నీ నెరవేర్చాడు. పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులు బాప్తిస్మమిచ్చు యోహానును చూచి-"రొట్టెలు తినట్లేదు ద్రాక్షరసం త్రాగట్లేదు కనుక అతనికి దయ్యం పట్టింది"(లూకా 7: 33). యేసు-" స్త్రీలు కన్నవారిలో బాప్తిసమిచ్చే యోహానుకంటే గొప్పవాడైన ప్రవక్త లేడు"(లూకా 7: 28) దేవుడు యేసును గూర్చి-"ఈయన నా ప్రియ కుమారుడు. ఈయనలో నేను ఆనం...

28May2020

★ఆ దినమందు అనేకులు నన్ను చూచి-"ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా?" అని చెప్పుదురు. అప్పుడు -"నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని" వారితో చెప్పుదును. "ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువా డే ప్రవేశించును". (మత్తయి 7:22,23,21)★ ■ పైన చెప్పబడిన గుంపు అబద్ధమాడట్లేదు గాని, నిజంగానే దేవుని పేరిట ఆ కార్యాలు అన్ని చేశారు. వారి మాటను బట్టి చూస్తే వాళ్ళను వెంబడించేవారు అనేకులుండి ఉంటారు. వారు దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా ఉండటానికి గల కారణాన్ని దేవుడు స్పష్టంగా చెప్పాడు. దేవుని వాక్యానుసారంగా జీవించకుండా, దేవుని సేవ పేరిట తీరిక లేకుండా గడిపిన వ్యక్తులు. దేవుడు మనల్ని ఎలా జీవించమన్నాడో ఆ ప్రాముఖ్యమైన సత్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, దేవుని కోసమే జీవిస్తున్న భ్రమలో బ్రతకడం.. అది నిజంగా సాతాను కుయుక్తి బలైపోవడమే. ■ ఏది ప్రాముఖ్యమైనది? ఒకప్పుడు క్రీస్తు లేని మనమంత...

20Mar2018

✴️ ఊరియా భార్య దావీదుకు కన్నబిడ్డకు జబ్బు చేసేలా యెహోవా చేశాడు. దావీదు బిడ్డకోసం దేవుణ్ణి ప్రాధేయపడ్డాడు. అతడు ఉపవాసముండి, ఇంటిలోపలికి వెళ్ళి రాత్రులు నేలమీద పడి ఉన్నాడు. ఇంటిలో పెద్దలు అతని దగ్గర నిలబడి ఉండి అతణ్ణి నేల నుండి లేవనెత్తడానికి ప్రయత్నం చేశారు గాని అతడు ఒప్పుకోలేదు. ఐతే 7వ రోజు ఆ శిశువు చనిపోయాడు. శిశువు చనిపోయాడని దావీదుతో చెప్పడానికి భయపడ్డారు. సేవకులు గుసగుసలాడడం చూచి శిశువు చనిపోయాడని దావీదు గ్రహించాడు. “బిడ్డడు చనిపోయాడా?” అని సేవకులను అడిగాడు. “చనిపోయాడు” అని వారు జవాబిచ్చారు. వెంటనే దావీదు నేల నుండి లేచి స్నానం చేసి నూనె పూసుకొని బట్టలు మార్చుకొని యెహోవా నివాసంలోకి వెళ్ళాడు. యెహోవాను ఆరాధించిన తరువాత ఇంటికి తిరిగి వచ్చి భోజనం తెమ్మన్నాడు. వారు వడ్డించినప్పుడు అతడు భోజనం చేశాడు...అతని సేవకులు దావీదును చూచి౼బిడ్డ ఇంకా ప్రాణంతో ఉంటే ఒక వేళ యెహోవా నా మీద జాలి చూపి వాణ్ణి బ్రతకనిస్తాడేమో అనుకొన్నాను, గనుక నేను ఉపవాసముండి ఏడ్చాను. ఇప్పుడు వాడు చనిపోయాడు. నేనెందుకు ఉపవాస ముండాలి? వాడు మళ్ళీ వచ్చేలా చేయగలనా? నేను వాడి దగ్గరికి వెళ్ళిపోతాను గాని వాడు నా దగ్గరికి తి...