✴️ఓలివ కొండ నుండి దిగే చోటికి ఆయన గాడిదపై వచ్చినప్పుడు శిష్యుల గుంపంతా తాము చూసిన అద్భుతాలను గురించి సంతోషంతో గొంతెత్తి దేవుణ్ణి స్తుతించడం మొదలుపెట్టారు. “ప్రభువు పేరిట వచ్చే రాజును అందరూ స్తుతిస్తారు గాక! పరలోకంలో శాంతీ, ఉన్నత స్థలంలో మహిమ!” అన్నారు.
ఆ జనసమూహంలో ఉన్న కొందరు పరిసయ్యులు౼“బోధకా, నీ శిష్యులను గద్దించు” అని ఆయనతో అన్నారు. ఆయన౼“వీరు ఊరుకుంటే ఈ రాళ్ళు కేకలు వేస్తాయని మీతో చెబుతున్నాను” అన్నాడు. (లూకా 19:37-40)
యేసు దేవాలయానికి వచ్చినప్పుడు గుడ్డివారు, కుంటివారు ఆయన దగ్గరికి వచ్చారు. ఆయన వారందరినీ బాగుచేశాడు. ప్రధాన యాజకులూ ధర్మశాస్త్ర పండితులూ ఆయన చేసిన అద్భుతాలు చూశారు. వారు “దావీదు కుమారుడికి జయం” అని దేవాలయంలో కేకలు వేస్తున్న చిన్నపిల్లలను చూసి కోపంతో మండిపడ్డారు.౼“వీరేమని కేకలు వేస్తున్నారో వింటున్నావా?” అని ఆయనను అడిగారు. అందుకు యేసు, “వింటున్నాను, ‘చిన్నపిల్లల, చంటిబిడ్డల నోళ్ళలో స్తుతులను సిద్ధింపజేశావు’ అనే మాట మీరెప్పుడూ చదవలేదా?” అని చెప్పాడు (మత్తయి 21:14-16) ✴️
■ వారు చూసిన దేవుని అద్బుతకార్యాలు కొందరి నోట స్తుతిని ఉంచగా, మరికొందరికి అసూయను, ద్వేషాన్ని రగిలించాయి. ఇది చెడిపోయిన మనసాక్షికి ఉదాహరణ. ఒకరి మేలు/ఘనత మరొకనికి అసూయను కలుగజేస్తుంటే, అది వారి చెడిపోయిన మనస్సును తెలియజేస్తుంది. మనం దానిని గుర్తించి దేవుని యెదుటకు ఉన్నది ఉన్నట్లుగా తీసుకోవెళ్లాలి. "ఇది ఒకప్పుడు నాలో ఉన్న చెడిపోయిన లక్షణం..ప్రభూ! ఈ మనస్సుతో నేను ఏకీభవించట్లేదు. క్రీస్తు వలె ఎదుటివారి(శత్రువుల సైతం) మంచిని కోరే మంచి మనస్సు నాకు దయచేయి (లూకా 23:34)", ఎప్పుడు అటువంటి శోధన కలిగినా, వెనువెంటనే ఆ స్వభావాన్ని దేవుని సన్నిధిలో పెట్టాలి. ఇది నువ్వు నీ పాత స్వభావంతో నీవు పోరాడుతున్నావని దేవుని ముందర తెలియజేస్తుంది. లేదంటే ఆ అసూయ స్వభావం అగ్ని వలె దహించి మన నాశనానికి దారితీస్తుంది. పరిసయ్యులు, మతపెద్దలు లేఖనాల్లో ఉన్న ఏ క్రీస్తు కోసం ఎదురుచూశారో, అదే క్రీస్తును కుట్ర చేసి చంపారు.
■ ప్రభువు చేసిన ఆశ్చర్యకార్యాలను బట్టి శిష్యులు, చిన్నపిల్లలు స్తుతిస్తూ ఉంటే, అదే గుంపులో ఉన్న వీళ్ళు వాటిని విని తట్టుకోలేకపోయారు. వారు ప్రభువు వెంబడే తిరుగుతూ, దేవాలయంలో దేవుని వాక్యాలను భోదిస్తూ ఉంటున్నారు కానీ దేవుని మనస్సును కలిగిన వారు కారు(దైవ మనస్సుతో ఏకీభవించ లేకపోయారు). ఆశ్చర్యమేమిటంటే చిన్నబిడ్డలు, ఏ మాత్రం లేఖన జ్ఞానం లేని సామాన్యులు స్వేచ్ఛగా ప్రభువు వద్దకు వచ్చి, ఆయన్ను కొనియాడారు. దేవుడు కూడా వారి కల్మషం లేని స్తుతులను అంగీకరించాడు. క్రీస్తును సంతోష పెట్టే సంగతులు మనకు కష్టంగా ఉన్నప్పుడు, ఆయన్ను దుఃఖపెట్టే విషయాలు (మత్తయి 21:12,13) మనకు ఏ మాత్రం నొప్పిని కలిగించనప్పుడు, మనం ఆయనతో ఉన్నామని చెప్పుకున్నా మనం ఆయన వారము కాము. క్రీస్తుతో ఉంటున్నప్పుడు ఆయన ఎలా ప్రవర్తిస్తాడో, మనం అలాగే ప్రవర్తిస్తాము.
Comments
Post a Comment