Skip to main content

23Mar2018

✴️ పేతురు౼"అక్రమమైన ధనార్జన కోసం ఆశపడిన బెయోరు కుమారుడైన బిలామును అనుసరించి వారు తప్పిపోయారు. తిన్నని మార్గాన్ని వదిలిపెట్టారు. అతడు చేసిన తప్పుకు మాటలురాని ఒక గాడిద మానవుని గొంతుతో గద్దించి, ఆ ప్రవక్త వెర్రితనాన్ని అడ్డగించింది. 
ఇలాంటి దుర్భోధకులు నీళ్ళు లేని బావుల్లాంటి వాళ్ళు. తుఫాను గాలికి కొట్టుకొని పోయే మేఘాల్లాంటి వాళ్ళు. గాఢాంధకారాన్ని దేవుడు వాళ్ళకోసం దాచి ఉంచాడు" (2 పేతురు 2:15-17) ✴️

■ దేవుని వాగ్ధాన దేశమైన కనానుకు ప్రయాణమై వెళ్తున్న ఇశ్రాయేలీయులను శపించమని బాలాకు(మోయాబు రాజు), ప్రవక్తయైన బిలామును కోరాడు. బిలాము దేవుని యొద్ద కనిపెట్టగా౼"వీరు ఆశీర్వదించబడిన ప్రజలు, కనుక శపించునట్లుగా నీవు రాజు నొద్దకు వెళ్లకూడదని" స్పష్టంగా చెప్పాడు. కాని రాజు మరి ఎక్కువ బహుమతిని ఆశ చూపాడు. అప్పుడు బిలాము మాటలు గమనిస్తే ఎంతో ఆత్మీయంగా కనిపిస్తాయి (సంఖ్యా 22:8,18,19). 'ఇంటి నిండా వెండి, బంగారాలిచ్చినా దేవుని ఆజ్ఞను మీరలేను. కానీ వేచి ఉండండి..మరోసారి దేవుని వద్ద కనిపెడతానని' చెప్పి, తనలోని ధనాశను దేవుని ఎదుట బహిరంగ పర్చాడు.
పైపై మాటలను బట్టి మోసపోవడానికి దేవుడు నరుడు కాడు. తియ్యటి ఆత్మీయ పలుకుల కంటే హృదయాన్ని,దాని అంతరంగ ఉద్దేశ్యాలను ఆయన గమనిస్తాడు. లోలోపల వదిలివేయడానికి ఇష్టపడక, భద్రపర్చుకున్న దురాశాలను ఆయన స్పష్టంగా చూడగలడు. మునుపు మనం అలాంటి వారమే, కానీ నేడు క్రీస్తులో ఉన్న మనం ఆ దురాశలను విడిచి పెట్టి దైవ స్వభావంలోకి రూపాంతరం చెందాలి (2 పేతు 1:4). ఎందుకంటే నిలబెడతానని ఆయన ఇచ్చిన వాగ్ధానాలు మనకున్నాయి. మన స్వేచ్ఛలో నుండే ఆ దురాశాలను (పాత స్వభావాన్ని) ద్వేషించి, దైవ స్వభావాన్ని హత్తుకోవాలి.

■ బిలాము హృదయంలో దేవుణ్ని కాకుండా మరొకటి ఆశించాడు గనుక రెండవ మారు అడిగినప్పుడు దేవుడు వెళ్ళమని చెప్పాడు. దానార్ధం అది ఆయన చిత్తమని కాదు, అతని స్వేచ్ఛకు అతణ్ణి అప్పజెప్పేశాడు. దేవుడు అతను ప్రయాణం చేసిన గాడిదకు మానవ స్వరాన్ని అనుగ్రహించుట ద్వారా, ఖడ్గం ధరించిన దేవదూతను పంపడం ద్వారా ప్రవక్తను హెచ్చరించాడు. అతని చర్య తీవ్రతను తెలియజేశాడు. బిలాముకున్న వరం -"అతను దీవించిన వారిని దేవుడు దీవిస్తాడు,శపించిన వారిని శపిస్తాడు" (సంఖ్యా 22:6). తన ప్రజలైన ఇశ్రాయేలీయులను శపించకుండునట్లు దేవుడు అతణ్ని తన అధీనంలోకి తీసుకున్నాడు. ఆ సమయంలో ఎంతో ఆధ్యాత్మికమైన వ్యక్తిగా రాజు ముందు, అందరి ముందు కనిపిస్తాడు(రక్షకుడైన క్రీస్తును గూర్చి ప్రవచించాడు. సంఖ్యా 24:19). రాజుకు బిలాము బలహీనత బాగా తెల్సు గనుక ఆ విధానంలోనే పట్టుకున్నాడు. రాజు ఇవ్వదల్చిన బహుమతిని తిరిగి పొందడానికి, అతనికి కుయుక్తితో ఒక ఉపాయాన్ని చెప్పి ఇశ్రాయేలీయులు వ్యభిచార పాపం చేయడానికి కారకుడయ్యాడు. దేవుడు తిరుగుబాటు చేసిన వారిని విడిచి పెట్టేస్తాడని అతనికి బాగా తెల్సు! కనుక మోయాబు, మిద్యాను స్త్రీలును ఇశ్రాయేలీయులు దగ్గరికి పంపి వారిని వ్యభిచారులయ్యేట్లుగా సలహా ఇచ్చాడు (సంఖ్యా 25:1-3; 31:15). మరి బిలాము తన అవిధేయత గూర్చి ఎందుకు ఆలోచింపలేక పోయాడో?

■ 'నీతిమంతునిగా జీవించాలి' అనే కోరిక, మనలోని అన్ని కోరికల కంటే ప్రధామమైనదిగా, బలమైనదిగా ఉండాలి. బిలాము కూడా దీనిని కోరుకున్నాడు (సంఖ్యా 23:10) కానీ అది ప్రధానమైనది కానప్పుడు అపవాది ఎలా చేజిక్కిచుకోవాలో బాగా తెల్సు. విశ్వాస భ్రష్టుడైన బిలాము తుదకు దేవుని చేత చంపబడ్డాడు(సంఖ్యా 31:8). కనుకనే లేఖనాల్లో నేటికి ఆత్మీయ భ్రష్టుత్వానికి ఉదాహరణగా నిలిచిపోయాడు. పేతురు సంఘాలను హెచ్చరించాడు. ఇలాంటి భ్రష్టస్థితిలో ఉన్న భోధకులు, పడిపోయిన విశ్వాసులు నేడు సంఘాల్లో ఉన్నారు. ఇట్టి వారి కోసం గాఢాంధకారం (పాతాళం) భద్రం చేయబడివుంది.ఒకనికి ఆత్మీయ వరం౼అతనికి దేవునితో ఉన్న సహవాసాన్ని తెలియజేయదు, గాని ఆత్మ ఫలము మాత్రమే దీనికి నిదర్శనంగా ఉంటుంది. వరాలు కలిగిన వ్యక్తుల వెనక పడొద్దు, దేవునితో సహవాసం కలిగిన వ్యక్తులను గుర్తుపట్టండి. వారు క్రీస్తును పోలి నడుస్తారు, విలువైన ఆ మార్గానే ప్రథమంగా బోధిస్తారు.

★ స్నేహితులారా! దేవుడు యదార్థ హృదయం కోరుతున్నాడు. ఏ పాపం దేవుని చిత్త ప్రకారం జీవించడం కంటే ఇష్టంగా ప్రేమిస్తున్నావో, దానిని ప్రభువు సన్నిద్ధిలో యదార్ధంగా పెట్టి విడుదల చెయ్యమని హృదయపూర్వకంగా వేడుకో! ఏ పాపం నిన్ను ఏలనియ్యక, ప్రభువు మాత్రమే నీ జీవితంపై ఏలికగా నిలుపుకో!

Comments

Popular posts from this blog

2 May 2017

ఏలీయాబు(దావీదు అన్న) దావీదుతో-"నీ గర్వం, నీ హృదయంలోని చెడుతనం నాకు తెలుసు"(1సమూ 17: 28). దేవుడు-"దావీదు నా హృదయానుసారుడు, అతడు నా ఉద్దేశములన్ని నెరవేరుస్తాడు."(అపో 13: 22) అజర్యా, యోహానాను(గర్విష్టులైన వారు) యిర్మీయాతో-"నీవు అబద్ధమాడుతున్నావు.మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు"(యిర్మియా 1:5). దేవుడు యిర్మీయాతో-"నీవు పుట్టేముందే నిన్ను ప్రత్యేకించుకొన్నాను, జనాలకు ప్రవక్తగా నియమించాను. నా వాక్కులు నీ నోట ఉంచాను."(యిర్మియా 43:2) యోసేపు అన్నలు-“ఇదుగో, కలలు కనేవాడు వచ్చేస్తున్నాడు!వాణ్ణి చంపేసి ఇక్కడ ఏదో గుంటలో పడేద్దాం..వాడి కలలు ఏమవుతాయో చూద్దాం"(ఆది 37:19). దేవుడు యోసేపుకు కలల ద్వారా వాగ్దానం చేసినవన్నీ నెరవేర్చాడు. పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులు బాప్తిస్మమిచ్చు యోహానును చూచి-"రొట్టెలు తినట్లేదు ద్రాక్షరసం త్రాగట్లేదు కనుక అతనికి దయ్యం పట్టింది"(లూకా 7: 33). యేసు-" స్త్రీలు కన్నవారిలో బాప్తిసమిచ్చే యోహానుకంటే గొప్పవాడైన ప్రవక్త లేడు"(లూకా 7: 28) దేవుడు యేసును గూర్చి-"ఈయన నా ప్రియ కుమారుడు. ఈయనలో నేను ఆనం...

28May2020

★ఆ దినమందు అనేకులు నన్ను చూచి-"ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా?" అని చెప్పుదురు. అప్పుడు -"నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని" వారితో చెప్పుదును. "ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువా డే ప్రవేశించును". (మత్తయి 7:22,23,21)★ ■ పైన చెప్పబడిన గుంపు అబద్ధమాడట్లేదు గాని, నిజంగానే దేవుని పేరిట ఆ కార్యాలు అన్ని చేశారు. వారి మాటను బట్టి చూస్తే వాళ్ళను వెంబడించేవారు అనేకులుండి ఉంటారు. వారు దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా ఉండటానికి గల కారణాన్ని దేవుడు స్పష్టంగా చెప్పాడు. దేవుని వాక్యానుసారంగా జీవించకుండా, దేవుని సేవ పేరిట తీరిక లేకుండా గడిపిన వ్యక్తులు. దేవుడు మనల్ని ఎలా జీవించమన్నాడో ఆ ప్రాముఖ్యమైన సత్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, దేవుని కోసమే జీవిస్తున్న భ్రమలో బ్రతకడం.. అది నిజంగా సాతాను కుయుక్తి బలైపోవడమే. ■ ఏది ప్రాముఖ్యమైనది? ఒకప్పుడు క్రీస్తు లేని మనమంత...

20Mar2018

✴️ ఊరియా భార్య దావీదుకు కన్నబిడ్డకు జబ్బు చేసేలా యెహోవా చేశాడు. దావీదు బిడ్డకోసం దేవుణ్ణి ప్రాధేయపడ్డాడు. అతడు ఉపవాసముండి, ఇంటిలోపలికి వెళ్ళి రాత్రులు నేలమీద పడి ఉన్నాడు. ఇంటిలో పెద్దలు అతని దగ్గర నిలబడి ఉండి అతణ్ణి నేల నుండి లేవనెత్తడానికి ప్రయత్నం చేశారు గాని అతడు ఒప్పుకోలేదు. ఐతే 7వ రోజు ఆ శిశువు చనిపోయాడు. శిశువు చనిపోయాడని దావీదుతో చెప్పడానికి భయపడ్డారు. సేవకులు గుసగుసలాడడం చూచి శిశువు చనిపోయాడని దావీదు గ్రహించాడు. “బిడ్డడు చనిపోయాడా?” అని సేవకులను అడిగాడు. “చనిపోయాడు” అని వారు జవాబిచ్చారు. వెంటనే దావీదు నేల నుండి లేచి స్నానం చేసి నూనె పూసుకొని బట్టలు మార్చుకొని యెహోవా నివాసంలోకి వెళ్ళాడు. యెహోవాను ఆరాధించిన తరువాత ఇంటికి తిరిగి వచ్చి భోజనం తెమ్మన్నాడు. వారు వడ్డించినప్పుడు అతడు భోజనం చేశాడు...అతని సేవకులు దావీదును చూచి౼బిడ్డ ఇంకా ప్రాణంతో ఉంటే ఒక వేళ యెహోవా నా మీద జాలి చూపి వాణ్ణి బ్రతకనిస్తాడేమో అనుకొన్నాను, గనుక నేను ఉపవాసముండి ఏడ్చాను. ఇప్పుడు వాడు చనిపోయాడు. నేనెందుకు ఉపవాస ముండాలి? వాడు మళ్ళీ వచ్చేలా చేయగలనా? నేను వాడి దగ్గరికి వెళ్ళిపోతాను గాని వాడు నా దగ్గరికి తి...