❇ దేవుడు పౌలు చేత అసాధారణమైన అద్భుతాలు చేయించాడు. అతని శరీరానికి తాకిన చేతి గుడ్డలైనా, నడికట్లయినా రోగుల దగ్గరికి తెస్తే వారి రోగాలు పోయాయి, దయ్యాలు కూడా వదలిపోయాయి. అప్పుడు, దేశసంచారం చేస్తూ దయ్యాలను వెళ్ళగొట్టే యూదులు కొందరు, దయ్యాలు పట్టిన వారిపై౼“పౌలు ప్రకటించే యేసు పేరిట ఆజ్ఞాపిస్తున్నాం” అని యేసుప్రభువు పేరు చెప్పడానికి పూనుకొన్నారు.
స్కెవ అనే ఒక యూదు ప్రధాన యాజకుని కొడుకులు ఏడుగురు అలా చేశారు. ఆ దయ్యం వారితో౼“నాకు యేసు ఎవరో తెలుసు, పౌలు కూడా తెలుసు గాని, మీరెవరు?” అంది. ఆ దయ్యం పట్టినవాడు ఎగిరి వారిమీద పడి వారిని లొంగదీసుకోవడంతో ఆ దురాత్మ గెలిచింది. అందుచేత వారు గాయాలతో బట్టల్లేకుండా ఆ ఇంటి నుండి పారిపోయారు ❇
■ యూదా మతస్తుడైన పౌలు ప్రభువును తెలుసుకోక ముందు ఎంతో భక్తిపరునిగా, మతాసక్తి గల వానిగా ఉన్నాడు(ఫిలిప్పీ 3:6). ఆ సమయంలో అతని జీవితంలో ఎలాంటి ప్రభావం లేదు. ప్రభువును తెల్సుకున్న తర్వాతే అతని ద్వారా దేవుడు ఎన్నో అద్భుతాలు చేయించాడు. దెయ్యాలు సైతం పౌలును గుర్తుపట్టాయి. ఒకడే వ్యక్తి..! కానీ అతని జీవితంలో ఎంతో తేడా కనిపిస్తుంది. కారణం..పౌలు దేవుణ్ని తెల్సుకున్నాడు-దేవుని చేత తెల్సుకోబడివున్నాడు(దేవునికి మనమంతా తెల్సు. అలాగే, మనందరికీ కూడా దేవుడెవరో తెల్సు. ఆ తెలియడం కాదు! పుస్తక జ్ఞానం అంతకంటే కాదు). 'తెలియబడటం' అంటే అత్యంత సమీపంగా, ఆయన ఏమైవున్నాడో, ఎలాంటి వాడో అనుభవపూర్వకంగా తెలుసుకోవడం(a close intimacy). మన జీవితమంతటిపై దేవుని సంపూర్ణ అధికారానికి ఇష్టపూర్వకంగా అప్పగించుకొని, ఆయనకు లోబడి జీవించడం. అప్పుడు దేవుడు కూడా మన జీవితాల్లో స్వేచ్ఛగా సంచరించగల్గుతాడు. పౌలు దమస్కు లో ప్రభువు కలుసుకున్న తర్వాత, ఆయన్ను తెలుసుకోవడం మొదలుపెట్టాడు. దేవుణ్ని ఎరుగటమే ఈ జీవితంలో అన్నింటికంటే ప్రాముఖ్యమని గ్రహించాడు (గలతి 1:16,17; ఫిలిప్పీ 3:10,11). అలాంటి ఆసక్తిపరులకు దేవుడు కూడా తాను ఏమైవున్నాడో ఆయనంతట ఆయనే కనబర్చుకుంటాడు (యిర్మీ 29:13; సామె 8:17; రోమా 12:11).
■ ఎప్పుడైతే ఒకడు చీకటి నుండి వెలుగుకు దాటాడో, అంటే అంధకార అధికారం నుండి దైవ అధికారంలోకి వస్తాడో, దేవునితో పాటుగా, సాతాను-దురాత్మ శక్తులు అతణ్ని గుర్తిస్తాయి (యోబు 1:9; ఆది 3:1). మన బలాన్ని చూసి-భక్తిని చూసి అవి మనకు భయపడట్లేదు కానీ, మనపై ఉన్న దేవుని యెలుబడిని, అధికారాన్ని చూసి భయపడతాయి (రోమా 16:20). స్కెవ కుమారుల జీవితంలో ఇలాంటి అనుభవం లేదు. దేవుని అధికారం క్రింద ఉన్న వ్యక్తి చుట్టూ దేవుని కంచె, ఆయన భద్రత(కావలి) విస్తరించి ఉంటాయి. ఒక వ్యక్తి కటిక బీదరికంలో బ్రతకవొచ్చు (అవి దేవుడు నియమించే సరిహద్దులు) కానీ దేవుని అధికారం క్రింద జీవించే వ్యక్తిగా అతను వుండొచ్చు. దైవికమైన వ్యక్తి చేస్తున్న పరిచర్యను కొందరు అనుకరించవచ్చు కానీ దేవుని అధికారానికి లోబడకుంటే అక్కడ దైవాగ్ని(Fire of God) ఉండదు. అవే మాటలు వల్లించినా పరిశుద్ధాత్మ శక్తి అక్కడ ఉండదు. స్కెవ కుమారులతో దురాత్మ ప్రవర్తించినట్లుగా పౌలుతో ప్రవర్తించగలదా? పౌలు వారికంటే భౌతికంగా బలవంతుడనా? కాదు.పౌలు యేసులో తన ఉనికి(అడ్రస్) కలిగి ఉన్నాడు. పౌలు దేవుని అధికారంతో పంపబడి, అవన్నీ చేస్తున్నాడు.
★ ఇట్టి పరిచర్యలో స్వఘనతకు ఏమాత్రం తావు ఉండదు. దేవుని వాక్యాన్ని స్థిరపరచడానికి ఆ అద్భుతాలు, సూచక క్రియలను దేవుడు చేస్తున్నాడని, అది ఆయనే జరిగించు ఆయన పరిచర్య అని గుర్తిస్తాము. అత్యంత బలహీనుడైన విశ్వాసి కూడా దేవుని అధికారం క్రింద జీవిస్తూవున్నప్పుడు, దేవుణ్ని బట్టి బలవంతుడిగా అపవాది ముందు కనబడతాడు. అపవాది కంటే బలమైన శత్రువు ఎవరు? వాడినే దేవుడు మన పాదాల దగ్గర వుంచితే..ఇక ఈ లోకంలో బలమైనది ఏది? దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవరు? ఇది క్రీస్తు విజయం(1యోహా 3:8)..విశ్వాసం ద్వారా అది మనందరి స్వంతం. అది ఆయన కృపే!
Comments
Post a Comment