❇ పేతురు౼"కాబట్టి కార్యసిద్ధికి మీ మనసులను సిద్ధం చేయండి. మెళకువగా ఉండండి. యేసు క్రీస్తు ప్రత్యక్షమయ్యేటప్పుడు మీకు ఇవ్వబోయే కృప కోసం సంపూర్ణమైన నిరీక్షణ కలిగి ఉండండి. విధేయతగల పిల్లలై ఉండండి. మునుపు మీ అజ్ఞాన దశలో లాగా మీ దురాశలను అనుసరించి ప్రవర్తించకండి! మిమ్ములను పిలిచినవాడు పవిత్రుడు. అలాగే మీ ప్రవర్తనంతట్లో పవిత్రులై ఉండండి. ఎందుకంటే౼'నేను పవిత్రుణ్ణి గనుక మీరూ పవిత్రులై ఉండండి' అని వ్రాసి ఉంది"
(1పేతురు 1:13-16) ❇
■ మొదటి ఆదాముతో మనం కోల్పోయినది తిరిగి ఇవ్వడానికే కడపటి ఆదాముయైన క్రీస్తు వచ్చాడని మనకు తెల్సు(1కొరింథి 15:22)! 'కోల్పోయినది' అనగానే వెంటనే మన మనస్సులో మెదిలే మొదటి ఆలోచన౼'పరలోక రాజ్యం'. అవును! అది నిజమే! కానీ ఆదాము కోల్పోయింది అదొక్కటే కాదు. మనిషిపై దేవుని యేలుబడి పోయి, పాపం యెలుబడి క్రిందకు వెళ్ళాడు(అప్పగించ బడ్డాడు). కనుకనే క్రీస్తు మన వలె రక్తమాంసాలు గల నరుడుగా పుట్టి ఈ లోకానికి , సంపూర్ణంగా దేవుని యెలుబడికి తనను తాను జీవితాంతం అప్పగించుకొన్నాడు. పాపం చెయ్యడానికి లాగే బలం..దాని ఆకర్షణ-ప్రేరణ-శోధన క్రీస్తుపై కూడా పనిచేశాయి. ఆయన ఆలోచనల్లో గాని, క్రియల్లో గాని ఎక్కడా తప్పిపోక(స్వంత ఇష్టం చేయక), జయించిన వానిగా తండ్రికి ఇష్టుడైన ఏకైక నరుని (perfect human being)గా దేవునిచే సాక్ష్యం పొందాడు. కాబట్టే నేడు మానవాళిని పాపపు బలం నుండి విడిపించే రక్షకునిగా, వారికి మాదిరిగా, సహాయకునిగా క్రీస్తు ఉన్నాడు. క్రీస్తు యేసులో ఉన్న వారికి గొప్ప నిరీక్షణ ఉంది..! అదేమిటంటే..క్రీస్తు పునరుద్దణుడైన తర్వాత ఆయన పొందిన మహిమ దేహంను పోలిన దేహాలను ఒక రోజు మనం పొందబోతున్నాము. అది ఏదెనులో ఆదాముకు ఇవ్వబడిన దేహంలాంటి కాదు గాని, దేవుడు ఆదాముకు జీవవృక్షాన్ని తినప్పుడు ఇవ్వదల్చుకున్న శరీరం.ఆ దేహంలో పాపం ఉండదు-శోధన ఉండదు-అపవిత్రతకు ఏమాత్రం చోటు ఉండదు. దేవుని చేత క్రొత్తగా ఇవ్వబడిన శరీరం. దేవుని సన్నిధిలో నిరంతరం నిలిచి, దేవునితో నిత్యకాలాల్లో సహవాసం చేయగల పరమ పవిత్రమైన దేహాన్ని (సరిగ్గా దేవుని చేత లేపబడిన క్రీస్తు దేహాన్ని పోలిన దేహాలను) ధరించుకోబోతున్నాము.
■ మనం గతించిపోవు ఈ దేహాల్లో ఉన్నప్పుడే పరిశుద్ధుడైన దేవుణ్ని ఎదుర్కోవడానికి, పరిశుద్ధ దేహాల కొరకు ఎదురుచూస్తున్నాము. ఒకడు ఒక జాబ్ కోసం ఎదురు చూస్తుంటే దానిని పొందే దిశగా సిద్ధపడతాడు కదా!అలాగే పరిశుద్ధుడైన దేవుని సముఖంలో నిలవడం కొరకు, (పరిశుద్ధ)మహిమ దేహాల కొరకు ఎదురుచూసే ప్రతీ క్రైస్తవుడు కూడా ఈ లోకంలో నుండే పరిశుద్ధత కొరకు సిద్ధపడాలి! ఇకను పాతకాలంలో నెరవేర్చుకున్న దురాశ కోరికలను, సకల అపవిత్ర నుండి తొలగి, పరిశుద్ధులుగా ఉండుటకు పిలచిన దేవుని వలె సకల ప్రవర్తనలో పరిశుద్ధులై ఉండునట్లు సిద్ధపడాలని పై వాక్యాలలో పేతురు చెప్తున్నాడు. పాత స్వభావం క్రీస్తుతో కూడా చనిపోయింది. ఇప్పుడు నీవు నూతన వ్యక్తివి! ఇకను మునుపటి పాపవు యెలుబడికి ఈ శరీరాన్ని అప్పగించుకోక.. నీవు రక్షకునిగా ఎంచుకున్న క్రీస్తు రక్షణను నీవు భూమి మీద ఉండగానే అనుభవించాలి(పాపవిమోచకునిగా నీవు వ్యక్తిగతంగా తెలుసుకోవాలి). ఎవరిని బట్టి ఆ కృపను పొందబోవుతున్నామో మనం ఆయన్ను పోలి నడుచుకోవాలని వాక్యం చెప్తుంది(1యోహా 2:6). మనం భూమిపైనే ఉన్నప్పుడు ఈ పాపం యొక్క బలం నుండి క్రీస్తు విమోచిస్తాడని నమ్మకపోతే, ఆయన దేవుని ఉగ్రత నుండి నన్ను ఒక రోజు తప్పించి, తన మహిమను చేర్చగల సమర్థుడని ఏలా నమ్మగలవు?
■ అనగా మనం భూమిపై పాపంలేని శరీరాన్ని కలిగి ఉంటామని చెప్పట్లేదు గాని పాపాన్ని ద్వేషించే దేవుని నూతన స్వభావం కలిగి, క్రీస్తు అనే పరిపూర్ణత దిశగా ప్రయాణించాలని చెప్తున్నాను(హెబ్రీ 12:2). మారుమనస్సు పొందిన విశ్వాసి హృదయం ఒక యుద్ధభూమిని పోలివుంటుంది. పాతకాలపు అపవిత్రతలకు, దేవుని నీతికి మధ్య విశ్వాసి 'స్వేచ్ఛ' అనే తీర్మానం అనేది ఉంటుంది. విశ్వాసి దేన్ని కోరుకుంటాడో..దానిని బట్టి వాని ఆత్మీయ జీవితం పురోగతి ఆధారపడి ఉంటుంది. మనకు సహాయకుడైన పరిశుద్ధాత్మునికి మనల్ని మనం లోబర్చుకుని విశ్వాసి పోరాడాలి. అందుకే దేవుడు సర్వాంగ కవచాన్ని విశ్వాసికి ఇచ్చాడు. క్రీస్తు కూడా దేవుని మార్గాల్లో నిలిచి ఉండడానికి కన్నీటితో, రోదనలతో పాపం విషయమై దేవుని సన్నిధిలో పోరాడాడు(హెబ్రీ 5:7). అది నీతిని ధరించుకోవడానికి ఆయన తృష్ణను తెలియజేస్తుంది. క్రీస్తును పోలి అలా పాపంతో పోరాడుతున్నప్పుడు.. నీవు నీ దేవుని వలె పాపాన్ని ప్రేమించక, నీతి-పరిశుద్ధతకై ప్రాకులాడే వానిగా దేవుని ముందు కనబడతావు.క్రీస్తు అంతా చేసేశాడు..నీది ఏమి లేదు అని సోమరి క్రైస్తవత్వాన్ని బైబిల్ భోధించట్లేదు! 'ఆయన రక్షణ కార్యం' ఆయన మాత్రమే వేయగలిగిన పునాది. తరువాత క్రీస్తు పరిశుద్ధతలోకి రూపాంతరం విశ్వాసి ఎంపికే(ఏదెనులో ఆదాము స్వేచ్ఛను జ్ఞాపకం చేసుకోండి). 'స్వచిత్తానికి' అనుదినం సిలువ వేయకుండా దేవుడు తన క్రియను బలవంతంగా కొనసాగించడు. క్రీస్తు మన పక్షాన సంపూర్ణంగా దైవనీతిని నెరవేర్చి ఇచ్చిన రక్షణ వస్త్రాన్ని,చులకనగా చూడక, మనల్ని తన సహవాసానికి పిలచిన వాని నమ్మకానికి తగినట్లుగా, మంచి పోరాటం పోరాడే యోధులంగా దేవుని ముందు నిలుద్దాం! ఆయన నమ్మదగినవాడు కనుక విశ్వసించిన ప్రతి ఒక్కనికి జయకరమైన జీవితాన్ని అనుగ్రహిస్తాడు.
Comments
Post a Comment