❇ దేవుడు యిర్మీయాతో౼"యిర్మీయా! నీవు పుస్తకపు చుట్ట తీసుకొని, ఆ మొదటి రోజునుంచి ఈ రోజువరకు నేను చెప్పిన మాటలన్నీ వ్రాయి. నేను వారిమీదికి రప్పించాలనుకొన్న విపత్తు అంతటి విషయం యూదా ప్రజ విని ఒక్కొక్కరు తమ చెడ్డ త్రోవనుంచి మళ్ళితే నేను వారి అపరాధాన్నీ పాపాన్నీ క్షమిస్తాను!”
అప్పుడు యిర్మీయా లేఖకుడైన బారూకును పిలిపించాడు. యెహోవా తనతో పలికిన మాటలన్నీ యిర్మీయా చెప్పి బారూకు చేత ఆ చుట్టబడే గ్రంథంలో వ్రాయించాడు.
అప్పుడు యిర్మీయా బారూకుతో౼“యెహోవా ఆలయానికి వెళ్ళడానికి నాకు అనుమతి లేదు. గనుక నీవు వెళ్ళి, ఈ చుట్టిన కాగితంలో నీచేత నేను వ్రాయించిన యెహోవా మాటలను ప్రజలకు చదివి వినిపించు. ఉపవాస దినాన నీవు వెళ్ళాలి. యూదా పట్టణాలనుంచి వచ్చే ప్రజలందరికీ ఈ మాటలు వినిపించు! ఒకవేళ వాళ్ళ విన్నపం యెహోవా సన్నిధానానికి చేరవచ్చు! ఒక్కొక్కరు తమ చెడ్డ త్రోవలనుంచి మళ్ళవచ్చునేమో. నిజంగా ఈ ప్రజకు వ్యతిరేకంగా యెహోవా ప్రకటించిన కోపం, ఆగ్రహం ఇంతంత కాదు.” ❇
■ యాజకుడైన పషూరు, అధికారుల ఆజ్ఞ మేరకు ఆలయంలోకి యిర్మీయాకు ప్రవేశం లేదు!ఇశ్రాయేలు, యూదా ప్రజలు తమకు మేలు చేసే దేవుని వాక్యాలను మోసుకొచ్చే దైవజనుడిని బుద్ధిపూర్వకంగా తిరస్కరించారు.కానీ బలులు, ఉపవాస ప్రార్ధనలు, యధాతధంగా జరిగిపోతూ ఉన్నాయి. దేవుడు వారిపై కోపంతో ఉన్నాడు.దాన్ని వ్యక్తపరిచే ప్రవచన వాక్యాన్ని ఏ మాత్రం వారు అంగీకరించే స్థితిలో లేరు. వీరు దేవునిపైనే తిరుగుబాటు చేస్తూ ఉన్నారు గనుక ఆయన ముద్రను ధరించిన సేవకుని ఎలా అంగీకరించగలరు? పరలోకమందున్న దేవుడు స్వేచ్ఛగా మాట్లాడే యిర్మీయాకు భూమిపై ఉన్న దేవాలయంలో ప్రవేశం లేదు!అంటే౼అక్కడ దేవుని యేలుబడి లేదనే దానార్ధం! ఇది భక్తిపరులకు అన్నికాలల్లో సహజంగా జరిగే విషయమే(మత్త 21:23, అపో 5:17,18).
"ఇల్లు కట్టేవాళ్ళు తీసి పారవేసిన రాయే, ముఖ్యమైన మూలరాయి అయింది.
ఇది యెహోవా మూలంగా జరిగింది. ఇది మా దృష్టిలో అద్భుతంగా ఉంది"
(కీర్త 118: 22,23).
■ ఐనా యిర్మీయా తన ప్రజలను అమితంగా ప్రేమించాడు. దేవుడు తనతో చెప్పి వ్రాయించిన సమయానికి, బారూకు ప్రజల ముందు చదివినప్పటి సమయానికి కొన్ని నెలల వ్యత్యాసం ఉంది(36:1,9). బారూకు ప్రజల ఉపవాస సమయం కోసం వేచి చూశాడు. ఆ సమయంలో దేవుడు చెప్పే మాటలకు వీళ్ళు చెవి ఇస్తారేమోనని వారి ఆశ! దేవుని వాక్యాన్ని బంధించడం అసాధ్యం!(అకా 2:24) ఆకాశమందు గాని, భూమిపై గాని,ఏ శక్తి దేవుని వాక్యాన్ని అవరోధంగా నిలువలేదు.పంపబడిన వాక్యంపై అధికారం మేము చెయ్యగలము(యోహా 19:10), దాని నోరు మూయించగలము అన్నట్లుగా కనిపిస్తుంది. గానీ ప్రతి ఒక్కరూ అనంత కాలల్లో అదే వాక్య అధికారం క్రింద జీవించవల్సివుంటుంది(ఎఫె 1:20). దేవుడు యిర్మీయా ద్వారా దేవుని వాక్యాన్ని పంపాడు. అతన్ని వెలివేశారు, హింసించారు. పత్రిక వ్రాయించి బారూకూ ద్వారా పంపాడు. దానిని అగ్నిలో కాల్చివేశారు(36:22).దేవుడు యిర్మీయా ద్వారా మరొక్కమారు అదే గ్రంధాన్ని తిరిగి వ్రాయించాడు(మొదటి పత్రికలోని వాక్యాల కంటే అధనంగా మరి కొన్ని తీర్పు వాక్యాలను వ్రాయించాడు. 36:32).
■ రక్తమాంసాలు గల ఓ మనిషీ! అనంతుడైన దేవునితో ఎంత వరకు పోరాటం చేయగలవు? నీ బలము ఎందాక నిలుస్తుంది! దేవుని ఆత్మ నిరంతరం మనుష్యులతో వాదించడు! ఆయన మౌనం ఆయన మాట్లాడటం కన్నా ప్రమాదకరం! నిత్యజీవానికి నడిపే మాటలను ఇంకా ఎన్నాళ్ళు ఎదిరిస్తావు?
అపవిత్రలో ఆనందించే నీవు..నీ గూర్చి నీవేమనుకుంటున్నావో కంటే, నీ గూర్చి నీ దేవుడు ఏమనుకుంటున్నాడో తెలుసుకొని కప్పుకోక, తలవంచి ఆయన వైపు తిరుగుమని ప్రభువు పేరిట బ్రతిమాలుతున్నాను...మారుమనస్సుకు ప్రేరేపిస్తున్న దేవుని ఆత్మను నిర్లక్ష్యం చేయకు! నామకార్థ భక్తిని వదిలి పెట్టి, నిజమైన క్రీస్తు అనుచరునిగా జీవించు!
Comments
Post a Comment