❇ భూమిమీద మనుష్యులు చాలా చెడ్డవాళ్లుగా ఉన్నట్టు దేవుడు చూశాడు. ప్రజలు ఎల్లప్పుడునూ చెడ్డ వాటిని గూర్చి మాత్రమే తలుస్తున్నట్టు ఆయన చూశాడు. ఈ భూమి మీద మనుష్యులను చేసినందుకు దేవుడు విచార పడ్డాడు. దేవుని హృదయంలో అది ఎంతో దుఃఖం కలిగించింది (ఆది 6:5,6).❇
■ నోవహు రోజులకు భూమిపై నరులు చెడుతనం బహుగా విస్తరించింది. దేవుని మీద తిరుగుబాటు చేసి, ఆయన్ను దుఃఖపెట్టే భక్తిహీనులైన తరం ఒకటి విస్తృతంగా ప్రబలింది. ప్రజలు భక్తిహీనులై భూమిమీద వారి జీవితాలను చెడుతనంతో చెరిపి వేసుకొన్నారు(యూదా 1:14,15). కయీను దేవుని సన్నిధి వెళ్ళగొట్టబడిన తర్వాత ఇక దేవుని గూర్చి ఆలోచనలు అతనిలో గానీ, అతని సంతానంలో గాని ఉన్న దాఖలు కనిపించవు. కయీను మొదటి నుండి ఏ మాత్రం దైవభయం లేని వాడిగా ఉంటూ, ఇహలోక విషయాల్లో ఆసక్తి పరునిగా కనిపిస్తాడు. అతని సంతతివాడైన లెమెకు దైవభయం లేకుండా (కయీను వలె) ఒకడ్ని హత్య చేసి, తన భార్యలకు గొప్పగా చెప్పుకున్నాడు. బహు భార్యత్వం మొదట ఆరంభమైనది ఈ వంశంలోనే! అంతేకాకుండా క్రొత్త విషయాలను కనుగొని, జీవిన విధానాన్ని సరళీకృతం చేసుకొనే (రాగి, ఇనుమును ఉపయోగించడం, సంగీత వాయిద్యలను వాడటం, గుడారాల్లో నివసించడం) సాంకేతిక విజ్ఞానంలో ఇదే వంశపు వారు సిద్ధహస్తులు(ఆది 4:20-22).నేడు మనం చూస్తున్నట్లే నిజ దేవునితో మాకు అవసరం లేదు అన్నట్లుగా వారి జీవనం సాగింది.
■ ఐతే దేవుడు వారి సమకాలంలో ఆదాము, హవ్వలకు కలిగిన మరొక కుమారుడైన 'షేతు' సంతానం ద్వారా మరొక తరాన్ని లేవనెత్తాడు. వారు దేవుణ్ని కలిగిన ప్రజలు. దేవునితో నడిచిన హనోకు, నోవాహు వంటి భక్తిపరులు ఈ వంశం నుండే వచ్చారు. వీరి తలిదండ్రులు వేసిన పునాదులు ఎలాంటివో ఉహించగలం. వీరు ఎలాంటి క్రొత్త విషయాలకు కనుగొన్నట్లుగా బైబిల్ చెప్పట్లేదు కానీ వారు యెహోవా పేరిట ప్రార్ధన చేయడం మొదలు పెట్టారని చెప్తుంది(ఆది 4:26). అంటే 'దేవుడైన యెహోవా నామము కాని వేరొక ఆరాధన ఆ రోజుల్లో మొదలై ఉండొచ్చు, కనుకనే వీరు యెహోవా నామమున ప్రార్ధించారు' అనేది కొంతమంది బైబిల్ పండితుల అభిప్రాయం. భక్తిహీనులైన ఆ జనాంగం మధ్యలో దేవుని కోసం జ్యోతుల్లా వెలిగారు.(ఒకవేళ ఆరోజుల్లో కయీను సంతతి వారి నుండి క్రొత్తగా కనుగొన్న వస్తువులను షేతు వంశస్తులు క్రయవిక్రయాలు జరిగించి ఉండొచ్చు).భక్తిహీనుల భక్తిరాహిత్యనికి, విలాసవంతమైన జీవనానికి ఆకర్షితులై, వారితో వియ్యమొంది, వారితో కలసి పోయి, వీరు కూడా భక్తిహీనులుగా మిగిలిపోయారు. నోవహు సమయం వచ్చేసరికి నోవహు మాత్రమే నీతిమంతునిగా దేవునికి కనిపించాడు.దుష్ట సాంగత్యం వారి నడవడికను ఎంత చెరిపి వేసిందో గమనించండి!
◆ మనం మన పిల్లలకు వారసత్వంగా ఏం ఇవ్వలనుకుంటున్నాము? దైవ అనుభవ జ్ఞానం(walk with God)? ఈ లోకసౌఖ్యం(Luxurious life)? మన జీవితాల్లోనే ఈ ప్రాధాన్యత లేకపోతే మన సంతానానికి ఎలా ఇవ్వగలం?దేనికోసం నీవు ఎక్కువగా దిగులుపడతావో దానిపైనే నీ మనస్సు కేంద్రీకరించినట్లు స్పష్టమే! పిల్లలు well educated, trendy గా ఉంటే మురిసిపోతాము గాని వారి మతసంబంధులుగా మిగిలిపోయి నరకాపాత్రులుగా మారతుంటే దుఃఖంలేని ఆత్మీయ అంధులంగా మిగిలిపోతున్నాము.అదే కయీను నడచిన మార్గం!
◆నేడు సంఘాల్లోకి ప్రవేశిస్తున్న లోకసంభంధమైన విధానాలను కనిపెట్టి, వాటిని నిరోధించగలిగే బలమైన ఆత్మీయ నాయకత్వం మనకు అవసరం. ఆధ్యాత్మికత అనేది౼వేషభాషల్లో, అధిక డిగ్రీల్లో, గౌరవార్ధమైన ఉన్నత స్థానాల్లో మొ|| వాటిలో నివసించదు. నేడు పెద్దలుగా పిలువబడుతున్న వారు సైతం ఈ కపట వేషాలకు మోసపోతుండటం విచారకరం! మెరుగైన జీవనశైలి(polished external life)లో ఉన్న వారంతా ఆధ్యాత్మిక వ్యక్తులని భ్రమపడకండి. ఒకనికి భక్తి౼'దేవునిపై వ్యక్తిగతంగా అతనికున్న ప్రేమ, దేవుణ్ని బట్టి సరిద్దిద్దుకొనే అంతరంగం(self denial), లోకమాలిన్యానికి వేరుగా బ్రతకడం' వంటివి. అది ఏ విధమైన ప్రజల్లో సైతం నివసించవచ్చు!వారిని బట్టి మనం గుర్తు పట్టాలి. హనోకు, నోవాహు నడచిన మార్గం అదే!
Comments
Post a Comment