
వారిలో ఒకడు కూరాకులను ఏరుకోవడానికి పొలాలకు వెళ్ళాడు. పిచ్చి(చేదు) ద్రాక్ష తీగె కనిపించగా ఆ ఆకులు ఎలాంటివో తెలియక, దాని ఆకులను అతడి ఒడినిండా సేకరించి, వచ్చి వంటకం వండుతున్న కుండలో తరిగి పోశాడు. ఆ వంటకం తినడానికి అక్కడివారికి వడ్డించారు.
వారు తింటూ ఉంటే “దైవజనుడా! కుండలో విషం ఉన్నది”అని కేకలు పెట్టారు. వారు దానిని తినలేకపోయారు.
ఎలీషా౼“పిండి కొంచెం తెండి!” అన్నాడు. అతడా పిండి కుండలో వేసి౼“వంటకం వడ్డించు. వారు తినవచ్చు” అన్నాడు. ఆ తరువాత కుండలో హానికరమైనది ఏదీ వారికి కనబడలేదు. (2రాజులు 4:38-41)

■ ఆ చెట్టు గుణమేంటో తెలియక, చేదు ఆకులను మంచి కూర ఆకులుగా భావించి వంట వండారు. వారు తినేంత వరకూ..దాని చేదును గుర్తించలేక పోయ్యారు. అది పొరపాటున జరిగిన పని! పొరపాట్లు అనేవి నిజం(లేక సత్యం) తెలియక, సరైనదేనని యెంచి చేసే పనులు.(మనందరి జీవితాల్లో ఇటువంటి సంఘటనలు అనుభవాలుగా ఉండి ఉంటాయి). ఐతే మన జీవితాల్లో జరిగే ఇలాంటి పొరపాట్లు కొన్నిసార్లు చేదైన అనుభవాలకు దారి తీస్తాయి. అనేకులు ప్రాణాలను తీసుకొనేంతగా క్రుంగుదలకు నడిపిస్తాయి.కొన్ని చెడ్డ ఆకులే కూరంతటిని చెడగొట్టినట్లుగా, ఒక చేదైన అనుభవం మిగితా జీవితానంతా హరించేటట్లు (ప్రాణాలను తీసుకొనేంతగా) క్రుంగుదలకు నడిపిస్తాయి. 'ఇక నా జీవితాన్ని బాగుచెయ్యటం ఎవ్వరికీ సాధ్యపడదు!ఇక చావే నాకు దిక్కు' అనే నిరీక్షణ లేని ఆలోచనల్లోకి వెళ్తారు.
■ దైవజనుడైన ఎలీషా విషంలా మారిన ఆ కూర కుండలో పిండిని కలుపగా దానిలోని చేదంతా పోయి బాగయ్యింది. అంతకు ముందు అదే కుండలో నుండి చేదు విషం తీయబడింది కానీ ఇప్పుడు మేలైన భోజనం తియ్యబడింది.నిజానికి ఆ పిండిలో ఏమి లేదు గాని అద్భుతాన్ని జరిగించిన శక్తిమంతుడు దేవుడే! దేవుడు అత్యంత స్వల్పమైన విషయాలతో మన కడుగడ్డు సమస్యలకు సమాధానం ఇవ్వగల సమర్థుడు! దేవునికి సమస్తం సాధ్యమే!విషంలా ఉన్న ఆహారాన్ని తిని శిష్యులు ప్రాణభయంతో కేకలు వేసి దైవజనుడైన ఎలీషాకు చెప్పారు. కానీ ఎలీషాలో ఏ మాత్రం ఆందోళన కనిపించదు. ఎలీషా ఎల్లప్పుడూ దేవునితో సంభంధంలో ఉన్నవాడు గనుక ఏ సమస్య గూర్చి చింతించక దేవుని సామర్ధ్యాన్ని నమ్మి నిమ్మళంగా-నిశ్చింతగా ఉన్నాడు. ఇది దేవునిపై మన నమ్మకాన్ని(విశ్వాసాన్ని) తెలియజేస్తుంది. బయట నుండి తేబడిన పదార్ధం (పిండి) లోపల చెడిపోయిన దాన్నంతటిని బాగుచేసినట్లే, చెడిపోయిన జీవితాల్లోకి దేవుడు ప్రవేశించినప్పుడు మార్పుపొంది మేలైన క్రొత్త వ్యక్తులంగా మారిపోతాము.(మీ కళ్ళ ముందు దేవుణ్ని నమ్మి, క్రొత్త వ్యక్తులుగా మారిపోయిన వారిని మీ భంధువుల్లో, స్నేహితుల్లో ఇప్పటికే అనేకమందిని చూసేవుంటారు)
౼కనుక ఎన్నడూ నీ నిరీక్షణ కోల్పోవద్దు!నీ కళ్ళకు అసాధ్యంగా కనిపించినవి.. దేవునికి అతిస్వల్ప విషయాలు! నీవు నమ్మితే ఇప్పటికి చెడిపోయినట్లుగా కనిపిస్తున్న ఇదే జీవితం నుండి దేవునిచే మార్చబడిన శక్తివంతమైన జీవితంలోకి నీవు అడుగుపెట్టగలవు! నామకార్థ భక్తిని వదిలి నిజమైన క్రీస్తు భక్తిలోకి అడుగు పెట్టడానికి ఈ నూతన సంవత్సరంలో తీర్మానం చేసుకో!
Comments
Post a Comment