
అతడు ప్రభువు రక్షకుణ్ని చూడకుండా చనిపోడని అతనికి పరిశుద్ధాత్మ వెల్లడించాడు. ధర్మశాస్త్ర పద్ధతి ప్రకారం ఆయన విషయంలో జరిగించడానికి మరియ-యోసేపులు చంటి బిడ్డయైన యేసును దేవాలయంలోకి తెచ్చారు.
ఆ రోజు సుమెయోను ఆత్మవశుడై దేవాలయంలోకి వచ్చాడు. అతడు తన చేతుల్లో యేసును ఎత్తుకుని దేవుణ్ణి స్తుతిస్తూ౼ “ప్రభూ, ఇప్పుడు నీ మాట చొప్పున శాంతితో నీ సేవకుణ్ణి కడతేరి పోనిస్తున్నావు గదా!అన్ని జనాల ఎదుట నీవు సిద్ధం చేసిన ముక్తిని కళ్ళారా చూశాను.అది ఇతర ప్రజలకు సత్యాన్ని వెల్లడి చేసే వెలుగు, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమ” అన్నాడు.
యోసేపు, ఆయన తల్లీ ఆయనను గురించి సుమెయోను చెప్పిన మాటలు విని ఆశ్చర్యపోయారు.(లూకా 2:25-33)
❇
యోసేపు, ఆయన తల్లీ ఆయనను గురించి సుమెయోను చెప్పిన మాటలు విని ఆశ్చర్యపోయారు.(లూకా 2:25-33)

■ సుమెయోను రక్షకుని రాక కోసం ఆసక్తితో కనిపెట్టాడు కనుకనే పరిశుద్ధాత్మ ద్వారా రక్షకున్ని చూశాకే చనిపోతావని దేవుడు అతనికి వాగ్ధానం చేశాడు.ఎవరు ఆసక్తిపరులై దేవుణ్ని వెతకుతారో వారే దేవుని వాగ్ధానాలకి వారసులౌతారు. దేవుని పట్ల ఆసక్తిలేకుండా శ్రేష్ఠమైన దేవుని ఫలాల్లో ఎవరూ, ఎన్నడూ పాలుపొంపులు పొందలేరు(రోమా 12:11). క్రీస్తును చూస్తావని వాగ్ధానం చేసిన ఆత్మ దేవుడే అతణ్ణి ఆలయంలోకి తీసుకు వెళ్ళినట్లుగా చూస్తాము. పరిశుద్ధాత్ముడు ఎల్లప్పుడూ క్రీస్తు దగ్గరకు తీసుకెళ్లే వానిగా, క్రీస్తును మనకు చూపేవానిగా ఉంటాడు.మన సొంత జ్ఞానం(head knowledge)తో వాక్యాన్ని చదివి, జీవంతో కూడిన క్రీస్తును ఎన్నటికీ కనుగొనలేము. నేడు వాక్యంలో ఉన్న క్రీస్తును మనకు సజీవునిగా మన కన్నులకు చూపేవానిగా పరిశుద్ధాత్ముడు ఉన్నాడు(1కొరిధి 2:5, 1థెస్స 1:5, గలతీ 3:1). మరియ గర్భంలో క్రీస్తు రూపును ఏర్పపర్చినట్లుగా, మనలో హృదయాల్లో యేసు రూపాన్ని ఏర్పరచేది శక్తితో కూడిన దేవుని ఆత్మే(లూకా 1:35, గలతీ 4:19)
■ మొదట సుమెయోను గూర్చి చెప్పబడిన మాటల్లో అతను ఇశ్రాయేలీయుల ఆదరణ గూర్చి కనిపెట్టేవానిగా చెప్పబడినప్పటికీ, రక్షకుని చూడగానే ఆత్మవశుడై 'సర్వజనులకు ముక్తిదాతగా' క్రీస్తును గూర్చి పలికాడు. మనం దేవుని ఆత్మ నియమం క్రింద ఉన్నప్పుడు మన ఆలోచనలను, అవగాహనల నుండి గొప్పదైన దేవుని ఆలోచనల్లోకి, ఉద్దేశ్యాల్లోకి మనల్ని నడుపుతాడు(అపో 16:6-10). ఎవరు దేవుని ఆదేశానుసారం జీవించడానికి ఇష్టపడతారో వారినే ఆయన నడుపుతాడు. సుమెయోను అలాంటి వాడే కనుక దేవుని ఆత్మ అతనిపై ఉన్నట్లు మనం చూస్తాము. ఆయన శక్తిని ఆశ్రయించకుండా పరిపూర్ణత సాధ్యమని భ్రమపడకు! (గలతీ 3:3). నీ కొరకు దిగివచ్చిన (దేవుని చేత పంపబడిన) సహాయకుణ్ణి సంపూర్ణంగా ఆశ్రయిస్తావా? నీ పట్ల ఉన్న దేవుని ఆలోచనల్లోకి నిన్ను నడిపే సహాయకుడు, ఆదరణ కర్త ఆయనే!
Comments
Post a Comment