వారు ప్రయాణమయ్యాక ఆయన నిద్రపోయాడు. ఈలోగా సముద్రంపై బలమైన గాలివాన వచ్చి పడవలోకి నీళ్ళు వచ్చేశాయి. వారి స్థితి ప్రమాదకరంగా మారింది.
కాబట్టి వారు ఆయన దగ్గరికి వచ్చి౼“ప్రభూ! ప్రభూ! నశించిపోతున్నాం!మేము మునిగిపోతుంటే నీకేమీ పట్టదా?” అంటూ ఆయనను లేపారు. ఆయన లేచి, గాలినీ, ఉవ్వెత్తున లేచే కెరటాలను గద్దిస్తూ, “శాంతించు! ఆగిపో!” అని ఆజ్ఞాపించాడు.. అవి అణిగిపోయి అంతా నిశ్శబ్దంగా అయింది.
అప్పుడు ఆయన౼“మీ విశ్వాసం ఎక్కడ?” అన్నాడు. వారు భయపడి, “ఈయన గాలికీ నీళ్లకూ ఆజ్ఞాపిస్తే అవి లోబడుతున్నాయి. ఈయన ఎవరో” అని ఒకరితో ఒకరు చెప్పుకుంటూ ఆశ్చర్యపోయారు(మార్కు 4:35-40) ❇
■ దేవుడు తోడున్న పడవపైకి గాలివాన-తుఫానులు(శ్రమలు) వస్తాయా? ఖచ్చితంగా వస్తాయి! ఇంకా చెప్పాలంటే ఆయనే (శ్రమలను) పంపుతాడు! ఈ సంఘటనకు ముందు యేసు శిష్యులకు అనేక పరలోక సత్యాలను భోధించాడు (మార్కు 4:33,34). అదే రోజు సాయంత్రం ఆయనే వారిని ఈ ప్రయాణానికి పిలిచాడు. ఇప్పుడు వారి ముందున్న యేసు(దేవుని) మాట౼"అవతలి ఒడ్డుకు వెళ్దాం!". కానీ కొద్దిసేపటి తర్వాత తీవ్రమైన తుఫాను చెలరేగి, పడవ మీదికి అలలు ముంచుకొచ్చాయి. అటువంటి సమయంలో..'మన జీవితం' అనే పడవలో చెలరేగే తుఫానులను మనమే పరిష్కరించుకోవాలని భావిస్తే భయానదోళనలే కలుగుతాయి. అవి కొన్నిసార్లు మన శక్తికి మించినవి. 'నేనే దీన్ని పరిష్కరించుకోవాలి' ౼ 'నేనే'-అనే మానవ బలం నుండి బయటకి వచ్చి, 'నేను ఒంటరిని కాదు, నా దేవుడే నా సహాయకుడు' (ఆయనకు తెలిసే,ఆయన పంపగా ఈ తుఫాను వచ్చింది)అనే దైవబలంలోకి విశ్వాసంతో ప్రవేశిస్తూ..శ్రమలో చెయ్యి విడువని, దేవుని విలువైన ఆధ్యాత్మిక పాఠాలను శ్రద్ధగా నేర్చుకుంటూ ఆధారపడవాల్సిన వారమైవున్నాము(ఇది మాట పలికినంత సుళువు కాదని నాకు తెల్సు!నమ్మకస్థుడైన దేవుడు మనల్ని చెయ్యి విడువక, నడిపిస్తాడని మాత్రం నాకు తెల్సు!).
■ శిష్యులు-'మేము దేవుణ్ని బట్టి విశ్వాసంతో సమస్తాన్ని వదులుకున్నాం' అనుకుంటున్నారు కానీ శ్రమ వచ్చేవరకు తెలియదు,వారింకా అల్పవిశ్వాసంతోనే ఉన్నారని! 'శ్రమ'-మన నిజమైన ఆధ్యాత్మిక స్థితిని తెలియజేస్తూ,మనపై మనకున్న సొంత అభిప్రాయాలను తొలగిస్తుంది. దేవునితో నడిచే జీవితం..ఒక విద్యార్థిని పోలినట్లుగా 'సత్యాన్ని గూర్చిన వెలిగింపుతో పాటుగా, పరీక్షా అనుభవాలు, ఆధ్యాత్మిక ఆశీర్వదాలు ఉంటాయి'. 'ప్రతి పరీక్ష' విశ్వాసిని మరొక మెట్టుకు తీసుకెళ్తాయి(ఆయన ఏమై ఉన్నాడో అనుభవపూర్వకంగా కనపర్చుకుంటాడు). లోతుల్లోకి వెళ్ళేకొలది పరీక్ష తీవ్రత పెరుగుతుంది.లోతైన, బలమైన పాఠానికి సిద్ధమౌతున్నామని దానర్థం.మరొక ప్రామాణికం(standard) లోకి దేవుడు మనల్ని తీసుకెళ్తాడు. శ్రమ అనే పరీక్షలు విశ్వాసి దేవుణ్ని ఆనుకోవడానికి చక్కటి అవకాశాలు. సముద్రపు అలలు, గాలి తుఫాను వైపు చూస్తే ఖచ్చితంగా భయమే కలుగుతుంది గానీ, ఇప్పటివరకు మనల్ని నడిపిన, నమ్మకస్తుడునూ, నిత్యుడైన పరలోక రాజు యొక్క బలం వైపు చూస్తే, 'నిరీక్షణ' కలుగుతుంది. ఆయన ఒక్క మాటతో వాతావరణం తిరిగి నిమ్మళంగా మారిపోయింది. సమస్తంపై సర్వాధికారం కలిగిన దేవుణ్ని మనం దేవునిగా కలిగి ఉన్నాం!సమస్తం ఆయన ఆధీనంలోనే ఉంది. భయపడొద్దు!విశ్వాసం మాత్రం ఉంచుదాం!మన రక్షకుడైన దేవుని చేతిలో మనం భద్రంగా ఉన్నాం!మన హృదయాల్లో రేగే అలజడులను దేవుడు శీఘ్రంగా నిమ్మళ్ళపర్చును గాక!
Comments
Post a Comment