❇ యెహోవా మోషేతో౼"నేను బెసెలేలును ప్రత్యేకించుకొన్నాను. నేను అతణ్ణి దైవాత్మతో నింపాను. అతనికి జ్ఞానం, తెలివి, వివేకం ప్రసాదించాను.నేర్పుతో పనులను కల్పించడానికీ, బంగారం, వెండి, కంచుతో పని చెయ్యడానికీ పొదగడం కోసం రత్నాలను సానపెట్టడానికీ, మ్రానులను చెక్కడానికీ, అన్ని విధాల పనులను చెయ్యడానికీ అతణ్ణి ప్రవీణుణ్ణి చేశాను".
బెసెలేలు తుమ్మకర్రతో దేవుని మందసాన్ని చేశాడు. రెక్కలు పైకి విప్పి ఉన్న రెండు కెరూబు ఆకారాలు బంగారంతో, మందసపు మూతపై కప్పి ఉన్నట్లుగా చేశాడు. మరియు తుమ్మకర్రతో బల్లను-ధూపవేదికను-బలిపీఠాన్ని, మేలిమి బంగారంతో దీపస్తంభాన్ని , కంచుతో గంగాళాన్నీ-దాని పీఠాన్నీ, మరియు ఆవరణాన్ని-వాటి తెరలను తయారు చేశాడు. దేవుడు మోషేకు ఆజ్ఞాపించినది అంతా బెసెలేలు, అహోలీయాబుతో కలిసి చేశాడు. ❇
■ దేవుడు ఇశ్రాయేలీయులకిచ్చిన ప్రత్యక్ష గుడారం నమూనా పరలోక పోలికగా (గుర్తుగా) ఉంటుంది. దేవుడు మెషేకు ప్రత్యక్ష గుడారపు నమూనాను కొండపైన చూపాడు(నిర్గ 25:40).దానిని సరిగ్గా అలాగే చెయ్యడానికి అనగా మోషే దాని గూర్చి వివరణ ఇవ్వగా, ఒకరు సరిగ్గా దేవుడు చెప్పినట్లుగానే మలచాల్సివుంది. ఒక వ్యక్తి విషయాలు ఆ వ్యక్తికే తెలుస్తాయి గానీ వేరొక వ్యక్తికెలా తెలుస్తాయి? ఆలాగే దేవుని విషయాలు దేవుని ఆత్మకు తప్ప మరెవరికీ తెలియవు(1కోరింధి 2:11). కనుక దేవుడు మోషేకు చూపిన నమూనాను, దేవుని ఆత్మతో నింపబడిన బెసెలేలు తెల్సుకోగలిగాడు. బెసెలేలు నేర్పరిగల పనివాడే మాత్రమే కాదు గాని, దేవునికి తనను తాను అప్పగించుకొని, దేవునిపై ఆధారపడే భక్తిపరుడు. ఎక్కడ ఆయన పని ఉంటుందో అక్కడ దేవుని చిత్తప్రకారం, ఎంతో ప్రణాళికాబద్దంగా వ్యక్తులను సిద్ధపరుస్తాడు. ఆది నుండి(ఇప్పటి వరకు కూడా) దేవుని ఆత్మే దేవుని పనులను అమలుచేస్తున్నట్లు గమనించగలం. ఆత్మపూర్ణుడైన బెసెలేలు, అహోలీయాబుతో కలిసి దేవుడు కోరుకున్నట్లుగా ఆ పనిని సంపూర్ణంగా ముగించాడు.
■ నేడు క్రొత్త నిబంధనలో దేవుని ఆత్మ భూమిపై ఉన్న నమూనాను కట్టడం లేదు గాని, దాని సంపూర్ణతైన ఆత్మ సంభంధమైన దేవుని రాజ్యాన్ని కడుతున్నాడు. దేవుని ఆత్మ వారి మీదకు రానంత వరకు శిష్యులు పునరుద్దానుడైన క్రీస్తును చూసినప్పటికీ భూసంబంధులుగా మాట్లాడారు(అపో 1:6), కానీ వారు దేవుని ఆత్మ చేత నింపబడినప్పుడు, దేవుని ఆలోచనలతో నింపబడ్డారు, ఆయన రాజ్యాన్ని నిర్మించే భాగస్వాయులయ్యారు. ఇథియోపియుడైన నపుంసకుడు దేవుని కోసం అన్వేషిస్తున్నప్పుడు దేవుని ఆత్మ ఫిలిప్పును పంపాడు. ఆయన పని-అవసరం ఎక్కడుందో ఆయన ఆత్మకు బాగా తెల్సు గనుక ఆత్మపూర్ణులుగా ఉండటానికి ఇష్టపడే వ్యక్తులను వాడుకుంటాడు. విశ్వాసులందరూ దేవుని ఆత్మ ఆధీనంలో ఉండాలనే దేవుడు బలవంతం చెయ్యడు గాని, అది విశ్వాసి స్వేచ్ఛ మీద ఆధారపడి ఉంది(అపో 6:5).ఎవరి జీవితంలోనైనతే దేవుణ్ని మహిమ పర్చడమే ధ్యేయంగా ఉంటుందో, ఎవరి జీవితంలోనైనతే ఇహలోక కోరికల కంటే, దేవుని చిత్తం తన జీవితంలో నెరవేర్చడమే మనఃపూర్వకమైన వాంఛగా ఉంటుందో వారికి దేవుడు తన చిత్తాన్ని స్పష్టంగా తెలియజేస్తూ వాడుకుంటాడు.
౼ ఆది అపొస్తలలు, శిష్యులు దేవుని ఆత్మపూర్ణులై దేవుని చేత వాడబడటానికి కారణం ఇదే! ప్రాణాత్మ దేహాలను దేవునికి ఇష్టపూర్వకంగా సమర్పించుకున్నారు. దేవుని మహిమ పరచడమే మొదట ప్రాధాన్యతగా ఎంచుకున్నారు. విశ్వాసి ఆత్మపూర్ణుడుగా ఉండొచ్చు లేదా ఆత్మను ఆర్పుకొనేవారిగానూ ఉండొచ్చు. ఒకటే జీవితం..ఎలాంటి వ్యక్తివిగా నీవుంటావు? తర్వాత జీవితమనే పుస్తకం మూసి వేయబడుతుంది. అది శాశ్విత సాక్ష్యంగా నిత్యత్వంలో నిలిచిపోతుంది.
Comments
Post a Comment