❇ ప్రార్థన చేయడానికి ఇద్దరు మనుష్యులు దేవాలయానికి వెళ్ళారు. వారిలో ఒకడు పరిసయ్యుడు(మతనిష్ఠ గలవాడు), ఇంకొకడు (అన్యాయంగా) పన్నులు వసూలు చేసేవాడు.
పరిసయ్యుడు నిలబడి౼"దేవా, నేను దొంగలూ, అన్యాయం చేసేవారూ, వ్యభిచారులూ అయిన ఇతరుల్లా కాకుండా, ఇంకా ఈ పన్నులు వసూలు చేసే వాడిలా కాకుండా ఉన్నందుకు నీకు కృతజ్ఞతలు. వారానికి రెండుసార్లు ఉపవాసం ఉంటున్నాను. నా సంపాదన అంతటిలో పదో వంతు నీకిస్తున్నాను" అని తనలో తాను ప్రార్థన చేశాడు.
ఐతే పన్నులు వసూలు చేసేవాడు దూరంగా నిలబడ్డాడు. కళ్ళు పైకెత్తి చూడటానికి కూడా వాడికి ధైర్యం చాల్లేదు. వాడు గుండెలు బాదుకుంటూ పశ్చాత్తాపంతో౼"దేవా, పాపినైన నన్ను కరుణించు! " అన్నాడు. పరిసయ్యుడి కంటే పన్నులు వసూలు చేసే వాడినే దేవుడు నీతిమంతుడిగా ఎంచాడు. ❇
■ పరిసయ్యుడు బాహ్యంగా ఎంతో నీతిమంతునిగా కనిపిస్తున్నాడు. పరులవి ఏమీ ఆశించక, ఆధ్యాత్మిక చింతన(భక్తి) కలిగి జీవిస్తున్నాడు. వారానికి రెండుసార్లు ఉపవాసం, సంపాదనలో పదో వంతు దేవునికి ఇస్తూ, నైతిక విలువలతో ఆలయంలో ఎంతో భక్తిపరునిగా, ఎందరికో మాదిరిగా ఉన్నాడు. ఇతని ప్రార్ధనను బట్టి చూస్తే చెడు మార్గాలకు పోని జీవనం కొనసాగిస్తున్నాడు.ఖచ్చితంగా సంఘ పెద్దగా ఉండటానికి సరిపోయన్ని లక్షణాలు ఇతనిలో ఉన్నాయి. చక్కటి సాక్ష్య జీవితం!! కానీ దేవుడు అలాంటి వ్యక్తిని త్రోసిపుచ్చుతాడు. మన అంతిమ తనిఖీ దేవునితోనే! అదే శాశ్వితమైన సాక్ష్యమౌతుంది.
■ దేవుని చూపు మనుష్యుల చూపుకంటే భిన్నంగా ఉంటుంది.
ఒకని భక్తి జీవితాన్ని బట్టి, సాక్ష్య జీవితాన్ని బట్టి, సేవా జీవితాన్ని బట్టి అతిశయం కలుగుతుంటే అది దేవున్నుండి కలిగిన జీవితం కాదు గానీ, స్వంత నీతి(పనులు). దేవుని చేత మలచబడిన జీవితం దీనత్వానికి తీసుకువెళ్తుంది. దేవుని స్వభావంతో నింపబడిన వ్యక్తి౼మనుష్యులను ఉన్నపాటున అంగీకరిస్తాడు. దేవుడు పాపికి కనికరించి, ప్రేమించినట్లుగా (ప్రతిదినం దేవుడు మనల్ని అంగీకరిస్తున్నట్లుగా) ప్రేమిస్తారు. అంతేకాని ప్రక్కన వారితో పోల్చుకొని అతిశయిస్తూ, వారిని చిన్న చూపు చూడదు. అలా చేస్తున్నామంటే దేవుని స్వభావానికి ఎంతో దూరంలో ఉన్నామని దానార్ధం. శరీరాన్ని అపవిత్ర పర్చుకొన్న పాపం కంటే ఈ పాపాన్ని దేవుడు తీవ్రంగా యెంచుతాడు. ఆత్మీయ గర్వం అపాయకరమైన పాపం(కనీసం పాపంలో ఉన్నట్లైనా గుర్తుపట్టలేని భ్రమకు గురి చేస్తుంది) చెడు మార్గంలో లేము కనుక మనం దేవుని ఎదుట అంగీకరించ బడతామనే గొప్ప మోసానికి దారి తీస్తుంది. దేవుడు అంతరంగాన్ని లక్ష్యపెడతాడు, బాహ్య జీవితాన్ని కాదు!
■ అయ్యో!ఒకడు భూమిపై ఉన్నప్పుడే ఆ వెలిగింపులోకి వచ్చి, పశ్చాత్తాపడితే వానికి ఏంత మేలు! ఈ లోకం దాటిన తర్వాత మార్చుకోవడానికి అవకాశమే ఉండదు.బాహ్యంగా ఉన్న సాక్ష్యాన్ని బట్టి కాకుండా, అంతరంగంలో నుండి వచ్చే దేవుని గద్దింపుకు చెవి ఇచ్చే నరుడు ధన్యుడు.
- కొంతమంది వారి సేవ జీవితం నుండి బయటికి వస్తేనే వారికి మరియెక్కువ మేలు కలుగుతుంది!సేవా భ్రమలో వల్ల, దేవుని వెలుగులో జీవించకుండా వారి ఆత్మలకు కీడు చేసుకుంటారు.
- కొంతమంది బాహ్యపాపంలో పడితేనే ఎంతో మేలు కలుగుతుంది! కనీసం అప్పుడైనా ఎదుటి వారిని కాక, తమను తాము విమర్శించుకుంటారు.దేవుని కృప కోసం వేడుకుంటారు.
అంతరంగంలో ఇంకా పాత వ్యక్తే ఏలుతున్నప్పుడు ఆ భక్తికి అర్ధమేమిటి? దేవుని ఏలుబడికి లోబర్చుకోకుండా రాత్రింబగళ్లు శ్రమపడే ఆ సేవ వల్ల ప్రయోజనం ఏమిటి?
■ పన్నులు వసూలు చేసేవాడు తన జీవితంలో అప్పటిదాకా తప్పులు చేశాడు.బాహ్య(సాక్ష్య) జీవితం చెడిపోయివుంది. కానీ ఒకానొక ఒకరోజు తన తప్పు విషయమై దేవుడు గద్దించగా యదార్ధంగా, తన స్థితిని ఒప్పుకున్నాడు.తన పనులు చెడ్డవని గ్రహించి పశ్చాత్తాపడి మార్గం మార్చుకున్నాడు. మొదటి రోజుల్లో దేవునిపై చూపిన స్వచ్ఛమైన ప్రేమను జ్ఞాపకం చేసుకొని తిరిగి దేవుని తట్టు తిరగడం శ్రేష్టమైన సంగతి కాదా! దేవుడు ఒక వ్యక్తి గురించి సరిగ్గా ఏమనుకుంటున్నాడో తెలియబడి, ఆ వెలుగులో నడవగలిగిన వ్యక్తి కంటే ధన్యుడు ఇంకెవరు ఉంటారు? ◆Walk always in the light of GOD ◆
Comments
Post a Comment