❇ అప్పుడు ఒక దేవదూత పరలోకం నుండి దిగి రావడం నేను చూశాను. అతని చేతిలో ఒక పెద్ద గొలుసూ, అగాధం తాళం చెవి ఉన్నాయి. ఆ దేవదూత 'అపవాది', 'సాతాను' అనే పేర్లున్న ఆది సర్పాన్ని పట్టుకొని 1000 సంవత్సరాల వరకూ బంధించి, వాణ్ణి అగాధంలో పడవేసి, దానిని మూసివేసి, దానికి ముద్ర వేసాడు. ఆ తరువాత వాణ్ణి కొద్ది కాలానికి విడుదల చేయడం జరిగి తీరాలి...
1000 సంవత్సరాలు ముగిశాక సాతాను తన చెరలోనుండి విడుదల అవుతాడు. వాడు బయల్దేరి నాలుగు దిక్కులలో ఉన్న గోగు, మాగోగు అనే దేశాల్ని మోసం చేసి యుద్ధానికై సమకూరుస్తాడు. వారు అంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమైన ప్రియ పట్టణాన్ని ముట్టడి వేస్తారు.
అప్పుడు పరలోకంనుండి అగ్ని దిగివచ్చి వారిని దహించి వేస్తుంది. వారిని మోసం చేసిన అపవాదిని అగ్ని గంధకములు గల గుండములో పడవేస్తారు. అక్కడే క్రూర మృగమూ(anti-christ), అబద్ధ ప్రవక్తా ఉన్నారు. వారు యుగయుగాలకు రాత్రింబగళ్లు వేదనపాలై ఉంటారు (ప్రకటన 20:1-10).❇
■ సాతాను(అపవాది) యొక్క అంతిమ గతి ఇలా ఉండబోతుంది. "సాతాను భీకరమైన కోపంతో ఉన్నాడు. ఎందుకంటే తన సమయం కొంచెమే అని వాడు తెలుసుకు న్నాడు"(ప్రక 12:12).ఆ అంతిమ తీర్పు వాడికి, వాడి దూతలకు బాగా తెల్సు, కనుకనే భయపడి వణకుతున్నాయి (మత్త 8:29, లూకా 8:31) క్రీస్తు సిలువ విజయంతో సాతాను ఓడింపబడ్డాడు(కొలస్సి 2:15). వాడి పనులను నాశనం చేయడానికే క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు(1యోహా 3:8).మనలో నివసిస్తున్న దేవుడు లోకాన్ని, పాపాన్ని జయించిన జయశాలి. దేనిని బట్టి మానవాళిపై సాతాను గర్వించాడో, ఆ మరణపు ముల్లును దేవుడు విరిచేశాడు. అపవాది తల చితుకగొట్ట బడింది.
■ క్రొత్తనిభంధన కృప క్రింద ఉన్న ఏ విశ్వాసిపై ఇకను పాపం ఏలుబడి చెయ్యదు (రోమా 6:14).(అల్పవిశ్వాసంతో, పరిశుద్ధాత్ముని పరిపాలన క్రిందకు రాక, ఇంకను స్వశక్తితో పోరాడే పాత నిబంధన జీవితాన్ని జీవిస్తే, విజయవంతమైన క్రైస్తవ జీవిత అనుభవం ఉండదు, నూతన నిబంధన జీవితం పరిశుద్ధాత్మ రాకతో జీవం పోసుకుందని మరవొద్దు. అ.కా 1:8). లోకాన్ని జయించినది మనలోని విశ్వాసమే! ఇకను మనం అపవాదికి భయబడాల్సిన అవసరం లేదు. మనలో ఉన్నవి ఎంత గొప్ప బలహీనతలైనా క్రీస్తు దాని నుండి విడిపించగల సమర్థుడని నమ్మితేనే ఆ విజయంలో మనకు పాలువుంటుంది. ఇశ్రాయేలీయులు కనానీయుల దేహదారుఢ్యాన్ని చూసి దేవుని గొప్ప వాగ్దానాలను అవిశ్వాసంతో నమ్మక దేవుణ్ని అవమానించారు. నేడు మనం కూడా బైబిల్లోని అన్ని దేవుని కార్యాలను నమ్మి, మన జీవితంలోని పాపపు బలహీనతల నుండి విడిపించలేడు అన్నట్లు ప్రవర్తిస్తే, వారెలా దేవుని శక్తితో జరిగించిన యుద్దాలలో పాలుపంపులు లేక వాగ్దాన దేశంలో ప్రవేశించలేక పోయ్యారో, అలాగే మనం మన పాపపు బలహీనతల ఏలుబడి క్రిందే ఉంటూ ఓడిపోయే క్రైస్తవునిగా ఉంటాము. "నన్ను అనుసరించండి"- అని చెప్పిన క్రీస్తు ఆయన వలె జీవించడానికి శక్తిని ఇవ్వగల సమర్థుడు. దావీదు౼ గోల్యతును సంఘటన గుర్తుచేసుకోండి! బలవంతుడ్ని జయించింది దావీదుకు దేవునిపై ఉన్న విశ్వాసమే!
■ దేవునికి లోబడి ఉండండి! సాతానుని వ్యతిరేకించండి! వాడు మీ దగ్గరనుంచి పారిపోతాడు(యకో 4:7). రక్తం కారేటట్లు పోరాటం జరిగించమని వాక్యం చెప్తుంది (never take SIN light in ur life).క్రింద పడిన ప్రతిసారి క్రీస్తు నన్ను తిరిగి నిలబెట్ట సమర్థుడనే నీ విశ్వాసాన్ని మొదట దేవునితో, తర్వాత సాతానుతో చెప్పు! విడువక చేసే పోరాటంలో నీకు తెలియకుండానే దినదినం బలవంతుడవౌతూ ఉంటావు.దేవుని పరిశుద్ధతలో పాలుపంపుల కోసం నీవెంత తీవ్రత కలిగి ఉన్నావో దేవుడు నిన్ను, నీ విశ్వాసాన్ని కనిపెడుతూ ఉంటాడు.
ఖశ్చితంగా త్వరలో సాతానుని నీ పాదాల క్రింద చితక తొక్కిస్తాడు. ఇది దేవుని వాగ్దానం!(రోమా 16:20).
విశ్వాసం నీదైతే౼యుద్ధం దేవునిదౌతుంది(విశ్వాసం క్రియలతో నిరూపితమౌతుందని మర్చిపోవొద్దు!)
Comments
Post a Comment