❇ దెలీలా తన తొడ మీద సమ్సోణ్ని నిద్రపోయేలా చేసి, ఒక మనిషిని పిలిపించి, సమ్సోను తలమీద ఉన్న ఏడు జడలు గొరిగించింది. సమ్సోను బలహీనుడయ్యాడు. అప్పుడామె అతణ్ణి బాధించడం మొదలు పెట్టింది.
మరియు ఆమె౼“సమ్సోను! ఫిలిష్తీయులు మీ మీదికి వచ్చేస్తున్నారు” అని ఆమె అరచింది.
అతడు నిద్ర మేల్కొని “మునుపులాగే బయటికి వెళ్ళి విజృంభిస్తాను” అనుకొన్నాడు. యెహోవా తనను విడిచిపెట్టాడని అతనికి తెలియదు.
వెంటనే ఫిలిష్తీయులు అతణ్ణి పట్టుకొన్నారు. అతని కళ్ళు ఊడబెరికారు. అతణ్ణి గాజాకు తీసుకుపొయ్యారు. అక్కడ అతణ్ణి కంచు గొలుసులతో కట్టివేసి, ఖైదులో తిరగలి విసిరేవాడుగా చేశారు. అయితే గొరిగిన అతని తలవెండ్రుకలు తిరిగి పెరగడం మొదలు పెట్టాయి.❇
■ సమ్సోను పుట్టుక చాలా ప్రత్యేకమైనది. బైబిల్ లో అతి కొద్దిమంది గూర్చి మాత్రమే, ఒకడు పుట్టక మునుపే వాని జననం గూర్చి, వాని పట్ల దేవుని ప్రణాళికల గూర్చి దేవుడు ముందుగానే తెలియజేశాడు. సమ్సోను వారిలో ఒకడు. దేవుడు తన దూతను పంపి తల్లిదండ్రులకు జాగ్రత్తలు చెప్పి, హెచ్చరించి దేవునికి ప్రతిష్ఠితుడైన వాడని తెలియజేశాడు. ఒక్క సమ్సోనే దేవుని సైన్యంలా వాడబడ్డ గొప్ప బలశాలి. దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపించబడి గొప్ప కార్యాలు చేసిన విశ్వాస వీరుడు.ఇతని పట్ల దేవుని ఆలోచనలు ఎంతో గొప్పవి.
■ దేవుడు ఏది మంచిదై ఉన్నట్లు తలంచుతాడో (గొప్ప ప్రణాళికలు కలిగివుంటాడో) దానిపైనే అపవాది విల్లు ఎక్కుపెట్టి
నాశనానికి దారులు వెతుకుతాడు. ఆది నుండి నేటివరకు వాడు గురి అదే. (అవిశ్వాసి ఎలాగూ వాడి వశంలో ఉంటాడు గనుక )గర్జించు సింహం వలె తిరుగు అపవాదికి మొదట గురి విశ్వాసే.సింహాన్ని సైతం వట్టి చేత్తో చీల్చి వేయగల బలాఢ్యుడైన సమ్సోను బలహీనతను సైతాను గుర్తించాడు. ఆ దారిగా పతనానికి తీసుకువెళ్లాలని ఉద్దేశించాడు(ఆది 3:6, మత్త 4:2,3).సమ్సోను ఈ పాపాన్ని తీవ్రంగా యెంచి దేవుని దగ్గరకు తీసుకెళ్లలేదు, కానీ ఆ పాపంతో రాజీపడ్డాడు. కారణం ఇంకా దేవుడు అతణ్ణి ద్వారా గొప్ప కార్యాలు చేస్తున్నాడు గనుక దేవుడు ఎన్నటికీ విడువడనే విశ్వాసం. పాపం భ్రమను కలిగిస్తుంది(హెబ్రీ 3:15, ఆది 3:8, మత్త 7:22). తలాంతు(talents) ఎన్నడూ ఒకని ఆధ్యాత్మిక స్థితిని తెలియజేయదు గాని దేవునితో వ్యక్తిగత సంభంధం, ఆయన మాటకు లోబడటంలోనే తెలుస్తుంది. తలాంతు ద్వారా సేవ విస్తరించినా వ్యక్తిగతంగా దేవుడు మన యెడల సంతోషించకుండా ఉండొచ్చు. కనుక ఎన్నడూ సేవను మన ఆత్మీయ ఎదుగుదలకు కొలమానంగా చూడకూడదు.
■ దేవుడు తోడై ఉన్నప్పుడు శత్రువులు అతణ్ణి చూసి భయపడి దూరం పారిపొయ్యారు. గొలుసులు సైతం బంధించలేనంత బలాఢ్యుడిగా ఉండటమే దేవుని చిత్తం. అంతేకాని సమ్సోనును దెలీలా కౌగిట చూడటం, ఫిలిష్తీయుల చెరలోకి వెళ్లడం, అవమానాలు పొందటం దేవుని చిత్తం కాదు.ఓ విశ్వాసి దేవుడు నిన్ను గురించి చాలా గొప్ప ఉద్దేశ్యాలు కలిగి ఉన్నాడు. నీవెక్కడ ఉన్నావ్?(లూకా 15:15,16).ఏ స్వచ్ఛను ఉపయోగించి తప్పుడు స్థలాన్ని కోరుకున్నాడో అదే స్వేచ్ఛలో నుండి తన పాపం విషయమై ఎవ్వరిని (మోసగించిన దెలైలాను) నిందించక, పశ్చాత్తాపడి, విశ్వాసంతో దేవుని సన్నిహిత్యాన్ని కోరుకున్నాడు(అతని తలవెండ్రుకలు తిరిగి పెరగాయి). మనకొక గొప్ప నిరీక్షణ మన దేవునిలో ఉంది. ఎలాంటి స్థితిలోనైనా పశ్చాత్తాపడి,దేవుని దగ్గరకు తిరిగి వస్తే ఆయన ఎన్నడూ త్రోసివేయాడు. తిరిగి పూర్వపు స్థితితో నింపుతాడు. సమ్సోనులో ఉన్న గొప్ప విశ్వాసం ఇదే!
Comments
Post a Comment