❇ లుస్త్రలో పుట్టు కుంటివాడొకడు కూర్చుని ఉన్నాడు. కాళ్ళలో సత్తువ లేక అతడు పుట్టినప్పటి నుండి ఎన్నడూ నడవలేదు.
పౌలు మాట్లాడుతూ ఉంటే అతడు విన్నాడు. పౌలు సూటిగా అతని వైపు చూసి, బాగుపడడానికి అతనికి విశ్వాసముందని గ్రహించి౼ "లేచి నిలబడు!" అని బిగ్గరగా చెప్పాడు. అతడు తటాలున లేచి నిలబడి, గంతులు వేసి నడవసాగాడు ❇
■ దేవుడు అనాధికాల సంకల్పంలో ప్రతి మనిషిని కలుసుకోవడానికి ఒక సమయం నిర్ణయిస్తాడు. లుస్త్రలో పుట్టు కుంటివాడు ఎన్నోసార్లు ఆ దారిలో వచ్చి ఉండొచ్చు..కానీ
ఆ రోజు అతనికి-దేవునికి ఒక ప్రత్యేకమైన రోజు. సృష్టికర్త అతణ్ని కలుసుకునే రోజు. పౌలు మాటలను అతను శ్రద్ధగా వింటున్నప్పుడు..అతనిలో దేవునిపై లోతైన విశ్వాసం కలిగింది.
తమ సృష్టికర్తయిన దేవుని మాటలు తమ దగ్గరకు వచ్చినప్పుడు, నిజానికి మానవహృదయాలు గుర్తుపడతాయి. ఐతే యదార్థవంతులు హత్తుకోగా, హృదయంలో పాపాన్ని ప్రేమించే వారు, సత్యానికి చెవి ఇవ్వనివారు, వారి హృదయ కఠినత్వాన్ని బట్టి త్రోసిపుచ్చుతారు. దేవుణ్ని హత్తుకున్నవారు దేవునితో జీవిస్తారు, ఆయన్నుండి వెరై ఉండాలనుకునే వారు పాపానికి దాసులుగా జీవిస్తారు. సత్యాన్ని ప్రేమించే ప్రతివాడు దేవుణ్ని హత్తుకుంటాడు.
■ "దేవునికి (క్రీస్తుకు) అసాధ్యమైనది ఏదీ లేదని, అసాధారణ కార్యాలను సైతం చేయగల శక్తి గలవాడు" అనేంత దృఢమైన విశ్వాసంలోకి ఆ కుంటివాడు వెళ్ళాడు. దేవుని ఆత్మ చేత నింపబడిన పౌలును, ప్రభువు ఆత్మ వాని వైపు సూటిగా చూపిస్తూ ఏం చెయ్యాలో చెప్పాడు. "లేచి నిలబడు!" అనే మాట ఆ వ్యక్తికి అసాధ్యమైన మాట.ఆ మాట పలికింది దేవుడేనని విశ్వాసంతో అతను నమ్మాడు. అల్పవిశ్వాసంతో సందేహించ లేదు గానీ, దేవుని మీద విశ్వాసంతో(క్రీస్తు శక్తిని బట్టి) నిలబడటానికి ప్రయత్నించాడు. ఎండిపోయిన, శక్తిహీనంగా ఉన్న ఆ కాళ్ళలోకి దేవుని శక్తి ప్రవేశించింది. దిగ్గున లేచి నిలువబడి, గంతులు వేశాడు.
■ 'మనం నమ్ముతుంది-దేవుడు చేస్తాడనేది' విశ్వాసం కాదు గాని, 'దేవుడు పలికింది౼తప్పక నెరవేర్చగల సమర్థుడు అని నమ్మేదే' విశ్వాసం. ఈ రెండింటికి మధ్య తేడా గమనించండి. 'దేవుడు చెప్పకుండా పౌలు చెప్పినా' లేక 'నాకు విశ్వాసముంది దేవుడు బాగుచేస్తాడని' అతను నిలబడినా ఈ కార్యం జరుగదు.ఆ మాట దేవుడు చెప్పిందై ఉండాలి. దేవుడు తమతో చెప్పిన మాటను/వాగ్దానాలను అనుమానించక, చేయగల సమర్థుడని నమ్మటమే విశ్వాసం(హెబ్రీ 11:11,12, రోమా 4:18-21). మనం నేడు పోరాడుతున్నవి ఎంతటి గొప్ప బలహీనతలైనా దేవుడు విడిపించగల సమర్థుడని విడువక నమ్మటంలోనే బలం దాగివుంది. దేవునిపై ఉన్న విశ్వాసంలోనే ఒకని ఆత్మీయ బలం దాగి ఉంటుంది.
౼దేవుని శక్తిపై మనకున్న బలమైన విశ్వాసం, పాపపు బలహీనతల యొక్క బలాన్ని నిర్వీర్యం చేస్తుంది. అధైర్యపడక, కృంగిపోక విశ్వాస వీరునిగా, యేసు వైపు చూస్తూ మన పరుగు కొనసాగిద్దాం!
Comments
Post a Comment