❇ ఆయన యెరూషలేంకు ప్రయాణమై గలిలయ నుండి సమరయ పొలిమేరలకు వచ్చాడు. అక్కడ పదిమంది కుష్టురోగులు ఆయన దగ్గరకు వచ్చారు.
వారు ఆయనకు కొద్ది దూరంలో నిలుచొని౼"యేసు ప్రభూ! మాపై దయచూపు" అని గట్టిగా కేకలు వేసారు. ఆయన వారిని చూసి౼"మీరు వెళ్లి, యాజకులకు కనపడండి" అని చెప్పాడు.
వారు వెళ్తుండగా కుష్టు రోగం నయమై శుద్ధులయ్యారు. వారిలో ఒకడు తన రోగం నయం కావడం చూసి బిగ్గరగా, దేవుణ్ణి కీర్తిస్తూ, తిరిగి వచ్చి ఆయన పాదాల ముందు సాష్టాంగపడి ఆయనకు కృతజ్ఞతలు చెప్పాడు.అతను సమరయ జాతివాడు.
అందుకు యేసు౼"పది మంది శుద్ధులయ్యారు కదా! మిగతా తొమ్మిది మంది ఎక్కడ? ఈ సమరయుడు తప్ప మరెవ్వరూ దేవుణ్ణి స్తుతించటానికి తిరిగి రాలేదా?" అన్నాడు.
ఆ తర్వాత అతనితో౼"నువ్వు లేచి వెళ్ళు! నీ విశ్వాసం నిన్ను బాగు చేసింది" అని చెప్పాడు. ❇
ఆ తర్వాత అతనితో౼"నువ్వు లేచి వెళ్ళు! నీ విశ్వాసం నిన్ను బాగు చేసింది" అని చెప్పాడు. ❇
■ పదిమంది కుష్ఠురోగులు యేసును వేడుకున్నప్పుడూ.. స్వస్థత పొందినప్పుడూ.. వారిని గూర్చి ఒక గుంపుగానే చెప్పబడింది. వారు బాగుపడిన తర్వాత, మిగితా వారికి భిన్నంగా ఒక్కడు ప్రవర్తించాడు.వాడు యూదుల చేత హీనంగా ఎంచబడే(అధమ జాతి) సమరయుడు. వాడు బిగ్గరగా దేవుణ్ణి కీర్తిస్తూ తిరిగి యేసు దగ్గరకు కృతజ్ఞతలు చెప్పాడు.ఎందుకంటే, 'నా వంటి అల్పున్ని దేవుడు కరుణించాడ'ని, వాని హృదయం కృతజ్ఞతతో నింపబడింది. ఎవరైతే తమ స్థితిని తాము యదార్ధంగా గుర్తిస్తారో, వారే దేవునికి ఎక్కువ కృతజ్ఞత కలిగి జీవిస్తారు (లూకా 7:47,1తిమో 1:11-13).
■ కృతజ్ఞతరహితంగా ప్రవర్తించిన ఆ తొమ్మిది మంది, వారు దేని కోసం దేవుని దగ్గరకు వచ్చి వేడుకున్నారో, అది వారికి దొరికింది(స్వస్థత). అది ఖచ్చితంగా దేవుని దగ్గర నుండే పొందుకున్నారు. కానీ వారి ఆత్మలను కోల్పోయారు.వారు కృతజ్ఞతలేని వారుగా ఉంటారని, ముందుగానే తెల్సినా, ఆయన వారికి మేలు చెయ్యకుండా మానడు. ఎందుకంటే ఆయన మంచివాడు. నిజానికి మన జీవితాల్లోని ప్రతి కొదువ, ఇబ్బంది..దేవుణ్ని సమీపించి ఆయన్ను కలుసుకోవడానికి/ తెల్సుకోవడానికి అవకాశాలుగా పంపబడతాయి. కృతజ్ఞతరహితులు, స్వార్ధపరులు విలువైన దేవుణ్ణి నిర్లక్ష్యం చేసి విడిచిపెడతారు. కాబట్టే మరణం తర్వాత శాశ్వితంగా వారు దేవుణ్ణి విడచి, ఆయన లేని ప్రదేశానికి (నరకానికి) వెళ్తారు. ఎందుకంటే మనం భూమిపై స్వేచ్ఛగా తీసుకున్న నిర్ణయాలను దేవుడు శాశ్వితంగా గౌరవిస్తాడు.
■ ఎప్పుడైనా నీకున్న పాపపు బలహీనతల బట్టి బాధపడి కృంగిపోయావా? మిగితా వారితో పోల్చితే అల్పునిగా ఉన్నానని అనుకున్నావా? ఇప్పుడు నీవు ఉన్నపాటునే దేవుడు నిన్ను అంగీకరిస్తాడని నీకు తెలుసా? ఎప్పటిదాకా ఏలాంటి జీవితాన్ని నువ్వు జీవించినప్పటికీ దేవుడు నిన్ను దగ్గరకు చేర్చుకుంటాడు. యదార్థవంతుడవై(ఎవ్వరిని నిందించక) ఉన్నది ఉన్నట్లుగా నీ తప్పులను దేవుని దగ్గర ఒప్పుకొని, విడిచి పెట్టడానికి తీర్మానం చేసుకో! నీపై ఆయన ఏలుబడికి ఎంత నిన్నునీవు అప్పగించుకుంటావో, అంత ఆయన నీ జీవితంపై పని చేస్తాడు. దేవుని వాక్య ద్యానంలో, ప్రార్ధనలో, సహవాసంలో మరి ఎక్కువగా బలపడి, రక్షణ ఆనందాన్ని పొంది క్రొత్త జీవితాన్ని జీవిస్తావు.
■ ఆయన మనకు చేసిన దానికి ప్రతిగా, మనం ఏమి తిరిగి ఇవ్వలేమని అనుకుంటాం... ఆయన దేవుడు కాబట్టి మన దగ్గర నుండి ఏమి ఆశించడని భావిస్తాం...కానీ పై సందర్భాన్ని బట్టి చుస్తే, ఆయన మన నుండి కృతజ్ఞత కలిగిన జీవితాన్ని ఆశిస్తాడని తెలియజేస్తుంది. కృతజ్ఞతతో తిరిగి వచ్చిన ఆ వ్యక్తి వలె, దేవుని ప్రేమను దాటిపోలేని క్రీస్తు ప్రేమ-ఖైదీలుగా(క్రీస్తు స్వభావంలోకి మారుతూ) జీవించాలని దేవుడు కోరుతున్నాడు. అందుకు ఆయనే సహాయం చేస్తాడు. ఆయన నిన్ను పిలుస్తుండగా ఆలస్యం ఎందుకు? నేడే దేవుని దగ్గరకు వచ్చి పాపక్షమాపణను అడిగి, దేవుని పరిశుద్ధ మార్గంలోకి ప్రవేశించు. క్రీస్తును నీ స్వంతరక్షకునిగా జీవితంలో చేర్చుకో!
Comments
Post a Comment