❇ నయోమి బెత్లెహేము ప్రజలతో౼“నన్ను నయోమి అనకండి. సర్వశక్తిమంతుడు నాకు దుఃఖం కలిగించాడు..నేను మోయాబు వెళ్ళిపోయినప్పుడు నాకు సమృద్ధి ఉంది. ఇప్పుడు ఏమీ లేకుండా నన్ను తిరిగి వచ్చేలా యెహోవా చేశాడు.. యెహోవా నాకు విరుద్ధ సాక్షిగా నిలబడ్డాడు. సర్వశక్తిమంతుడు నామీదికి ఆపద రప్పించాడు.”
బోయజు రూతుతో౼“నీ భర్త చనిపోయిన తరువాత...నీవు నీ తల్లిదండ్రులనూ నీ జన్మభూమినీ విడిచి, ఇంతకుముందు నీకు తెలియని ఈ ప్రజలమధ్యకు వచ్చావు. నీవు చేసినదానికి యెహోవా ప్రతిఫలం ఇస్తాడు. ఇస్రాయేల్ దేవుడైన యెహోవా రెక్కల కింద శరణు కోరి నీవు వచ్చావు. ఆయన నీకు పరిపూర్ణ బహుమతి ఇస్తాడు" ❇
✔ బెత్లెహేములో కరువు వచ్చినందుకు నయోమీ, ఆమె భర్త-ఇద్దరు పిల్లలతో బ్రతుకు తెరువు కోసం మోయాబు దేశానికి వలస వెళ్లారు. వారు భూసంభందమైన విషయాలకు మాత్రమే విలువనిచ్చారు. దేవుని వాక్యాన్ని-విశ్వాసుల సహవాసాన్ని, దేవుని వాగ్ధాన దేశాన్ని వదలిపెట్టి, విశ్వాసరహిత ప్రయాణం చేశారు. కొన్నిరోజుల తర్వాత ధర్మశాస్త్రనికి విరుద్ధంగా అవిశ్వాసులతో వియ్యమొందారు. ఐతే నయోమీ ఊహించిన జీవితానికి విరుద్ధంగా వాస్తవ జీవితంలో దుఃఖమే మిగిలింది. ఆమె తన భర్తను, ఇద్దరు పిల్లలను కోల్పోయింది. కానీ నయోమీ కోడలైన(మోయాబు స్త్రీ) రూతు తన అత్త ద్వారా దేవుని గూర్చి విని, దేవునిలో విశ్వాసముంచింది. దేవున్ని-ఆయన ప్రజల స్నేహాన్ని కోరుకుంది. నయోమీ ఒకత్తె తిరిగి బెత్లెహేము వెళ్తుంటే, రూతు తన స్వంత ప్రజలను విడిచిపెట్టి, ఆమెతో పాటు బెత్లెహేము రావడానికి విశ్వాసంతో బయలుదేరింది.
● ఒక అవిశ్వాస ప్రయాణం౼దేవుని విడిచి, లోక సుఖాలను హత్తుకుని పరుగులెత్తిన వారు వట్టి చేతులతో మిగిలి పోయ్యారు.
● ఒక విశ్వాస ప్రయాణం౼విశ్వాసంతో దేవుణ్ని హుత్తుకొని, అత్తను శ్రమలో ఒంటరిగా వదిలి వేయక, భవిష్యత్తు ఏం జరుగుతుందో తెలియకపోయినా, దేవుణ్ని ఆధారం చేసుకుని ప్రయాణించింది.
✔ కాబట్టే మోడులా మారిన రూతు జీవితానికి కొత్త చిగురును అనుగ్రహించాడు. భక్తిగల విశ్వాసిని భర్తగా ఆమెకు అనుగ్రహించాడు. ఆమెను లోక రక్షకుడైన క్రీస్తు వంశావళిలో భాగంగా దేవుడు చేశాడు. అనేక మంది రాజులు ఆమె వంశంలో నుండి వచ్చారు. ఇది(ఏమి ఆశించని) విశ్వాసానికి దేవుడు అనుగ్రహించిన బహుమతి.
✔ వీరి ఇద్దరి జీవితాల నుండి విశ్వాసంతో౼నిరీక్షణతో దేవుణ్ని హత్తుకోవటం గూర్చిన పాఠాలు నేర్చుకోవచ్చు. గమనించి చూస్తే నయోమీ కంటే రూతులో (దేవుని విషయంలో) ఎంతో యోగ్యమైన ప్రవర్తన కనిపిస్తుంది. కొన్ని సార్లు మన ద్వారా దేవునిలోకి నడిపించబడిన వారు, (ఆత్మీయంగా)వయస్సులో చిన్నవారు, మన కంటే ఎక్కువగా దేవుణ్ని హత్తుకొని జీవిస్తునట్లేతే, మనం (సిగ్గుపడి) సరిచేసుకోవాలే తప్ప వ్యర్ధమైన అతిశయాలకు/అసూయలకు పోకూడదు. మన ఆత్మీయ జీవితాలు ఒకరినొకరు ప్రోత్సహించుకోవడానికి, బలపరచుకోవడానికి ఆదర్శలుగా నిలవాలి. అందరికి దేవుడు ఒక్కడే, రక్షకుడు ఒక్కడే, నడిపించే ఆత్మ దేవుడు ఒక్కడే! కానీ మనం దేవుణ్ని ప్రేమించి, కోరుకొని జీవించే జీవితం, తీసుకొనే తీర్మానాలు ఒకరి భక్తి నుండి ఒకరిని వేరు చేస్తూ ప్రత్యేక పరుస్తున్నాయి. దేవునిలో ఆ ప్రత్యేకమైన జీవితాలను మనం కొనసాగింతుము గాక!
Comments
Post a Comment