❇ బాప్తిస్మమిచ్చే యోహాను పుట్టుక గురించి దేవదూత ముందుగానే అతని తండ్రికి ఈ విధంగా తెలియజేశాడు..
గబ్రియేలు దూత జెకర్యాతో౼"జెకర్యా, భయపడకు. నీ ప్రార్థన వినబడింది. నీ భార్య ఎలీసబెతు నీకు కొడుకును కంటుంది. అతనికి యోహాను అని పేరు పెడతావు...తల్లి గర్భాన పుట్టింది మొదలు దేవుని పరిశుద్ధాత్మతో నిండి ఉంటాడు. ఇశ్రాయేలీయుల్లో అనేకమందిని వారి ప్రభువైన దేవుని వైపుకు మళ్ళిస్తాడు. తండ్రుల హృదయాలను పిల్లల వైపుకీ, అవిధేయులను నీతిమంతుల జ్ఞానానికీ మళ్ళించడానికీ, తద్వారా ప్రభువు కోసం సిద్ధపడిన ప్రజానీకాన్ని తయారు చేయడానికి అతడు 'ఏలియా' మనసుతో బలప్రభావాలతో ప్రభువు కంటే ముందుగా వస్తాడు" ❇
✔ బాప్తిస్మమిచ్చే యోహాను తన తల్లిదండ్రుల ముసలితనంలో పుట్టడం వల్ల, వారిని తన చిన్నతనంలోనే కోల్పోయాడు. ఒకవేళ అందువల్లే కాబోలు..అతని జీవనం అరణ్యములో కొనసాగింది. మిడతలు, అడవి తేనెను తింటూ, ఒంటె చర్మం ధరించాడు(మత్తయి 3:4). ఇతని వస్త్రధారణకు, మత పెద్దలు ధరించిన వస్త్రధారణకు చాలా తేడా ఉండేది. చూడగానే అడవి మనిషిని తలపించే ఆకారం.బాప్తిస్మమిచ్చే యోహానును అప్పటి మత పెద్దలు దైవ సంభంధిగా అంగీకరించ లేదు, పైగా దెయ్యం పట్టిన వాడని పిలిచారు(లూకా 7:33, 20:4,5). దేవుని వాక్యము అరణ్యములో ఉన్న యోహాను వద్దకు వచ్చింది. యోహాను పరిశుద్ధాత్మతో నింపబడి, దేవునితో వ్యక్తిగత సంభంధం కలిగి ఉండి, తనను తాను లోకం నుండి ప్రత్యేక పరచుకున్న యవ్వనుడు (అతని వయస్సు సుమారు 30 ఏళ్ళు). ప్రవచనానుసారం రక్షకుని రాక గూర్చి ముందుగా ప్రకటించడానికి దేవుడే అతన్ని సిద్ధం చేసాడు(యెషయా40:3)
✔ నిజానికి భోధించాల్సిన వారు, ఈ పని చేయాల్సిన వారు ప్రధాన యాజకులు, మత పెద్దలు. వారు దేవునితో సంభంధం లేకుండా జీవిస్తున్నప్పుడు లోకరీత్యా అల్పులను, హీనపర్చబడిన వారిని దేవుడు వాడుకుంటాడు. మార్గం తప్పి౼హృదయాలను కఠిన పర్చుకొన్నవారు దైవ సంబంధులను గుర్తు పట్టకుండా..వారు హీనపర్చుకొనే ముసుగును దేవుడు తన సంబంధులకు ధరింపజేశాడు. అందుకే క్రీస్తు పుట్టుక బెత్లహేములో జరిగిన తర్వాత మళ్ళీ నజరేతుకు తీసుకువచ్చాడు(యోహాను 7:52). అందువల్ల పరిసయ్యులు, ప్రధాన యాజకులకు ఆయనే రక్షకుడనే ఆనవాళ్లు దొరక్కుండా పోయాయి. యదార్థవంతులు మాత్రమే ఆయన్ను గుర్తుపట్టేట్లుగా దేవుడు చేశాడు.నతానియేలు, సుంకారులను, జాలరులు వంటి వారు క్రీస్తును హత్తుకొన్నారు (యోహాను1:47). మన తరంలో కూడా ఈ రెండు రకాల గుంపులు లేకపోలేదు.
✔బాప్తిస్మమిచ్చే యోహాను మనుష్యుల అంగీకారం కోసం గాని, సమన్వయం కోసం గాని ఎన్నడూ ఎదురు చూడలేదు(మత్తయి 3:7). కాని తనను పంపిన వానిని(దేవుణ్ని) ముందు పెట్టుకొని జీవించాడు, దేవుని మాటలు కోసం కనిపెట్టాడు. ఆయన ఏం చెప్తే అదే బోధించాడు..ఇలా ఉంటూనే దీనుడుగా తనను తాను తగ్గించుకొని జీవించాడు(యోహాను 1:27).ఇది దేవుని సంభంధి లక్షణం. క్రీస్తు దైవ సంభంధి కనుకనే మత పెద్దల్లో దైవత్వం లేదని, యోహాను దేవుని వాడని గుర్తు పట్టాడు. దేవత్వం వయస్సులో, చదువుల్లో, స్థాయిలో నివసించదు గాని దేవుణ్ని ఆనుకోని జీవించే వారిలోనే ఉంటుంది. ఇది ఆత్మకు సంభందించిన విషయం.మరొక ఆత్మీయుడు గుర్తు పట్టగలడు. తిండి, బట్ట, వేషభాషాలు కాదు గాని..'ఇతడు దేవునితో అంటుకట్టబడి ఉన్నాడా?' అని అతన్ని ప్రేరేపిస్తున్న ఆత్మను చూడాలి. అతని ఆత్మ ఫలాన్ని చూడాలి(తలాంతులను కాదు)! యేసు యోహానును అలాగే చూచాడు, కనుకనే అతని యొద్దకు దేవుని చేత పంపబడ్డాడు.
Comments
Post a Comment