❇ ఆదిలో దేవుడు భూమి, ఆకాశాలనూ సృజించాడు. అప్పుడు భూమి మొత్తం శూన్యంగా, రూపం లేకుండా ఉంది. మహా సముద్రాన్ని చీకటి ఆవరించింది. దేవుని ఆత్మ నీళ్ళపై సంచరిస్తూ ఉన్నాడు.
అప్పుడు దేవుడు౼“వెలుగు కలుగును గాక!” అనగానే, వెలుగు వచ్చింది. దేవుడు ఆ వెలుగు చూశాడు. అది చక్కగా ఉన్నట్లు ఆయన చూసాడు. అప్పుడు దేవుడు ఆ వెలుగును, చీకటి నుండి 'వేరు' చేసాడు. వెలుగుకు “పగలు” అని, చీకటికి “రాత్రి” అని పేరు పెట్టాడు. అస్తమయము, ఉదయం అయ్యింది. ఇది మొదటి రోజు ❇
■ దేవుడు సృష్టి నిర్మాణం అంతటిని ఆరు రోజుల్లో ముగించాడు. ఆదిలో ఖాళీగా, ఆకారం లేకుండా ఉన్న భూమిని దేవుడు తన ఆలోచనల్లోని రూపంతో నింపాలని కోరుకున్నాడు. ఆయన మాట పలుకగా, తన ఆత్మ ద్వారా నూతన నిర్మాణం జరిగింది. దినదినం ఆయన కోరుకున్న రూపంలోకి మార్పు చెందుతూ వచ్చింది.నేడు ఏ మాత్రం నిరీక్షణ లేని (శూన్యంగా, రూపంలేకుండా ఉన్న) జీవితాలపై దేవుడు పని చేయడానికి ఇష్టపడతాడు (మానవులందరి జీవితాలు ఈ స్థితిలోనే ఉన్నట్లు దేవుడు చూస్తున్నాడు).
■ నేర్పరియైన శిల్పి ఆకృతి లేని రాయిలో అందమైన రూపాన్ని ముందుగానే తన ఆలోచనల్లో చూచినట్లే...దేవుడు కూడా అస్తవ్యస్తంగా, నిరీక్షణ లేకుండా ఉన్న జీవితాల్లో ఉన్న విలువను ముందుగానే చూస్తున్నాడు. నేర్పరియైన పనివాడు అద్భుతమైన తన చేతి పనిని కనపర్చినట్లే, చెడిపోయిన ఏలాంటి జీవితాలను సైతం గొప్పవాడైన సృష్టికర్త బాగు చెయ్యగల సమర్ధుడు.దేవుడు ఎన్నడూ ఈ భూమిపై వ్యర్ధమైనది సృష్టించలేదు. ఇది వ్యర్ధమైనది అని దేనైనా చూసి చెప్తున్నామంటే దాని గూర్చి మనకు ఇంకా అర్ధం కాలేదని అర్ధం. అలాగే దేవుడు చేసిన మనుష్యుల్లో వ్యర్ధమైన వారు ఎవ్వరూ లేరు. ప్రతి ఒక్కరూ విలువైన వారే! నేడు విలువ లేనివిగా కనిపిస్తున్న మన జీవితాలు౼సృష్టికర్తతో సంభంధం లేకుండా, మన స్వంత ఆలోచనల ప్రకారం జీవించడమే కారణం! ఎప్పుడైతే మనం దేవుణ్ని నమ్మి, తిరిగి ఆయన చేతుల్లోకి ఇష్టపూర్వకంగా వస్తామో..ఆయన ఆలోచనలోని విలువైన, నిజమైన జీవితంలోకి వస్తాము.
■ దేవుడు రక్షకుణ్ని సిలువలో వధించడం ద్వారా, ఆయన రక్తంలో మన పాపాల్ని కడిగి, పవిత్ర పరచి, మనుష్యులందరిని ఆయన పిల్లలుగా చేసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు వెలుగు నుండి చీకటిని వేరుపర్చినట్లు, తన కుమారుడైన యేసులో మనల్ని దాచి, మన జీవితంలో నుండి అపవిత్రతను వేరుచేస్తాడు. దేవుడు యేసును ఎంతగా ప్రేమిస్తాడో, ఇప్పుడు అంతే ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు. నీతిమంతుడైన యేసుకు పరలోకంలో ఎంత వారసత్వం ఉందో, మనకు అంతే వారసత్వం ఇవ్వాలని పరమ తండ్రి ఉద్దేశించాడు. యేసుని మనకు సహోదరునిగా (జ్యేష్టునిగా) చేసాడు కనుక ఇది సాధ్యమైనది. కనుక యేసు వలె మనం నీతికి వారసులుగా, ఆ పేరుకు తగినట్లు జీవించ కోరుకోమని ఆయన చెప్తున్నాడు. దేవుని వాక్యం మనపై అధికారం చేస్తునప్పుడు, దేవుని ఆత్మ మనకు సహాయకుడై అద్భుతమైన నూతన (సృష్టిని) జీవితాన్ని కొనసాగిస్తాడు. మనవైవు నుండి దేవుడు కోరుకునేది దేవునిపై విశ్వాసం౼విధేయత(లోబడటం)! మనలో ఆ పని చేసేవాడు దేవుడే!
✔ భూమికి పునాది వేయబడక ముందే నీ కొరకైన దేవుని ప్రణాళిక ఇదే౼"మనం క్రీస్తు స్వరూప్యంలోకి మారాలనేదే దేవుని అనాధికాల సంకల్పం". ఈ మాటలు సత్యం..నా జీవిత అనుభవం అని దేవుని యెదుట సాక్ష్యమిస్తున్నాను.
Comments
Post a Comment