❇ మోషే సీనాయి పర్వతం మీద నలభై పగళ్ళూ నలభై రాత్రులూ దేవునితో ఉన్నాడు. ఆ సమయంలో కొండ క్రింద ఇశ్రాయేలు ప్రజలంతా వారి బంగారు వస్తువులను పోగుచేసి వాటిని అహరోను దగ్గరకు తెచ్చారు. వాటితో ఒక దూడ విగ్రహం చేసాడు. అప్పుడు ప్రజలు౼"ఓ ఇశ్రాయేలూ, ఐగుప్తు నుండి మిమ్మల్ని బయటకు నడిపించింది ఈ దేవుడే" అన్నారు. అహరోను ఆ దూడ ఎదుట ఒక బలిపీఠం కట్టాడు౼"రేపు యెహోవాకు పండుగ జరుగుతుంది" అంటూ ప్రకటన చేశాడు. మరుసటి రోజు తెల్లవారుతుండగానే వారు లేచి హోమాలు సమర్పించారు. శాంతి బలులు తెచ్చారు. తరువాత ప్రజలు తింటూ త్రాగుతూ కూర్చున్నారు, లేచి ఆడారు. ప్రజలు విచ్చలవిడిగా తిరిగారు. దేవుని కోపం వారిపై రగులుకొన్నది. ❇
✔ ప్రజలు యెహోవా పేరునే మ్రొక్కారు౼బలులు అర్పించారు. తర్వాత తమకు నచ్చినట్లు ఆడారు. వీరికి దేవుడు ఏం చెప్తున్నాడో, ఏం చెయ్యమంటున్నాడో పనిలేదు. ఒకవేళ దేవుని వాక్యం ఉన్నట్లేతే వాటిని సైతం వారి కోరికలకు తగినట్లు అన్వయించుకునే వారు. నేడు ఈ వైఖరి సంఘాల్లో, సహవాసాల్లో కనిపించట్లేదా? ప్రజలను భావోద్రేకాలతో (emotions) చేసే భక్తిని ప్రోత్సహించే అహరోను లాంటి నాయకులు ఎందరో ఉన్నారు. వారి మనసుకు ఉల్లాసం కలిగిచే భావోద్రేకాలతో కూడిన కార్యకలాపాలు..పాటలు, సంగీతం, వాయిద్యాలు, activities ద్వారా పొందే ఉద్రేకం, తన్మయత్వం ఆ స్థలం వరకే పరిమితమౌతుంది. వారి దైనందిక జీవితం షరా మామూలే! ఆత్మను రూపాంతరం చేయనిది, దేవునికి దగ్గరగా తీసుకొని వెళ్లని భక్తి..ఏం భక్తి అది? వారి వ్యక్తిగత జీవితాల్లో దేవునికి స్థానం ఉండదు. చెడిపోయిన పాశ్చాత్య సంస్కృతి సంఘాల్లో ప్రవేశించి ఆత్మతో, సత్యంతో చెయ్యవల్సిన ఆరాధనను కల్తీ చేస్తున్నాయి. వింత ఆకారాలతో, వస్త్రధారణతో సాతాను ప్రతినిధులగా పనిచేసే Rock stars, భావోద్రేకాలతో నడిపే ఆరాధనలతో సంఘాలు భ్రష్టు పడిపోతున్నాయి.(అలా ఉన్న మీ బిడ్డలను చూసి పొంగిపోతున్నారా? దేవునితో సంభంధం లేని ఉగ్రతపాత్రులుగా ప్రోత్సహించవద్దు. దేవుని ముందు లెక్కచెప్పుకోవాల్సిన సమయం వస్తుంది). పేరు దేవునిదే కానీ దేవుని చెందినది కాదు. ఇది కొండ క్రింద ఇశ్రాయేలీయులు చేసిన భక్తి.
✔ కొండపై దేవునితో గడిపిన మోషే జీవితాన్ని గమనించారా! దేవుడు ఏం చెప్తున్నాడో శ్రద్ధగా ఆలకించే జీవితం. ఆకలి దప్పులతో 40 దినాలు గడుస్తున్నా దేవునిలోనే ఆనందించే జీవితం. వ్యక్తిగతంగా దేవునితో సహవాసం..ఆత్మలో దేవుణ్ని నిండు మనస్సుతో కోరుకున్న భక్తి. ఇదే కదా దేవుడు మన దగ్గర నుండి కోరుకునేది. మనకేలా ఇష్టమైనది కాదు..దేవుడు మనల్ని ఏమి చెయ్యమంటున్నాడు అనేదే ముఖ్యం(లూకా 10:38-41)
మోషే క్రిందికి వచ్చి వారిని చూచినప్పుడు అహరోనుకు రాని కోపం మోషేకు వచ్చింది. కారణం..మోషే దేవునికి దగ్గరగా వుండే వ్యక్తి. సరిగ్గా దేవుని వలె ప్రవర్తించాడు. ప్రజల దృష్టిలో అహరోను శాంతి దూత. మోషే కోపిష్టి. కానీ దేవుని దృష్టిలో మోషే (ఇల్లంతటిలో) నమ్మకమైన వాడు. అహరోను దేవుని వలె ప్రవర్తించలేని అసమర్ధుడైన నాయకుడు. నేడు సంఘాల్లో, సహవాసాల్లో కూడా ఇదే జరుగుతుంది.
౼ నీవు ప్రజల ముందు శాంతి దూతగా ఉంటావా? లేక ప్రజలను దేవునితో సమాధానపరిచే దేవుని ప్రతినిధిగా ఉంటావా? ఐతే క్రీస్తు, అపొస్తలులు మార్గంలో ప్రయాణం చేస్తావు.
యేసు తన సహోదరులతో౼"లోకం మిమ్మల్ని ద్వేషించదు. కానీ దాని పనులన్నీ చెడ్డవని నేను సాక్ష్యం చెప్తున్నాను కాబట్టి అది నన్ను ద్వేషిస్తూ ఉంది"(యోహాను 7:7)
Comments
Post a Comment