❇ జలప్రళయం తర్వాత మానవులంతా ఒకే భాష మాట్లాడేవారు. మనుషులు తూర్పు దిక్కునుండి బయలుదేరి, షీనారు దేశంలో మైదాన భూమిని వారు కనుగొని అక్కడే స్థిరపడి పోయారు. అప్పటి నుంచే ఇళ్లు కట్టుటకు ప్రజలు రాళ్లు కాకుండా ఇటుకలనే ఉపయోగించారు. అలానే అడుసు గాక తారును ఉపయోగించారు.
అప్పుడు మనుషులు౼“మనం భూమి అంతటా చెదరిపోకుండేలా ఒక నగరాన్ని కట్టుకుందాం. ఆకాశన్నంటే గోపురం కట్టి మనం పేరు తెచ్చుకుందాం” అని అనుకున్నారు.ఆ పట్టణాన్ని, ఆ గోపుర శిఖరాన్ని చూచుటకు యెహోవా దిగి వచ్చాడు. వాటిని ప్రజలు నిర్మిస్తూ ఉండటం యెహోవా చూశాడు. అది ఆయన ఉద్దేశ్యాలకు వ్యతిరేకంగా ఉంది, కనుక వారి భాషలను తారుమారు చేశాడు. కాబట్టి వాళ్లు ఒకరు మాట్లాడేది ఒకరు అర్థం చేసుకోలేకపోయ్యారు. కనుక ఆ పట్టణాన్ని కట్టుకోవటం ప్రజలు ఆపివేసి, భూమిమీద ఇతర చోట్లన్నింటికీ చెదరిపోయ్యారు.ఆవిధంగా మనుషులు భూమి అంతటా చెదిరిపోయేటట్టు యెహోవా చేసాడు. దేవుడు వారి భాషను తారుమారు చేసినందు చేత ఆ నగరానికి "బాబెలు" అనే పేరు వచ్చింది. ❇
జలప్రళయం తర్వాత దేవుడు నోవహునూ, అతని కొడుకులనూ దీవించి వారితో౼"ఫలిస్తూ సంఖ్యలో అధికం కండి. భూలోకం నిండా విస్తరించండి" అన్నాడు(ఆది 9:1,1:28). కానీ వారు చెదరిపోకుండా ఒకే చోట ఉండటం దేవుని చిత్తానికి పూర్తి విరుద్ధం. వారు గోపురం కట్టి తమకు పేరు తెచ్చుకోవాలనుకున్నారు. మనిషి దేవుని ఉద్దేశ్యాల నుండి వైదొలగినప్పుడు, తన స్వంత ఆలోచనలు, ప్రణాళికల్లోనే బ్రతుకుతాడు. దాని వెనుక ఉద్దేశ్యం తన పేరు కోసం, గొప్ప కోసం, భూసంభందమైన సుఖాలకోసమే మాత్రమే ఆలోచిస్తాడు, జీవిస్తాడు.ఇక్కడ వారిలో ఐక్యత కనిపిస్తుంది, అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానం (technology) ఉంది. కానీ వారి జీవితాల్లో దేవునితో సంభంధం లేదు. ఒకని భూసంభందమైన జ్ఞానం, అతని ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సూచించదు. వారి సొంత జ్ఞానమే వారిని దారి తప్పేట్లు చేస్తుంది. ఎవ్వరైతే లోక జ్ఞానాన్ని పక్కన పెట్టి, దైవ జ్ఞానం మీద ఆధారపడతారో వారే ఆయన చిత్తంలో నిలుస్తారు(క్రీస్తు పుట్టుక సమయంలో జ్ఞానులు, గొఱ్ఱెల కాపరులు దీనికి ఒక ఉదాహరణ) ఒకడు లోకాన్ని సంపాదించుకొని దేవుని కోల్పోతే ఏం ప్రయోజనం? వారి ప్రయాస వ్యర్ధ ప్రయత్నం. నేడు అనేక మంది విశ్వాసులు వారి జీవితాల్లో బాబెలు నిర్మించుకుంటున్నారు. అప్పుడు వారికి మిగిలిందే చివరికి వీరికి మిగులుతుంది. వ్యర్ధంగా పరుగెత్తి, వట్టి చేతులతో దేవుని ముందు ఒక రోజు నిలబడతారు.
క్రీస్తు తన జీవితంలో దేవుని ప్రణాళికలల్లో సంతోషిస్తూ, ఆయనకు లోబడి జీవించడలోనే ఆనందించాడు. అదే ఆయన జీవిత లక్ష్యంగా బ్రతికాడు. క్రీస్తును వెంబడించే వారు తమ జీవితాలకు తామే ప్రణాళికలు రచించుకోవడం ఆపివేసి, దేవుని వాక్యానుసారం జీవిస్తారు(దేవుని చిత్తం కోసం కనిపెడతారు). అందులో నిలిచి ఉండటంలోనే ఆనందిస్తారు. దేవుని మాట నుండి వైదొలగి, తమ సొంత ఆలోచనలను నమ్మి, తీసుకున్న తప్పుడు నిర్ణయంతో ఏదేనులో మొదటి పాపం ఆరంభమైయ్యింది.మన స్వంత(పాపపు)స్వభావం విషయంలో చనిపోయి, దేవుని మాట వినే విషయంలో బ్రతకాలని క్రీస్తు సిలువలో చనిపోయ్యాడు. మార్గం తప్పిన మన జీవితాలను తిరిగి సరైన స్థానం ఉంచడానికే రక్షకుడు తిరిగి లేచాడు. ఏదేనులో పాపం చేసినప్పుడు ఆత్మలో చచ్చిన అవిధేయుడైన మనిషిని-ఆ స్వభావాన్ని, ఆయనతో పాటు సిలువలో చంపివేసి, ఆయనతో పాటు తిరిగి లేపి, మళ్ళీ నూతనంగా ఆత్మలో జన్మింపజేశాడు. ఈ స్వభావం సొంత ప్రణాళికల విషయమై చనిపోయిన స్వభావం. కనుక ఇకను మన కోసం కాక, మన కోసం ప్రాణం పెట్టిన రక్షకుని నిమిత్తం బ్రతకావాల్సినవారము.ఇప్పటికీ ఆ తీర్మానం గూర్చిన స్వేచ్ఛ (విశ్వాసులమైన) మనకుంది.
Comments
Post a Comment