❇ యేసు ఒక కథ చెప్పాడు..
"ఒక మనిషికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. అతడు పెద్ద కొడుకుతో౼ 'బాబూ, నీవు పోయి ఈ రోజు ద్రాక్షతోటలో పని చెయ్యి' అన్నాడు.
అతడు౼'నేను వెళ్ళను' అని జవాబిచ్చాడు. కాని తరువాత మనస్సు మార్చుకొని వెళ్ళాడు.
తండ్రి రెండోవాని దగ్గరకు వెళ్ళి అదేమాట చెప్పాడు.
అతడు౼‘వెళ్తాను నాన్నగారు’ అన్నాడు గాని వెళ్ళలేదు"
'ఈ ఇద్దరిలో ఎవరు ఆ తండ్రి ఇష్టప్రకారం చేసినట్టు?' అని వారిని అడిగాడు.
ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు౼"మొదటివాడే" అని జవాబిచ్చారు.
యేసు౼"నేను మీతో కచ్చితంగా చెప్పేదేమంటే, అన్యాయంగా పన్ను వసూలు చేసేవారు, వేశ్యలు మీకంటె ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు.ప్రవక్తయైన యోహాను నీతి మార్గంలో మీ దగ్గరకు వచ్చాడు గానీ అతణ్ణి మీరు నమ్మలేదు. అయితే పన్ను వసూలు చేసేవారు, వేశ్యలు నమ్మారు. దాన్ని చూసైనా మీరు పశ్చాత్తాపపడి అతనిని నమ్మలేదు. ❇
✔ గమనిస్తే మొదటి వాని మాటల్లో తండ్రి పట్ల గౌరవం లేదు. తిరుగుబాటు స్వరం, తన ఇష్టానుసారంగా ప్రవర్తన కనిపిస్తుంది. కాని ద్వేషించినా, తిరుగుబాటు చేసినా దాపరికం లేదు. వానిలో లోపట బయట ఒకే వ్యక్తి కనిపిస్తాడు. (యదార్థవంతుడు). అటువంటి వారి మనస్సుతో దేవుని స్వరం మాట్లాడితే.. పశ్చాత్తాపడే అవకాశాలు ఉన్నాయి. అలాంటి వారికి నిరీక్షణ వుంది. (వారు ఆయాన్ని బహిరంగంగా తిరస్కరించినప్పటికి కూడా) నిజంగా దేవుడు ఇలాంటి వారిని ఎంతో ప్రేమిస్తాడు. ఆయన ఆత్మను వారి హృదయలకు దగ్గరగా ఉంచి, సరైన సమయంలో ఒప్పుదల లోకి తీసుకొస్తాడు.
✔ కానీ రెండవ వాడిలో మోసపూరితమైన జీవితం ఉంది. స్వరం విధేయుడైనట్లు మృదువుగా మాట్లాడుతుంది కానీ అంతరంగంలో అవిధేయత ఉంది. ఇది వేషధారణ! కపట జీవితం. మొదటి వాడి వలె కఠినమైన మాటలు నేను మాట్లాడానని తన మనస్సు అంతరంగంగా ప్రగల్బాలు పలుకుతుంది. అతిశయిస్తుంది! ఒకవేళ మనం ఈ సంభాషణలో ఉంటే, ఖచ్చితంగా మొదటి వాడు చెడ్డవాడని, రెండోవాడు మంచి జీవితంలో ఉన్నాడని భావిస్తాము. మోసగించబడతాము. కాని ఎవ్వరూ దేవుణ్ని మోసగించలేరు.
✔ యేసు పాపం చేసిన వారి కంటే కూడా, మేము నీతిమంతులం అనుకునే వేషధారులనే ఎక్కువ గద్దించాడు. అలాంటి వారు నిజంగా ఉన్న నీతిమార్గాన్ని ఎన్నడూ గుర్తుపట్టలేరు. వారు రక్షకుని గూర్చి రోజు ధ్యానిస్తూ, భోదిస్తూ..ఆయన వారి కళ్లముందుకు వచ్చినప్పుడు ఆయన్నే ద్వేషించి, చంపారు. నేడు దైవ సంభంధులను గుర్తుపట్టలేని వారు, పరిసయ్యుల సంతానంగా దేవునిచే పిలువబడతారని ఖచ్చితంగా చెప్పవచ్చు(నీవు దేవునితో నడిచే వ్యక్తివైతే ఆయనతో నడుస్తున్న వారినీ గుర్తుపడతావు). వారి హృదయాలు దేవుని ఎదుట చెడిపోయి ఉండటం వల్ల దేవుని మాటకు ఎదురాడుతారు. మంచి పని(మాట) వెనుక, చెడిపోయిన ఉద్దేశ్యాలు కలిగి ఉండొచ్చు.
౼ దేవుణ్ని వెంబడించడం అంటే ఆయన వలె ప్రవర్తించడం. దేవుడు... మాటను, పనిని చూడడు. ఉద్దేశాన్ని, అంతరంగాన్ని లక్ష్యపెడతాడు. కనుక దానిని జరిగించే ఆత్మను వివేచించాలి. యెదుట ఉన్న వారి హృదయాన్ని దైవ కోణంలో చూసినప్పుడు, ఆ వ్యక్తికి ఏమి అవసరమో (కనికరం, ఓదార్పు, గద్దింపు మె|| ) దైవ ప్రేమలో నుండి దేవుడే మనకు అనుగ్రహిస్తాడు.
Comments
Post a Comment