❇ యేసు పునరుద్దారుడైన తర్వాత శిష్యులకు కనిపించాడు. అప్పుడు 12 మంది శిష్యులలో ఒకడైన తోమా వాళ్ళతో లేడు.
తోమా వచ్చినప్పుడు మిగిలిన శిష్యులు౼"మేం ప్రభువును చూశాం" అని అతడితో చెప్పారు.
అప్పుడు అతడు "నేను ఆయన మేకుల గుర్తును చూడాలి. నావేలు ఆ గాయపు రంధ్రం లో ఉంచాలి. అలాగే నేను నా చేతిని ఆయన పక్కలో ఉంచాలి. అప్పుడే నేను నమ్ముతాను" అన్నాడు.
8 రోజులైన తర్వాత మరల ఆయన శిష్యులు లోపల ఉన్నారు. ఈసారి తోమా కూడా వాళ్ళతో ఉన్నాడు. తలుపులు మూసి గడియ వేసి ఉన్నాయి.
అప్పుడు యేసు వాళ్ళ మధ్యకు వచ్చి౼" మీకు శాంతి కలుగు గాక!" అని చెప్పి..ఆయన తోమాను చూసి౼"నీ వేలు ఇలా చాచి నా చేతిని చూడు. అలాగే నీ చెయ్యి చాచి నా పక్కలో పెట్టు. విశ్వాసిగా ఉండు. అవిశ్వాసివి కావద్దు" అన్నాడు.
తోమా ఆయనతో౼"నా ప్రభూ, నా దేవా" అన్నాడు.యేసు౼"నువ్వు నన్ను చూసి నమ్మావు. అయితే నన్ను చూడకుండానే నమ్మిన వాళ్ళు ధన్యులు" అన్నాడు ❇
✔ యేసును సిలువ వేసినప్పుడు, సమాధి చేసినప్పుడు తోమా అక్కడ లేడు. కాని ఆయన పక్కలో పొడిచారని మరొకరు చెప్పినప్పుడు చూడకపోయినా నమ్మాడు(యోహా 19:34, 20:25). కానీ శిష్యులంతా క్రీస్తు పునరుద్దాణం (మరణం నుండి తిరిగి లేవడం) గూర్చి చెప్పినప్పుడు మాత్రం నమ్మలేకపోయ్యాడు. కారణం..మరణం అందరూ పొయ్యే మార్గమే, దానికి ప్రత్యేకగా విశ్వాసముంచాల్సిన అవసరం లేదు. కాని పునరుద్దాణం మీద విశ్వాసం చాలా ప్రాముఖ్యమైనది. పునరుద్దాణం మీద విశ్వాసం ఉంచని వారిని క్రీస్తు అవిశ్వాసిగా పిలిచాడు(యోహా 20:27).
✔ క్రీస్తు తిరిగి లేచాడని నమ్మినప్పుడే ఆయన మన వంటి వాడు కాడని(పాపాన్ని జయించిన వాడని), ఆయనకు పాపంపై మరణంపై సంపూర్ణ విజయం ఉన్నదని, నన్ను పాపం నుండి విడిపించి, నన్ను తిరిగి లేప గల సమర్థుడని విశ్వాసం ఉంచుతున్నామని తెలియజేస్తుంది(రోమా 8:11, I థెస్స 4:14). ఆయన ఎందు కోసం చనిపోయాడన్న సంపూర్ణత, రుజువు పునరుద్దాణంలోనే ఉంది. క్రైస్తవ జీవితానికి ఆయువు పట్టు పునరుద్దాణంలో ఉంది. దీని గూర్చి పరిశుద్ధాత్మ దేవుడు నిశ్చయతను ఇవ్వగా, విశ్వాసం ద్వారా మాత్రమే దీనిని తెల్సుకుంటాము.(పెంతుకోస్తు దినాన పేతురు ప్రసంగించినప్పుడు ప్రజలు ఒప్పించబడ్డారు.అపో 2:23,24,37)
✔ తోమా తాను దేవుని పునరుద్దణాన్ని నిర్ణయిస్తాననట్లుగా మాట్లాడాడు. ఆయన్ను చూడగానే, అర్ధమైన విషయం.. ఆయనే మన విశ్వాసాన్ని బట్టి నిర్ణయిస్తాడని తెల్సుకొన్నాడు. మనమెప్పుడు ఆయన కేంద్రంగా ఉండాలి తప్ప, మనమేదో నిర్ణేతలన్నట్లుగా ఉండకూడదు.ఆయన పరలోక సింహాసనంపై ఉన్నాడు. మనం భూమిపై ఉన్న మంటి వారమని మర్చిపోకూడదు. తోమా శిష్యులతో మాత్రమే పలికిన మాటలు దేవుడు విన్నాడు.ఆయన మనలందరిని స్పష్టంగా తెల్సుకున్నవాడు. అవిశ్వాసం, అల్ప విశ్వాసాల్లో నుండి విశ్వాసంలోకి నడిపించే సహాయకుడు. ఆయన లోపాలను చూపేవాడు మాత్రమే కాడు, ఆ తప్పు నుండి విడిపించే సహాయకుడు. ఆయనకు మహిమ కలుగును గాక! ఆమెన్!!
Comments
Post a Comment